పత్తి సాగు పెంచుదాం

పత్తి సాగు పెంచుదాం
  • 75 లక్షల ఎకరాల్లో  వేయించేలా వ్యవసాయ శాఖ ఏర్పాట్లు
  • పత్తి, కంది పంటలను ప్రోత్సహించేలా చర్యలు
  • రైతులకు అవగాహన కల్పించాలని ఏఈవోలకు ఆదేశం

హైదరాబాద్‌, వెలుగు: వానాకాలం సీజన్​మొదలైంది. రాష్ట్రంలో కోటిన్నర ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేసిన వ్యవసాయశాఖ.. ఏయే పంటలు ఎంతమేర వేయాలన్నదానిపై దృష్టి పెట్టింది. కనీసం 75 లక్షల ఎకరాల్లో పత్తి సాగయ్యేలా కసరత్తు చేయాలని, రైతులకు అవగాహన కల్పించాలని కింది స్థాయి అధికారులను ఆదేశిస్తోంది. వరిని 45 లక్షల ఎకరాలకు పరిమితం చేయాలని, కంది సాగును15 లక్షల ఎకరాలకు పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రంలోని అగ్రికల్చర్‌ క్షేత్రస్థాయి అధికారులతో ఉమ్మడి జిల్లాల వారీగా పంటల సాగుపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. గ్రామాల వారీగా ఏ పంట ఎంత వేయాలి, విత్తనాల ఏర్పాటు, ఎరువులు నిల్వలు తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంత్రులు, ఉన్నతస్థాయి అధికారులు.. ఏఈవోలు, ఇతర అధికారులను సన్నద్ధం చేస్తున్నారు. సాధారణ పంటలు పోగా పదిలక్షల ఎకరాల్లో హార్టీకల్చర్‌ క్రాప్స్‌ వేసుకునేలా చర్యలు తీసుకుంటున్నారు.

కంది రెట్టింపు సాగు..

విదేశాల నుంచి కందుల దిగుమతి నిలిపివేయడంతో పంటకు మార్కెట్‌లో డిమాండ్‌ ఉంది. అందుకే సాధారణ సాగు కంటే కంది పంటను ఎక్కువగా సాగు చేయాలని వ్యవసాయశాఖ రైతులను కోరుతోంది. వచ్చే సీజన్‌లో15 లక్షల ఎకరాలకు పైగా విస్తరించాలని అవగాహన కల్పిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంస్థ నాఫెడ్‌ ద్వారా కందులను కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో కొంత సమస్య తప్పుతుందని, మిగతా కొద్ది పంటను రైతులు ప్రైవేటు వ్యాపారులకు అకమ్ముకునే అవకాశం ఉందని సర్కారు భావిస్తోంది. అందుకే రైతులను కంది సాగుకు ప్రోత్సహించాలని సీజన్‌ సన్నాహక సమావేశాల్లో వ్యవసాయశాఖ ఏఈవోలను ఆదేశిస్తోంది.

45 లక్షల ఎకరాల్లో వరి

ఈ వానాకాలం సీజన్‌లో వరిని 45 లక్షల ఎకరాల వరకు పరిమితం చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరుతోంది. వానాకాలం పంటలో కేంద్రం నిర్దేశించిన టార్గెట్‌ వరకు మాత్రమే కొనేందుకు పంటను పరిమితం చేసేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాల ద్వారా చెబుతున్నారు. కాగా కేంద్ర ప్రభుత్వం ఎరువుల వినియోగం తగ్గించాలని గ్రీన్‌ మెన్యూర్‌ను ప్రోత్సహిస్తోంది. ఇందులో భాగంగా పిల్లిపెసర, జీలుగ, జనుము వంటి పచ్చిరొట్ట ఎరువుల కోసం 33 శాతం రాయితీతో విత్తనాలను సరఫరా చేస్తోంది.

పత్తికే ప్రాధాన్యం..

ఈ వానాకాలం సీజన్‌లో 75 లక్షల ఎకరాలకు పత్తి పంటను విస్తరించాలని వ్యవసాయశాఖ సన్నాహాలు చేస్తోంది. దీనికి సరిపడా విత్తనాలు అందుబాటులో ఉంచాలని సీడ్‌ కంపెనీలను ఆదేశించింది. పత్తిని సీసీఐ లేదా ధర ఎక్కువ ఉంటే ప్రైవేటు వ్యాపారులు కొనుగోలు చేస్తరు. అందుకే కొనుగోలు సమస్య ఉండదనే.. చేతికి మట్టి అంటకుండా ఉండేందుకు పత్తి పంటనే ఎక్కువ వేయాలని రైతులను ప్రోత్సాహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈసారి ధర కూడా భారీగా  రావడంతో ఎక్కువ మంది రైతులు పత్తిసాగు చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే నకిలీ విత్తనాల బెడదను అరికట్టడం, విత్తన ప్యాకెట్లపై అదనపు వసూళ్లను కట్టడి చేయడంపై ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.