అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యమివ్వాలె

అన్ని పార్టీలు బీసీలకు ప్రాధాన్యమివ్వాలె

హైదరాబాద్: మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు బీసీలకే టికెట్  కేటాయించాలని రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు నీల వెంకటేశ్ డిమాండ్ చేశారు. హిమాయత్ నగర్ లోని ఏఐటీయుసీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... దేశ జనాభాలో అత్యధికంగా ఉండే బీసీలను ఎవరూ పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. మునుగోడు నియోజకవర్గంలో 70 శాతం ఉన్న బీసీలు వారికి కనపడటం లేదా అని ప్రశ్నించారు. కేవలం ఎన్నికల సమయాల్లోనే బీసీలు పార్టీలకు కనబడతారని చెప్పారు. బీసీలను ఓట్లు వేసే యంత్రాలుగా అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయని మండిపడ్డారు.

మునుగోడు నియోజకవర్గంలో గతంలో అగ్రకులాలకు చెందిన నాయకులకు అవకాశం ఇస్తే...  వారు అభివృద్ధి చేయకుండా తమ ఆస్తులను కాపాడుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.ఉపఎన్నికలో బీసీలకు టికెట్లు కేటాయించకపోతే... తమ తరపున ఓ బీసీ అభ్యర్థిని నిలబెడతామని స్పష్టం చేశారు. ఇప్పటికైనా అన్ని పార్టీలు బీసీలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.