
మాలీవుడ్ ఇండస్ట్రీలో రిటైర్డ్ జడ్జి హేమ కమిటీ (Hema Committee Report) రూపొందించిన నివేదక ప్రకంపనలు సృష్టిస్తోంది. హేమ కమిటీ సమర్పించిన నివేదికలో పలు విస్తుపోయే నిజాలు (విషయాలు) మలయాళ పరిశ్రమలో వెలుగుచూశాయి. మలయాళ చిత్ర సీమలో పనిచేసే మహిళలు క్యాస్టింగ్ కౌచ్, లైంగిక వేధింపులు ఎదుర్కొంటున్నారని హేమ కమిటీ నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా ఇపుడు ఒక్కొక్కరు తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపులపై ముందుకొచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఇస్తున్నారు.
దీంతో మాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర దుమారం కొనసాగుతున్న వేళ..మలయాళ సినీ కళాకారుల సంఘం (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్) 'అమ్మ’ (AMMA) అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు స్టార్ హీరో మోహన్ లాల్ (Mohanlal) ప్రకటించారు. ఆయనతో పాటు 17 మంది సభ్యులు ఉన్న పాలక కమిటీ కూడా మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు ‘అమ్మ (AMMA)’ సంఘం మంగళవారం (ఆగస్ట్ 27న) ఓ ప్రకటనలో వెల్లడించింది.
పాలకమండలి సభ్యుల ఆన్‌లైన్ సమావేశంలో మోహన్ లాల్ భావోద్వేగానికి గురయ్యారు. ఈ నిర్ణయం తీసుకునే ముందు మమ్ముట్టితో మోహన్ లాల్ మాట్లాడాడు. నిర్ణయం బాగుందని మమ్ముట్టి కూడా చెప్పారని మోహన్ లాల్ స్పష్టం చేశారు.
‘ఇటీవల AMMA కమిటీ సభ్యులపై కొందరు నటీనటులు చేసిన ఆరోపణల నేపథ్యంలో అధ్యక్ష బాధ్యత నుంచి తప్పుకుంటున్నాను అని' మోహన్ లాల్ అన్నారు. ఈ క్రమంలో మరో రెండు నెలల్లో అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశాన్ని ఏర్పాటు చేసి కొత్త పాలకవర్గాన్ని ఎంపిక చేస్తామని సంఘం తెలియజేసింది. అసోసియేషన్‌ను పునరుద్ధరించి బలోపేతం చేసే సామర్థ్యం ఉన్న నాయకత్వం త్వరలో బాధ్యతలు తీసుకుంటుందని మేము ఆశిస్తున్నాము. మా లోపాలను ఎత్తి చూపినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని అన్నారు.
ఇప్పటివరకు ‘అమ్మ’ సంఘానికి మోహన్‌లాల్ అధ్యక్షుడిగా ఉండగా..నటులు జగదీశ్, జయన్ చేర్తలా, బాబురాజ్, కళాభవన్ షాజన్, సూరజ్ వెంజారమూడు, టొవినో థామస్ తదితరులు సభ్యులుగా ఉన్నారు.
దర్శకుడు రంజిత్, నటులు సిద్ధిఖీ, బాబురాజ్, జయసూర్య, ముకేశ్, సూరజ్ వెంజారమూడు సహా పలువురిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. దర్శకుడు రంజిత్ కూడా ప్రభుత్వ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే రంజిత్‌పై రాజకీయ ఒత్తిళ్లు పెరుగుతున్న తరుణంలో..ఇటీవల అమ్మ జనరల్ సెక్రటరీగా ఉన్న సిద్ధిఖీ తన పదవికి రాజీనామా చేశారు.
జస్టిస్ హేమ కమిటీ:
2017 లో మాలీవుడ్ నటి భావనపై కొందరు దుండగులు కారులో లైంగిక దాడికి పాల్పపడిన విషయం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ ఘటనకు కారకుడు మలయాళ అగ్రహీరో దిలీప్ కీలక నిందితుడిగా తేలింది. మాలీవుడ్ లో మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు రావడంతో నివేదిక ఇవ్వాలని 2019 లో అప్పటి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. దీనికి జస్టిస్ కే హేమ(రిటైర్డ్) నేతృత్వం వహించగా, మాజీ బ్యూరోక్రాట్ కెబి వల్సలకుమారి, నటి శారత ఇద్దరు సభ్యులుగా ఉన్నారు. మాలీవుడ్ లో మహిళలు కాస్టింగ్ కౌచ్ ఎదుర్కొంటున్నారని జస్టిస్ హేమ కమిటీ వెల్లడించింది.