కరోనా వైరస్ ను తరిమికొట్టేందుకు ఈ ఆదివారం మనమంతా ఎవరికి వారే స్వీయ నిర్భంధంలో ఉండాలని పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్. మార్చి 22న 14 గంటలపాటు జనతా కర్ఫ్యూ ను విజయవంతం చేయాలన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతీ ఒక్కరూ ఈ కర్ఫ్యూ లో ఉండి ఐక్యతను ప్రదర్శించాలన్నారు. దేశ స్ఫూర్తిని చాటాలని చెప్పారు
శనివారం కరీంనగర్ లో పర్యటించిన ఆయన.. అక్కడి జనాల్లో పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యంగా మన రాష్ట్రంలోని కరీంనగర్ లోనే ఈ సమస్య తీవ్రత ఎక్కువగా ఉందని, ఇండోనేషియా నుంచి వచ్చిన పది మందికి పాజిటివ్ రావడంతో పరిస్థితి ఆందోళనకరంగా మారిందన్నారు. అయినా కూడా భయపడాల్సిన అవసరమేమీ లేదన్నారు. ఇంతకు ముందు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నామని, ఇది పెద్ద సమస్య కాదని చెప్పారు.
ఢిల్లీలో రాజకీయ నాయకులు ఏమాత్రం దగ్గు, జలుబు ఉన్న పరీక్షలు చేయించుకొని ఇంటికే పరిమితమవుతున్నారని సంజయ్ తెలిపారు. మనం కూడా స్వచ్ఛందంగా సహకరించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ 15 రోజులు బయటికి రావొద్దని పిలుపునిచ్చారు. ఏ ఒక్కరు నిర్లక్ష్యంగా ఉన్నా వైరస్ అందరికీ వ్యాపిస్తుందని , కాబట్టి కరోనా ను తరిమి కొట్టాలంటే ఏ మాత్రం నిర్లక్ష్యం గా వ్యవహరించవద్దన్నారు.

