వన్డేల్లో స్టార్క్‌‌ రీఎంట్రీ.. మూడు వన్డేలు, రెండు టీ20లకు జట్లను ప్రకటించిన ఆసీస్‌‌

వన్డేల్లో స్టార్క్‌‌ రీఎంట్రీ.. మూడు వన్డేలు, రెండు టీ20లకు జట్లను ప్రకటించిన ఆసీస్‌‌
  • వెన్నునొప్పితో కమిన్స్ దూరం.. కెప్టెన్‌‌గా మార్ష్​ కొనసాగింపు
  • మూడు వన్డేలు, రెండు టీ20లకు జట్లను ప్రకటించిన ఆసీస్‌‌ 

మెల్‌‌బోర్న్: ఆస్ట్రేలియా స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్‌‌ దాదాపు ఏడాది విరామం తర్వాత వన్డే క్రికెట్‌‌లో రీఎంట్రీకి రెడీ అయ్యాడు. సొంతగడ్డపై ఈ నెల 19 నుంచి ఇండియాతో జరిగే మూడు వన్డేల సిరీస్‌‌లో స్టార్క్‌‌ బరిలోకి దిగనన్నాడు. ఈ సిరీస్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 15 మందితో కూడిన జట్టును  మంగళవారం ప్రకటించింది. వెన్ను గాయం నుంచి పూర్తిగా కోలుకోని  రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ జట్టుకు దూరంగా ఉండగా.. ఆల్‌‌రౌండర్ మిచెల్ మార్ష్ కెప్టెన్‌‌గా కొనసాగనున్నాడు. 

గత నెలలో టీ20 ఫార్మాట్‌‌కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్క్, యాషెస్ సిరీస్‌‌ను దృష్టిలో ఉంచుకుని వర్క్‌‌లోడ్‌‌ మేనేజ్‌‌మెంట్‌‌లో భాగంగా గత కొంతకాలంగా వన్డేలకు దూరంగా ఉన్నాడు. తను చివరగా గతేడాది నవంబర్‌‌‌‌లో పాకిస్తాన్‌‌పై వన్డే మ్యాచ్ ఆడాడు. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్‌‌కు దూరంగా ఉన్నాడు.  స్టార్క్‌‌తో పాటు అన్‌‌క్యాప్డ్ బ్యాటర్ మాథ్యూ రెన్‌‌షా, మాట్ షార్ట్, మిచ్ ఓవెన్ వంటి ఆటగాళ్లకు కూడా సెలెక్టర్లు వన్డే జట్టులో చోటు కల్పించారు. వన్డేలతో పాటు ఐదు టీ20ల సిరీస్‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌లకు కూడా టీమ్‌‌ను ఎంపిక చేశారు. 

ఈ టీమ్‌‌ను కూడా మిచెల్ మార్ష్‌‌ నడిపించనున్నాడు.  గాయంతో బాధపడుతున్న  స్టార్ ఆల్‌‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌‌వెల్ జట్టుకు దూరంగా ఉండగా.. షెఫీల్డ్‌‌ షీల్జ్‌‌ టోర్నీలో ఆడుతున్న వికెట్ కీపర్ అలెక్స్ క్యారీ తొలి వన్డేకు దూరంగా ఉండనున్నాడు. కామెరూన్ గ్రీన్ వన్డే సిరీస్ ముగిసిన తర్వాత  టెస్టులకు సన్నద్ధమయ్యేందుకు డొమెస్టిక్‌‌  క్రికెట్ ఆడనున్నాడు. ఈ నెల 19న పెర్త్‌‌లో తొలి వన్డే, 23న రెండో వన్డే (అడిలైడ్),  25న మూడో వన్డే ( సిడ్నీ) షెడ్యూల్ చేశారు. టీ20 సిరీస్‌‌లో తొలి రెండు మ్యాచ్‌‌లు   ఈనెల 29న కాన్‌‌బెరాలో, 31న మెల్‌‌బోర్న్‌‌లో జరుగుతాయి. 

ఆస్ట్రేలియా వన్డే టీమ్‌‌:

మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్‌‌లెట్, అలెక్స్ క్యారీ, కూపర్ కనోలీ, బెన్ డ్వారిషస్, నేథన్ ఎలీస్‌‌ , కామెరూన్ గ్రీన్, జోష్ హేజిల్‌‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మిచెల్ ఓవెన్, మాథ్యూ రెన్‌‌షా, మాథ్యూ షార్ట్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా.

టీ20 టీమ్‌‌ (తొలి రెండు మ్యాచ్‌‌లకు): మిచెల్ మార్ష్ (కెప్టెన్), సీన్ అబాట్, జేవియర్ బార్ట్‌‌లెట్, టిమ్ డేవిడ్, బెన్ డ్వారిషస్‌‌, నేథన్ ఎలీస్, జోష్ హేజిల్‌‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కునెమాన్, మిచెల్ ఓవెన్, మాథ్యూ షార్ట్, 
మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.