SMAT 2025: 5 వికెట్లు పడినా ఇద్దరే కొట్టేశారు: పంజాబ్‌కు షాక్ ఇచ్చిన ఆంధ్ర.. భారీ ఛేజింగ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

SMAT 2025: 5 వికెట్లు పడినా ఇద్దరే కొట్టేశారు: పంజాబ్‌కు షాక్ ఇచ్చిన ఆంధ్ర.. భారీ ఛేజింగ్‌లో థ్రిల్లింగ్ విక్టరీ

సయ్యద్‌‌ ముస్తాక్‌‌ అలీ ట్రోఫీలో ఆంధ్ర జట్టు పటిష్టమైన పంజాబ్ పై సూపర్ విక్టరీ కొట్టింది. ఆదివారం (డిసెంబర్ 14) పూణే వేదికగా  మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ముగిసిన ఈ మ్యాచ్ లో ఛేజింగ్ చేస్తూ 5 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని అందుకుంది. 206 పరుగుల టార్గెట్ ను ఒక బంతి మిగిలి ఉండగానే ఛేజ్ చేసి తొలి విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. భారీ ఛేజింగ్ లో మారంరెడ్డి హేమంత్ రెడ్డి(109) సెంచరీకి తోడు SDNV ప్రసాద్ (53) హాఫ్ సెంచరీతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఛేజింగ్ లో ఆంధ్ర 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసి గెలిచింది.   

206 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో ఆంధ్రకు ఘోరమైన ఆరంభం లభించింది. పంజాబ్ పేసర్ గుర్నూర్ బ్రార్ ధాటికి ఓపెనర్లు శ్రీకర్ భరత్ (1), అశ్విన్ హెబ్బార్ (4) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు. ఆ కాసేపటికే నితీష్ కుమార్ రెడ్డి డకౌట్ కావడంతో ఆంధ్ర 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో రికీ భూయ్ (15), పైలా అవినాష్ (13) తో కలిసి హేమంత్ స్వల్ప బాగస్వామ్యాలను నెలకొల్పాడు. రికీ భూయ్, పైలా అవినాష్  స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో ఆంధ్ర 56 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగింది. 

ALSO READ :  గెలవాలంటే బౌలర్లదే భారం.. పాక్‪పై బ్యాటింగ్‪లో నిరాశపరిచిన టీమిండియా

ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ లో  మారంరెడ్డి హేమంత్ రెడ్డి, SDNV ప్రసాద్ తో కలిసి చెలరేగి ఆడాడు. ఇద్దరూ పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడుతూ అలవోకగా పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లు ఎంత ప్రయత్నించినా ఈ జోడీని విడగొట్టలేకపోయారు. ఈ క్రమంలో హేమంత్ తన సెంచరీ.. ప్రసాద్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకుని మ్యాచ్ ను గెలిపించారు. అంతకముందు మొదట బ్యాటింగ్  చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. అల్మొప్రీత్ సింగ్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. సెంచరీతో మ్యాచ్ గెలిపించిన హేమంత్ రెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.