Telangana Global Summit : తెలంగాణ రైజింగ్అన్స్టాపబుల్.. ‘గ్వాంగ్ డాంగ్’ తరహాలో రాష్ట్రాభివృద్ధి: సీఎం రేవంత్రెడ్డి

Telangana Global Summit : తెలంగాణ రైజింగ్అన్స్టాపబుల్.. ‘గ్వాంగ్ డాంగ్’ తరహాలో రాష్ట్రాభివృద్ధి: సీఎం రేవంత్రెడ్డి
  • ప్రపంచ అగ్రరాజ్యాల స్థాయికి రాష్ట్రాన్ని తీసుకెళ్తం
  • కష్టమైన పనే కావొచ్చు.. కానీ, అందరి సహకారంతో సాధ్యమే
  • 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీయే లక్ష్యం
  • దేశ జీడీపీలో మన వాటా 10 శాతానికి చేరాలి.. ఇదే మా విజన్
  • మహాత్మా గాంధీ, అంబేద్కర్ స్ఫూర్తితోనే తెలంగాణ రోడ్​ మ్యాప్​
  • రాష్ట్ర ప్రజల కలల సాకారానికి కట్టుబడి ఉన్నామని వెల్లడి
  • ఘనంగా ప్రారంభమైన ‘తెలంగాణ రైజింగ్​ - 2047’ గ్లోబల్​ సమిట్​

హైదరాబాద్, వెలుగు: తెలంగాణను చైనాలోని అత్యంత సంపన్నమైన 'గ్వాంగ్ డాంగ్'  ప్రావిన్స్ తరహాలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. కేవలం 20 ఏండ్లలోనే గ్వాంగ్ డాంగ్ ప్రపంచంలోనే అత్యధిక పెట్టుబడులను, వృద్ధిని సాధించిందని.. అదే మోడల్ ను తెలంగాణలోనూ అమలు చేస్తామని స్పష్టంచేశారు. ఇందుకోసం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు ప్రత్యేక జోన్లుగా విభజిస్తున్నట్లు వివరించారు. సోమవారం ఫ్యూచర్​ సిటీలో ‘తెలంగాణ రైజింగ్​– 2047’ గ్లోబట్​ సమిట్​లో సీఎం రేవంత్​రెడ్డి మాట్లాడారు. 

‘‘నిన్నటి వరకు ఇదొక కల, ఒక ప్రణాళిక మాత్రమే! కానీ, ఇప్పుడు మీరందరూ భాగస్వాములుగా చేరడంతో నాకు నిన్నటి కంటే ఎక్కువ ఆత్మవిశ్వాసం వచ్చింది. మీ అందరి మద్దతుతో లక్ష్యాలను సాధిస్తం. తెలంగాణ రైజింగ్ ఈజ్ అన్​స్టాపబుల్​(తెలంగాణ వికాసం.. అప్రతిహతం)” అని పేర్కొన్నారు. అందరూ ఈ ప్రగతిలో భాగం కావాలని ఆయన కోరారు. ఇకపై తాము చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ వంటి దేశాలను స్ఫూర్తిగా తీసుకోవడమే కాకుండా.. ఆ దేశాలతో నేరుగా పోటీ పడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. 

నాకు డెడ్​లైన్​గా మరింత సమయం ఇవ్వండి

తెలంగాణలో అద్భుతమైన అవకాశాలున్నాయని, 2034 నాటికి రాష్ట్రాన్ని 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే తమ లక్ష్యమని సీఎం రేవంత్​ చెప్పారు. ప్రస్తుతం దేశ జనాభాలో తెలంగాణ వాటా దాదాపు 2.9 శాతమే ఉన్నప్పటికీ.. దేశ జీడీపీలో 5 శాతం వాటాను అందిస్తున్నామని.. అయితే 2047 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటాను 10 శాతానికి పెం చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. 

ఈ విజన్ కష్టంగా అనిపించవచ్చని, కానీ తాము చేయగలమని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ఏదైనా పని కష్టంగా ఉంటే, దాన్ని వెంటనే చేద్దాం.. ఒకవేళ అది అసాధ్యం అనిపిస్తే, నాకు డెడ్ లైన్ గా మరికొంత సమ యం ఇవ్వండి’’ అని తాను తన టీమ్ కు చెప్తుంటానని సీఎం తెలిపారు. 3 ట్రిలియన్​ డాలర్ల లక్ష్య సాధన కోస మే తెలంగాణను మూడు స్పష్టమైన జోన్లుగా విభజించా మని చెప్పారు. దీన్ని ‘క్యూర్’ , ‘ప్యూర్’, ‘రేర్’గా పిలుస్తా మని తెలిపారు. ఇందులో క్యూర్​ అంటే ‘కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ’ (సేవలు), ప్యూర్​ అంటే ‘పెరి అర్బ న్ రీజియన్ ఎకానమీ’(తయారీ రంగం), రేర్​ అంటే ‘రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీ’ (వ్యవసాయం) అని వివరించారు.

