గ్రామాల్లో ఐదుకు మించి కేసులుంటే ఐసొలేషన్ సెంటర్

గ్రామాల్లో ఐదుకు మించి కేసులుంటే ఐసొలేషన్ సెంటర్
  •  కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక
     

కరీంనగర్: కరోనా కేసుల నియంత్రణపై దృష్టిపెట్టిన కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక గ్రామాల్లో ఐదుకు మించి కరోనా కేసులు నమోదైతే వెంటనే ఐసొలేషన్ సెంటర్ ప్రారంభించాలని ఆదేశించారు. జిల్లాలోని వైద్యాధికారులు ఎంపీడీవోలు, తహశీల్దారు లతో ఇవాళ ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనాను ఎక్కడికక్కడ కట్టడి చేయాల్సిన అవసరం ఉందని.. దీనికోసం గ్రామాలు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. 
జిల్లాలోని ప్రతి కరోనా టెస్టింగ్ సెంటర్ లో నిర్వహించిన కోవిడ్ పరీక్షల వివరాలను గ్రామాల వారీగా సంబంధిత మండల అధికారులకు ఇవ్వాలని, 5 కన్నా ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చిన గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో  ఐసొలేషన్ కేంద్రం ఏర్పాటు చేసి పాజిటివ్ వచ్చిన వ్యక్తులను అందులో చేర్పించాలని ఆదేశించారు. 
కరీంనగర్ జిల్లాలో కోవిడ్ పాజిటివ్ రేటు 31 నుండి  7.5 శాతానికి తగ్గిందని, ఇదే స్ఫూర్తితో కోవిడ్ చైన్ బ్రేక్ చేయాలని ఆయన కోరారు. కరోనా కట్టడి కోసం మరిన్ని చర్యలు తీసుకోవాలని, మార్కెట్ యార్డులు,  క్వారీలు, బస్టాండ్లు, జన సాంద్రత ఎక్కువ గల ప్రాంతాలలో మొబైల్ టీముల ద్వారా  కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. వివాహా శుభకార్యాలకు, దహన సంస్కారాలకు ఎక్కువ మంది హాజరు కాకుండా నియంత్రించాలని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేయాలని ఆయన సూచించారు.