
న్యూఢిల్లీ: ఐపీఎల్ ప్లే ఆఫ్స్‌కు ముందు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)కి గుడ్ న్యూస్. భుజం గాయం నుంచి కోలుకున్న ఆస్ట్రేలియా స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ తిరిగి జట్టులో చేరే అవకాశాలున్నాయి. ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోవడంతో స్వదేశానికి వెళ్లిపోయిన హేజిల్‌వుడ్ ఇప్పటి వరకు బ్రిస్బేన్‌లో రిహాబిలిటేషన్‌లో ఉన్నాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న అతను ప్లే ఆఫ్స్ మ్యాచ్‌ల్లో ఆర్సీబీ తరఫున బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం.
ఆర్సీబీ తమ చివరి లీగ్ మ్యాచ్‌ను ఈ నెల 26న లక్నో సూపర్‌జెయింట్స్‌తో ఆడనుంది. ఈ మ్యాచ్‌కు హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండే అవకాశం లేకపోయినా ప్లే ఆఫ్స్ వరకు జట్టులోకి వస్తాడని ఫ్రాంచైజీ భావిస్తోంది. హేజిల్‌వుడ్ లేకపోవడంతో ఆర్సీబీ ఎక్కువగా యష్ దయాల్, నువాన్ తుషారాపై ఆధారపడింది.
ఇప్పడు హేజిల్‌వుడ్ రాకతో బౌలింగ్ మరింత బలోపేతం కానుంది. ఇప్పటి వరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో హేజిల్‌వుడ్ 17.27 యావరేజ్‌తో 18 వికెట్లు తీశాడు. అయితే జూన్ 11 నుంచి లార్డ్స్‌లో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)కు ఆస్ట్రేలియా సిద్ధం అవుతుండటంతో హేజిల్‌వుడ్‌ను ఐపీఎల్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) అనుమతిస్తుందా..? లేదా..? అన్నది కూడా ఉత్కంఠగా మారింది.