కొంతమంది తమ స్వార్ధం కోసం గాంధీజీని వాడుకుంటున్రు

కొంతమంది తమ స్వార్ధం కోసం గాంధీజీని వాడుకుంటున్రు

హైదరాబాద్: రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, అందుకే రాష్ట్రానికి కేంద్రం నుంచి అవార్డులు వస్తున్నాయని రాష్ట్ర ఆర్ధిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. పటాన్ చెరులో ఏర్పాటు చేసిన గాంధీ పార్కును ఆదివారం ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డితో కలిసి మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గాంధీజీ అనుసరించిన శాంతి సిద్ధాంతం ప్రపంచం మొత్తానికి స్పూర్తిగా నిలిచిందన్నారు. ఎందరో ప్రపంచ నేతలు గాంధీజీని తమ గురువుగా భావించారని చెప్పారు. అలాంటి గొప్ప నాయకుణ్ని ఇవాళ కొంత మంది తమ స్వార్ధ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

టీఆర్ఎస్ పాలనలో  ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో తాగు, సాగు నీటికి కొదువ లేకుండా చేశామని, కరెంట్ కష్టాలను కూడా లేకుండా చేశామని చెప్పారు. హైదరాబాద్ కు కృష్ణ జలాలను తెచ్చి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించామన్నారు. పటాన్ చెరులో 250 కోట్లతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధిలో దూసుకుపోతున్నాయని, అది చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఓ వైపు తమ పని తీరుకు మెచ్చి కేంద్రం అవార్డులిస్తుంటే... ఇంకో వైపు తమ ప్రభుత్వంపై బీజేపీ నాయకులు విమర్శలు చేయడం అర్ధరహితమన్నారు. మిషన్ భగీరథకు నిధులు ఇవ్వాలని నీతి ఆయోగ్ సిపారస్ చేసినా... కేంద్రం మాత్రం ఒక్క రూపాయి ఇవ్వలేదని హరీశ్ రావు ఫైర్ అయ్యారు. బీజేపీ నాయకులను ప్రజలు నమ్మబోరని, వచ్చేది కూడా తమ ప్రభుత్వమేనని హరీశ్ రావు ధీమా వ్యక్తం చేశారు.