
- బకాయిల కోసం నిలిపేసిన నెట్‌వర్క్ హాస్పిటళ్లు
- చర్చలకు పిలిచిన మంత్రి ఈటల
- బకాయిలపై తలో మాట
- 1,500 కోట్లన్న హాస్పిటళ్లు, 600 కోట్లేనన్న సర్కారు
- ఫలితం తేలకుండానే ముగిసిన చర్చలు
- సమ్మె కొనసాగుతుందన్న అసోసియేషన్
హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ మొత్తం బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సమ్మెకు దిగిన నెట్‌వర్క్ హాస్పిటల్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో సమ్మె కొనసాగిస్తున్నట్టు డాక్టర్లు ప్రకటించారు. శుక్రవారం నుంచి ఆరోగ్యశ్రీ, ఈజేహెచ్‌ఎస్ సేవలను నెట్‌వర్క్ హాస్పిటల్స్ నిలిపేశాయి. దీంతో ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ దవాఖాన్ల యాజమాన్యాలను చర్చలకు పిలిచారు. హైదరాబాద్‌లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సుమారు రెండున్నర గంటల పాటు చర్చలు జరిగాయి. రూ.1,500 కోట్లు బకాయిలు ఉన్నాయని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ చెబుతోంది. రూ.300 కోట్లు చెల్లించామని, మరో రూ.600 కోట్లే పెండింగ్ ఉన్నాయని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫలితం తేలకుండానే చర్చలు ముగిశాయి. బకాయిలకు సంబంధించిన వివరాలను నెట్‌వర్క్ ఆస్పత్రులకు అందజేస్తామని అధికారులు చెప్పారు. వివరాలు ఇచ్చిన తర్వాత తాము చర్చించుకుని చర్చలకు వస్తామని, అప్పటివరకూ సమ్మె కొనసాగిస్తామని డాక్టర్లు ప్రకటించారు. ఒకట్రెండు రోజుల్లో మరోసారి చర్చలు జరిగే అవకాశముంది.
దశల వారీగా చెల్లిస్తాం: ఈటల
ఆరోగ్యశ్రీతో నెట్‌వర్క్ హాస్పిటల్స్ ఒప్పందాన్ని పున సమీక్షించేందుకు ఓ కమిటీ వేస్తామని అసోసియేషన్‌కు ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్యాకేజ్ ధరలపై సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చర్చల తర్వాత మంత్రి ఈటల చెప్పారు. బకాయిలు రూ.600 కోట్లు మాత్రమే ఉన్నాయని, వాటిని కూడా దశలవారీగా చెల్లిస్తామని చెప్పారు.
ఇదే విషయాన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌కు చెప్పామని, వారు సేవలను కొనసాగిస్తారని ఆశిస్తున్నామని అన్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్ల ప్రతినిధులతోనూ మంత్రి సమావేశమయ్యారు. ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగిస్తామని ఈ హాస్పిటల్స్ ప్రతినిధులు స్పష్టం చేశారన్నారు.
సమ్మె కొనసాగుతుంది: హాస్పిటళ్లు
బకాయిల విడుదలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ రాకేశ్ అన్నారు. చివరి దశ బకాయిలనే ప్రభుత్వం లెక్కించి రూ.600 కోట్లని చెబుతోందని, 6 దశల్లో లెక్కింపు ఉం టుందని, మిగిలిన దశలను కలిపి రూ.1,500 కోట్లని చెబుతున్నామని వివరించారు. ప్రభుత్వం నుంచి వివరాలు అందాక, మరోసారి చర్చిస్తామన్నారు. అప్పటివరకూ సమ్మె కొనసాగుతుందన్నారు.
ప్రభుత్వం వెల్లడించిన బకాయిల వివరాలు(రూ.కోట్లలో)
హాస్పిటల్ టైప్ ఆరోగ్యశ్రీ ఈజేహెచ్‌ఎస్ మొత్తం
ప్రైవేటు 344.17 113.57 457.74
ప్రభుత్వ 122.71 9.59 132.3
మొత్తం 466.88 123.16 590.04
ఈ ఆర్థిక సంవత్సరంలో దవాఖాన్లకు చెల్లింపులు (రూ.కోట్లలో)
హాస్పిటల్ టైప్ ఆరోగ్యశ్రీ ఈజేహెచ్‌ఎస్ మొత్తం
ప్రైవేటు 199.24 128.24 327.48
ప్రభుత్వ 68.14 17.28 85.42
మొత్తం 267.38 145.52 412.9