బూత్​స్థాయిలో ప్రచారం హోరెత్తాలి:దీపాదాస్​ మున్షీ

బూత్​స్థాయిలో ప్రచారం హోరెత్తాలి:దీపాదాస్​ మున్షీ
  • కాంగ్రెస్ నేతలకు రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి దీపాదాస్​ మున్షీసూచన
  • ప్రచార కమిటీ సభ్యుల కృషి‌‌తో అధికారంలోకి: మధు యాష్కీ
  • అత్యధిక ఎంపీ సీట్లు గెలవాలి: పొన్నం ప్రభాకర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో కంటే రెట్టింపు ఉత్సాహంతో లోక్‌‌సభ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాలని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌‌చార్జి దీపాదాస్ మున్షీ సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, మంచి పనులను బూత్‌‌ స్థాయికి తీసుకెళ్లాలన్నారు. శుక్రవారం గాంధీ భవన్‌‌లో ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి ఆధ్వర్యంలో పీసీసీ ప్రచార కమిటీ సమావేశం జరిగింది. ముఖ్య అథితులుగా దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు. అనంతరం లో‌‌క్‌‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై ప్రచార కమిటీ ప్రతినిధులకు దీపాదాస్ మున్షీ మార్గనిర్దేశం చేశారు. ఆమె మాట్లాడుతూ.. జిల్లాల్లో ఉన్న ప్రధానమైన అంశాలను, ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. మధుయాష్కి మాట్లాడుతూ.. 17 పార్లమెంటు నియోజకవర్గాలతో పాటు అందులోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోనూ ప్రచార కమిటీ ప్రతినిధులను నియమిస్తామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం 100 రోజుల ప్రజా పాలనలో చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 

అందర్నీ కలుపుకొని పోతున్నం: మంత్రి పొన్నం

పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైన అన్ని వర్గాలను కలుపుకొని ముందుకు పోతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఖజానాను ఖాళీ చేసినప్పటికీ.. ఒకటో తేదీనే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇస్తుందని చెప్పారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ మహేశ్‌‌ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే  సత్యనారాయణ, ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ కో ఇన్‌‌చార్జి రోహిత్ చౌదరి, ఏఐసీసీ కార్యదర్శి పవన్, ప్రచార కమిటీ కో కన్వీనర్ తీన్మార్ మల్లన్న, రమ్యారావు తదితరులు పాల్గొన్నారు.

కాంగ్రెస్‌‌‌‌లో చేరిన పల్లె లక్ష్మణ్, ఆరేపల్లి మోహన్‌‌

తెలంగాణ గౌడ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే ఆరేపల్లి మోహన్‌‌తో పాటు పలువురు మాజీ కార్పొరేటర్లు, నాయకులు శుక్రవారం కాంగ్రెస్‌‌లో చేరారు. గాంధీ భవన్‌‌లో మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ సమక్షంలో తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌‌చార్జ్ దీపాదాస్ మున్షీ వీరికి కండువా కప్పి కి ఆహ్వానించారు. కాంగ్రెస్‌‌లో  చాలా ఏళ్లు ఉన్న పల్లె లక్ష్మణ్ రావు గౌడ్.. ఏఐసీసీ, పీసీసీలో సభ్యుడి హోదాలో పనిచేశారు.  కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్‌‌ను వీడిన ఆయన.. మళ్లీ సొంత గూటికి చేరుకున్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ , ఎమ్మెల్యే సత్యనారాయణ, రోహిత్ చౌదరి పాల్గొన్నారు.