మెట్రో2 ప్రాజెక్టుపై కేంద్రాన్ని రాష్ట్రం సంప్రదించలేదు : అశ్వినీ వైష్ణవ్

మెట్రో2 ప్రాజెక్టుపై కేంద్రాన్ని రాష్ట్రం సంప్రదించలేదు : అశ్వినీ వైష్ణవ్
  • కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ఇచ్చిన నిధులపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
  • తెలంగాణలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి రాష్ట్ర సర్కార్ సహకరిస్తలే
  • వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు రూ.521 కోట్లు కేటాయించినం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్రం సహకరించడం లేదన్న మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను కేంద్ర రైల్వే శాఖ అశ్వినీ వైష్ణవ్ ఖండించారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల లెక్కలు సరిగ్గా తెలుసుకుని మంత్రి కేటీఆర్ మాట్లాడితే బాగుంటుందని అశ్వినీ వైష్ణవ్ సూచించారు. రైల్వేలను ప్రైవేటుపరం చేస్తారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు.  ఎట్టి పరిస్థితుల్లో రైల్వేలను ప్రైవేటుపరం చేసే ప్రసక్తే లేదన్నారు. రైల్వే శాఖ చేస్తున్న అభివృద్ధి పనుల తీరును తెలుసుకుంటే అలాంటి కామెంట్లు చేయరని విమర్శించారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉన్నా.. భూ సేకరణ, డీపీఆర్ ల విషయంలో బీఆర్ఎస్ సర్కార్  కేంద్రానికి  సహకరించడం లేదని చెప్పారు. రాష్ట్ర సర్కార్ సహకారం లేనిదే కేంద్రం ఒంటరిగా తెలంగాణను అభివృద్ధి చేయలేదన్నారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో అశ్విని వైష్ణవ్ మాట్లాడారు. రాయదుర్గం – శంషాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం సంప్రదించలేదని ఆయన తెలిపారు.

20 కొత్త ఎంఎంటీఎస్ ట్రైన్లను నడుపుతం

మౌలిక వసతులు, అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ దృష్టి పెడితే కేంద్రం నుంచి మరిన్ని నిధులు వస్తాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 2009 నుంచి 2014 వరకు రూ.886 కోట్ల రైల్వే కేటాయింపులు జరిగితే.. 2014 నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు రూ.4,418 కోట్లు కేటాయించామని తెలిపారు.  రూ.29,581 కోట్ల రైల్వే ప్రాజెక్టుల పనులు తెలంగాణలో జరుగుతున్నాయని వివరించారు. మరో 39 రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులూ జరుగుతున్నాయని చెప్పారు. విభజన చట్టంలో కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ అంశం ఉందన్నారు. తెలంగాణలో వ్యాగన్ తయారీ కేంద్రం ఏర్పాటుకు కేంద్రం రూ.521 కోట్లు కేటాయించిందని, దీని కోసం 160 ఎకరాలు అవసరముండగా.. రాష్ట్ర సర్కారు 150 ఎకరాలే ఇచ్చిందని ఆరోపించారు. తెలంగాణలో మరో 20 ఎంఎంటీఎస్ ట్రైన్లను నడుపుతామని, ఇవి సికింద్రాబాద్ – మేడ్చల్ మధ్య నడుస్తాయన్నారు. ‘‘ రాష్ట్రానికి 2 ఎక్సలెన్సీ కేంద్రాలను కేటా యించాం. హైదరాబాద్ లో 6 జీ నెట్‌వర్క్, రైల్వే టెక్నాలజీ డెవలప్ మెంట్ సెంటర్స్ ను ఏర్పాటు చేస్తున్నాం. సికింద్రాబాద్ స్టేషన్ కు రూ.715 కోట్లు కేటాయించాం” అని వివరించారు.

పార్టీ నేతలతో అశ్విని వైష్ణవ్ సమావేశం

బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ నేతలతో అశ్విని వైష్ణవ్ సమావేశమయ్యారు. తెలంగాణలో పార్టీ పరిస్థితి, రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సాయం, కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను రైల్వే మంత్రి వారికి వివరించారు. ఈ సందర్భంగా బీజేపీ నేతల మధ్య హాట్ హాట్ డిస్కషన్ సాగినట్లు సమాచారం. రైల్వే మంత్రితో ఓ సీనియర్ నేత మాట్లాడుతూ.. ‘‘కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు ఇచ్చిన నిధుల వివరాలను మాకు ఇటు రాష్ట్ర పార్టీ, అటు జాతీయ పార్టీ ఇవ్వకపోవడం వల్ల బీఆర్ఎస్ సర్కార్ కు సరైన కౌంటర్ ఇవ్వలేకపోతున్నాం” అని చెప్పినట్లు తెలిసింది. దీంతో మరో సీనియర్ లీడర్ వెంటనే అడ్డుకునేందుకు ప్రయత్నించడం.. సదరు నేతను మాట్లాడనివ్వాలని అక్కడే ఉన్న ఎమ్మెల్యే కోరడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ప్రేమేందర్ రెడ్డి, విశ్వేశ్వర్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాశ్ రెడ్డి, రజనీ, ఎన్వీ సుభాష్  పాల్గొన్నారు.

త్వరలో.. పేదలు లేని ఇండియా

శనివారం సాయంత్రం సోమాజిగూడలోని ఓ హోటల్ లో కేంద్ర బడ్జెట్ పై మేధావుల సదస్సును బీజేపీ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి అశ్విని వైష్ణవ్ చీఫ్ గెస్టుగా హాజరయ్యారు. 2027 నాటికి ఇండియాను నంబర్ వన్ గా చేసే బడ్జెట్ ఇది అన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలో ఇండియా ముందుందని చెప్పారు. 2014 కు ముందు దేశంలో రోజుకు 4 కిలోమీటర్ల ట్రాక్ నిర్మాణం చేస్తే.. ఇప్పుడు రోజుకు 12 కిలోమీటర్ల ట్రాక్ నిర్మిస్తున్నామని అన్నారు. పేదలు లేని ఇండియా త్వరలో కనిపించబోతున్నదని తెలిపారు. ఇండియాలో ఎకానమీ గ్రోత్ స్పీడ్ గా ఉందన్నారు. త్వరలో మూడు ప్రధాన మార్గాల్లో వందే భారత్ ఎక్స్ ప్రెస్  రైళ్లు దక్షిణ మధ్య రైల్వేకు వస్తాయని తెలిపారు. 100 కిలోమీటర్ల దూరం వరకు వందే మెట్రో రైళ్లు నడుస్తాయన్నారు. ఇవి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్నాయని, మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర బడ్జెట్ పై రాష్ట్రం తరపున ఏర్పాటు చేసిన బడ్జెట్ యాక్టివిటీ కమిటీ కన్వీనర్  యెన్నం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షత వహించారు.  కొండా విశ్వేశ్వరరెడ్డి, ప్రేమేందర్ రెడ్డి, వివిధ రంగాలకు చెందిన వారు పాల్గొన్నారు.