నర్సన్న సన్నిధి నుంచి బండి యాత్ర మొదలు

నర్సన్న సన్నిధి నుంచి బండి యాత్ర మొదలు

రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మూడవ విడత ప్రజా సంగ్రామ యాత్రకు శ్రీకారం చుడుతున్నారు.  మంగళవారం  యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమవనుంది.  24 రోజుల పాటు 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్ల మేర బండి సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. యాదాద్రి భువనగిరి , నల్గొండ, జనగాం, వరంగల్ హన్మకొండ జిల్లాల మీదుగా బండి మూడో విడత పాదయాత్ర జరగనుంది. మొత్తం ఐదు జిల్లాల్లో  ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్ పూర్, వర్ధన్న పేట, పరకాల, వరంగల్ వెస్ట్, వరంగల్ ఈస్ట్ వంటి 12 నియోజకవర్గాల్లోని 25 మండలాల్లో  పాదయాత్ర కొనసాగుతుంది. 

యాదగిరి గుట్టలో ప్రత్యేక పూజలతో..
ఆగస్టు 2న బండి సంజయ్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. స్వామి వారి ఆశీర్వాదం తీసుకొని అక్కడే లక్షమందితో సభ నిర్వహించనున్నారు. సభ తర్వాత యాదాద్రి నుంచి మూడో విడత ప్రజా సంగ్రామ పాదయాత్ర ప్రారంభం అవుతుంది.  ఆగస్టు 26న  హన్మకొండ జిల్లాలోని భద్రకాళి ఆలయం వద్ద యాత్ర ముగియనుంది. 

రెండు విడతల కంటే..మూడో విడత విభిన్నంగా..
గత రెండు పాదయాత్రల కంటే ఈ సారి విభిన్నంగా చారిత్రక, తెలంగాణ సాయుధ, ఉద్యమ పోరాటాల ప్రాంతాల మీదుగా బండి సంజయ్ పాదయాత్ర కొనసాగనుంది. పోచంపల్లి, గండ్రాంపల్లి, విసునూరు, ఖిలాషాపూర్, కొత్తపేట, ఐనవోలు మల్లన్న ఆలయం మీదుగా కాలినడక సాగించనున్నారు. అటు ఆగస్టు 7న చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో సభను నిర్వహించనున్నారు. 

ప్రజా సమస్యలే  పాదయాత్ర ప్రధాన ఎజెండా..
మూడో విడత ప్రజా సంగ్రామ యాత్రలో స్థానిక సమస్యలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపేందుకు లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. అంతేకాదు..టీఅర్ఎస్ కు బీజేపీయే ప్రత్యామ్నాయం అన్న సంకేతాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు బీజేపీ ప్రయత్నం చేయనుంది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుద్యోగులు, మహిళలు, రైతులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించనున్నారు. ప్రజల్లో ఉద్యమస్పూర్తిని ఈ యాత్ర ద్వారా రగిలించాలని బీజేపీ కార్యచరణ రూపొందించింది. అలాగే ప్రజలకు బీజేపీ అండగా ఉంటుందని భరోసాను కల్పించనుంది. 

రెండు దశల పాదయాత్రలు సక్సెస్..
మొదటి దశ పాదయాత్రను బండి సంజయ్ చార్మినార్  భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి ప్రారంభించారు. గ్రేటర్ లో  బీజేపీ బలాన్ని పెంచుకునేందుకు మొదటి దశ యాత్రను బండి సంజయ్ సద్వినియోగం చేసుకున్నారు.  ఆ తర్వాత రెండో దశ పాదయాత్ర  చారిత్రాత్మక  జోగులాంబ దేవాలయం నుంచి  ప్రారంభించారు.  జిల్లాల్లో బీజేపీ నాయకులతో మాట్లాడుతూ..వారితో కలిసిపోయారు. వారిలో భరోసా నింపారు. ప్రస్తుతం మూడో విడత యాదాద్రి నుంచి మొదలుపెట్టనున్నారు. కీలక నియోజకవర్గాల్లో పాదయాత్రగా వెళ్తూ..బీజేపీ ప్రజలకు అండగా నిలుస్తుందన్న సంకేతాలు పంపాలని యోచిస్తున్నారు.