మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు : జీవన్ రెడ్డి

మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని రూ. 5 లక్షల కోట్ల అప్పుల పాల్జేసిండు : జీవన్ రెడ్డి

రాష్ట్రం ఏర్పడే నాటికి రూ. 60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ తొమ్మిదేళ్లలో రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయిందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ పాలనలో దోపిడీ రెట్టింపైందని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేలా రాబోయే సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయన నివాసంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయ నియామకాల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలిపారు. కాంగ్రెస్ పాలనలో విద్య కోసం విద్య వాలంటీర్లు వ్యవస్థతో కొనసాగించినట్లు పేర్కొన్నారు. అధికారికంగా 18-20 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, టెట్ ఉందనే విషయాన్ని సీఎం కేసీఆర్ మరిచి పోయారని విమర్శించారు.

సమాజ నిర్మాణానికి దోహదపడే బోధన నిర్లక్ష్యానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫిజికల్ పరీక్షల్లో 800 మీటర్ల రన్నింగ్ ను 1600 మీటర్లకు, 3.80 మీట్లరకు 4 మీటర్లు పెంచారన్నారు. దీనివల్ల అభ్యర్థులు మానసికంగా కుంగిపోతున్నారని, ఫిజికల్ ఈవెంట్ లో గుండెపోటుతో మృతి చెందుతున్న విషయాన్ని ప్రస్తావించారు. సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న క్రమంలో సడలింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా నిబంధనలు పెట్టడం సరికాదని, కేసుల పరిష్కారంలో సాంకేతిక విజ్ఞానం పెరిగిన నేపథ్యంలో శారీరక సామర్థ్య పరీక్షలకు సడలింపునివ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రగతి భవన్ ముట్టడికి పిలుపునిస్తే. రాత్రి పోలీస్ స్టేషన్ కు తరలించడం ఏమిటని నిలదీశారు. వారేమైనా తీవ్రవాదులా అని ప్రశ్నించారు. ప్రగతి భవన్ చుట్టూ వందలాది మంది పోలీసులు ఉండడం చూస్తే వారే ముట్టడి చేస్తున్నట్టు కనపడుతోందని ఎద్దేవా చేశారు.