గాంధీ, అంబేద్కర్  స్ఫూర్తితో ముందుకు..!

స్వాతంత్ర్యం వచ్చిన 1947 ఆగస్టు 15 అర్ధరాత్రి వేళ, మన జాతి నిర్మాతలు దేశ భవిష్యత్తు కోసం ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారని సీఎం రేవంత్ ​రెడ్డి తెలిపారు. దేశ వాగ్దానాలను నెరవేర్చడానికి అప్పటి నాయకులు రాజ్యాంగ పరిషత్​ను ఏర్పాటు చేసి, చర్చలు జరిపి, భారత్ ను ఒక సార్వ భౌమ, ప్రజాస్వామ్య, సోషలిస్ట్, సెక్యులర్ రిపబ్లిక్​గా తీర్చిదిద్దే కొత్త రాజ్యాంగాన్ని రచించారని పేర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ వేసేందుకు తాము కూడా మహాత్మా గాంధీ,  అంబేద్కర్ సహా నాటి రాజ్యాంగ నిర్మాతలను స్ఫూర్తిగా తీసుకున్నామని చెప్పారు. 

అందరి సహకారంతోనే విజన్​

తెలంగాణ రాష్ట్రం కోసం మన ప్రజలు దశాబ్దాల పాటు పోరాడారని, సోనియా గాంధీ, అప్పటి ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2014లో మన కల సాకారమైందని, తెలంగాణ భారతదేశపు అత్యంత పిన్న వయసున్న రాష్ట్రంగా ఆవిర్భవించిందని సీఎం రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. పదేండ్ల తర్వాత, ఇప్పుడు తాము రాష్ట్రాన్ని దేశంలోనే అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భారత రాజ్యాంగ నిర్మాణం తరహాలోనే, తెలంగాణ భవిష్యత్తుపై నిపుణులతో చర్చించి, భారత్ 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే 2047 నాటికి మనం ఏం సాధించగలమనే దానిపై ప్రణాళికలు రచించామని, అలా పుట్టిందే ఈ ‘తెలంగాణ రైజింగ్ –2047’ స్వప్నమని సీఎం రేవంత్​రెడ్డి వివరించారు. ‘

‘పౌరుల ఆకాంక్షలు, కలలను తెలుసుకున్న తర్వాత.. అధికారుల సాయం, కేంద్ర ప్రభుత్వ నిపుణులు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , చివరిగా నీతి ఆయోగ్  సహకారంతో ఈ విజన్ ను రూపొందించాం. గ్లోబల్ సమిట్ ప్రారంభం సందర్భంగా వ్యాపార, కార్పొరేట్, విధానపరమైన, దౌత్య, ప్రభుత్వ రంగాలకు చెందిన దిగ్గజాలు రావడం అదృష్టంగా భావిస్తున్నాం” అని పేర్కొన్నారు. చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ ల నుంచి స్ఫూర్తి పొంది, ఇప్పుడు వాటితో పోటీకి సిద్ధమయ్యామని, ఆయా దేశాలను పెట్టుబడులకు ఆహ్వానిస్తున్నామని సీఎం రేవంత్​రెడ్డి చెప్పారు. 

ఎలక్ట్రిక్ కారును నడిపిన సీఎం రేవంత్

ఒలెక్ట్రా గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్  రూపొందించిన సరికొత్త ఒలెక్ట్రా ఎలక్ట్రిక్  కారును సీఎం రేవంత్ రెడ్డి  ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్  గ్లోబల్ సమిట్​లో జరుగుతున్న భారత్  ఫ్యూచర్  సిటీ ప్రాంగణంలో సీఎం  లాంఛనంగా ఈవీ కారును ఆవిష్కరించారు. అంతేకాకుండా ఆ కారును కొద్ది దూరం నడిపారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి, మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి కారును పరిశీలించారు. ఒలెక్ట్రా సీతారాంపూర్  మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఈ కారును డెవలప్  చేశారు. ఈ వెహికల్ లో రెండు బ్యాటరీలు ఉంటాయి. ఇండిజీనియస్  మాడ్యులర్  స్కేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బోర్డు ఫ్లాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాంతో వివిధ వేరియంట్లతో సెడాన్, ఎస్ యూవీ మోడళ్లను రూపొందించారు. కారును ఆవిష్కరించిన అనంతరం ఒలెక్ట్రా గ్రీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టెక్ నూతన ఎలక్ట్రిక్ బస్సు (12 మీటర్ల సూపర్ లగ్జరీ బస్సు) ను కూడా సీఎం రేవంత్  పరిశీలించారు. - హైదరాబాద్, వెలుగు