
బీజేపీ బరాబర్ హిందువుల పార్టీ అని, హిందూ ధర్మానికి అడ్డం వచ్చిన వాళ్లను తొక్కేస్తామని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి నియంత, నికృష్ట ముఖ్యమంత్రి అని బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకుల బాక్సులు బద్ధలు కొడతామంటూ సవాల్ విసిరారు. తెలంగాణలో బియ్యం, డబుల్ బెడ్రూమ్, రోడ్లు, లైట్లు, టాయిలెట్ల పైసలన్నీ కేంద్రానివేనని, చివరికి TRS వాళ్ళను బొంద పెట్టే శ్మశానాల పైసలు కూడా కేంద్రానీవేనన్నారు.. అన్నీ కేంద్రం ఇస్తే కేసీఆర్ ఏమి చేస్తాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
బంగళాలు మునగలేదు కాబట్టే వరదల సమయంలో కేసీఆర్ బయటకు రాలేదని సంజయ్ ఎద్దేవా చేశారు. నష్టంపై ఇంటింటికీ సర్వే చేసి నష్టపరిహారం ఇవ్వాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. తాము ఛత్రపతి శివాజీ వారసులమైతే లాడెన్, బాబర్, అక్బర్ వారసుడు కేసీఆర్ అని సంజయ్ చెప్పారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన ఎంఐఎంతో దోస్తీ చేస్తున్న కేసీఆర్‌ను బొంద పెడతామని, హిందువులను అవమానిస్తున్న ఎంఐఎంకు తగిన బుద్ధి చెప్తామని సంజయ్ హెచ్చరించారు. పేదలకు కష్టమొచ్చినప్పుడు పరామర్శించకపోవడం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని, రాష్ట్రంలో ప్రతి అభివృద్ధి కార్యక్రమంలోనూ కేంద్రం నిధులు ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు.