కేసీఆర్ కు మున్సిపల్ ఎన్నికల భయం పట్టుకుందన్నారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్. జనవరి 30న సభ అని చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ముస్లిం మైనార్టీ ఓట్లను గంపగుత్తగా టీఆర్ఎస్ కు వేయించుకోవాలన్న దురుద్దేశం కనిపిస్తోందని ఆరోపించారు. అందుకు అసదుద్దీన్ ఓవైసీ సాయం తీసుకోవడం కేసీఆర్ అవకాశవాదానికి నిదర్శనం అన్నారు. ఒకవైపు ఎంఐఎం తమ మిత్రపక్షం అంటూనే హైదరాబాద్ లో హిందూ ఓట్లు చీల్చడానికి పాతబస్తీలో టీఆర్ఎస్ అభ్యర్థులను నిలబెట్టిన చరిత్ర కేసీఆర్ ది అని విమర్శించారు.
పంచాయతీ, స్థానిక ఎన్నికల్లో ఇద్దరు సంతానం కంటే ఎక్కువ ఉంటే పోటీకి అనర్హులుగా గతంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందనీ… మున్సిపల్ ఎన్నికలలో కొన్ని వర్గాలను సంతృప్తి పరచడానికే ఇద్దరు సంతానం నిబంధన తొలగించిందని ఆరోపించారు. మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కేసీఆర్ కుట్రలను తిప్పికొట్టాలని జనాన్ని కోరారు లక్ష్మణ్. పార్లమెంటులో పౌరసత్వ సవరణ చట్టాన్ని టీఆర్ఎస్ ఎందుకు వ్యతిరేకించిందో పార్టీ అధ్యక్షుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేసీఆర్.. రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఫెడరల్ ఫ్రంట్ పేరుతో అందరినీ ఏకం చేస్తానని చెప్పిన కేసీఆర్ బొక్కబోర్లాపడ్డారని గుర్తుంచుకుంటే మంచిదన్నారు.

