మునావర్ ఫారుఖీ షోపై కొనసాగుతున్న సస్పెన్స్ 

మునావర్ ఫారుఖీ షోపై కొనసాగుతున్న సస్పెన్స్ 
  • శిల్పాకళా వేదికలో ఫారూఖీ కామెడీ షో
  • అడ్డుకుంటామంటున్న బీజేపీ నాయకులు
  • ఎమ్మెల్యే రాజాసింగ్ ముందస్తు అరెస్ట్
  • భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు
  • హైదరాబాద్ లో మునావర్ షో పై సస్పెన్స్
  • ఫీవర్ తో కరోనా టెస్టుకు శాంపిల్స్ పంపిన ఫారుఖీ

స్టాండప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ సిటీలో నిర్వహించనున్న షో వివాదంగా మారుతోంది. ఫారూఖీ షోకు అనుమతి ఇవ్వొద్దంటూ బీజేపీ కోరుతోంది. దీంతో మునావర్ ఫారూఖీ షోకు అనుమతులు ఉన్నాయని మాదాపూర్ డీసీపీ శిల్పవల్లి చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా షోలు నిర్వహించుకోవచ్చన్నారు. మునావర్ ఫారూఖీ కార్యక్రమానికి ఎవరైనా అశాంతి సృష్టించాలని చూస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సాయంత్రం 4 నుంచి షో ముగిసే వరకూ పోలీసులు అన్ని‌చోట్ల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

శిల్పాకళా వేదికలో ఈవెంట్
శనివారం సాయంత్రం 4  నుంచి 8 గంటల వరకు మాదాపూర్​ శిల్పాకళా వేదికలో ఫారూఖీ స్టాండప్​ కామెడీ ఈవెంట్ జరగనుంది. గతంలో ఫారూఖీ చేసిన కామెడీ షోలో హిందూ దేవతలను అవమానించాడని.. ప్రస్తుతం అతడి ఈవెంట్ ​కు అనుమతి ఇవ్వొద్దంటూ బీజేవైఎం నేతలు ఇప్పటికే డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. కానీ, ఈ  షో నిర్వహణకు మాదాపూర్ పోలీసులు పర్మిషన్ ఇవ్వడంతో టికెట్ల అమ్మకాలు జోరుగా సాగాయి. జనవరిలో నిర్వహించాల్సిన ఈ షోను కరోనా కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని నిర్వాహకులు చెబుతున్నారు.  షోను అడ్డుకుంటామని హెచ్చరించిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ​ను  సిటీ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు.  కామెడీ షోకు సైబరాబాద్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

ఫారూఖీ షోపై టెన్షన్ కంటిన్యూ
హైదరాబాద్ లో మునావర్ ఫారూఖీ షో టెన్షన్ కంటిన్యూ అవుతోంది. సిటీలో మునావర్ షోను అడ్డుకొని తీరతామని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, పలు హిందూ సంఘాల నాయకులు హెచ్చరించారు. దీంతో షో జరగనున్న మాదాపూర్ శిల్పకళావేదిక దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. మునావర్ ఫారూఖీ స్టాండ్ అప్ కామెడీ షో కి నిన్న మాదాపూర్ పోలీసులు అనుమతి ఇచ్చారు. బుక్ మై షోలో ఇప్పటి వరకూ 2 వేల టికెట్స్ అమ్ముడుపోయాయి. మరోవైపు మునావర్ షో పై సస్పెన్స్ కొనసాగుతోంది.

మునావర్ ఫరూఖీ షో కు హాజరవుతాడా లేదా అనే అంశంపై ఇంకా క్లారిటీ లేదు. మునావర్ కు ఫీవర్ రావటంతో నిన్న బెంగళూరులో జరగాల్సిన షో వాయిదా పడింది. కరోనా టెస్ట్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నానని ఇన్ స్టాగ్రామ్ లో మునావర్ తెలిపాడు. మరోవైపు శిల్పకళా వేదికలో జరిగే  షో కోసం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం మాదాపూర్ శిల్పకళావేదిక వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. SOT, లా అండ్ ఆర్డర్, మఫ్టీ, స్పెషల్ ఫోర్స్ టీమ్స్ తో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపు 2000 మందికి పైగా పోలీసులతో శిల్పకళా వేదిక చుట్టూ భద్రత ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ఇన్ స్టాగ్రామ్ లో లైవ్ కి మునావర్ ఫారూఖీ రానున్నారు. తన లైవ్ తర్వాత షో కి హాజరవుతాడా..? లేదా అనే అంశంపై క్లారిటీ రానుంది.