- బాధ్యులపై చర్యలు తీసుకోవాలని
- స్టేట్‌ఎలక్షన్ సెక్రటరీ ఆదేశం
- బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదు: నల్గొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి
హైదరాబాద్, వెలుగు: నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి పంచాయతీ ఎన్నిక వ్యవహారంలో సిబ్బంది నిర్లక్ష్యంపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నెల 11న ఎన్నికలు, కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగినప్పటికీ.. ఆ తర్వాత ఎన్నికల సామగ్రిని భద్రపరచడంలో సిబ్బంది వైఫల్యంపై కమిషన్ సీరియస్ అయ్యింది. ఎన్నికల మెటీరియల్ విషయంలో సిబ్బంది బాధ్యతారహితంగా వ్యవహరించారని కమిషన్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించింది.
దీనిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కౌంటింగ్ ఆఫీసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని నల్గొండ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఇలా త్రిపాఠిని రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మంద మకరందు ఆదేశించారు. కాగా, పోలైన ఓట్లు డ్రైనేజీలో దొరికిన ఘటనపై ఇలా త్రిపాఠి స్పందించారు.
దీనికి సంబంధించి ఇప్పటికే స్టేజ్–2 ఆర్వోపై కలెక్టర్ వేటు వేశారు. ఎంపీడీవో, ఆర్వో సమక్షంలో ఆర్డీవోతో విచారణ జరిపించామన్నారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్‌కు సరిపోయాయన్నారు. ఎలాంటి బోగస్ ఓటింగ్, రిగ్గింగ్ జరగలేదని తెలిపారు. బ్యాలెట్ ఓట్లు సరిపోల్చుకున్నాకే, గెలిచిన, ఓడిన అభ్యర్థుల వద్ద సంతకాలు తీసుకున్నామని పేర్కొన్నారు. పోలింగ్, కౌంటింగ్ ప్రక్రియలో లోపాలు లేవన్నారు.
