నిజామాబాద్‌ జిల్లా అగ్రికల్చర్‌ కాలేజీకి గ్రీన్‌ సిగ్నల్‌ !..విద్యార్థుల భవిష్యత్‌కి సర్కార్ భరోసా

నిజామాబాద్‌ జిల్లా అగ్రికల్చర్‌ కాలేజీకి గ్రీన్‌ సిగ్నల్‌ !..విద్యార్థుల భవిష్యత్‌కి సర్కార్ భరోసా
  •     టీయూ లేక  వర్ని రీసెర్చ్ సెంటర్ ల్యాండ్ కేటాయింపు
  •     టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్​గౌడ్​ ప్రకటనతో స్టూడెంట్ల హర్షం

నిజామాబాద్‌, వెలుగు : జిల్లా విద్యా రంగంలో మరో చారిత్రాత్మక అడుగు పడింది. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న గవర్నమెంట్‌ అగ్రికల్చర్‌ డిగ్రీ కాలేజీ స్థాపనకు రాష్ట్ర సర్కార్​గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది.  ఈ నెల 11న నిజామాబాద్‌లో టీపీసీసీ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్‌ గౌడ్‌ స్పష్టతనిచ్చారు. 2006లో  తెలంగాణ వర్సిటీ ఏర్పడిన నాటి నుంచి స్టూడెంట్స్​ డిమాండ్​ చేస్తున్న గవర్నమెంట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ  ఈ విద్యా సంవత్సరం నుంచే ప్రారంభం కాగా,  అడ్మిషన్లు కూడా పూర్తయ్యాయి. 

అదే తరహాలో రుద్రూర్‌లో నడుస్తున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కాలేజీకి సమీపంలోనే వ్యవసాయ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయనున్నారు. ఈ క్రమంలో టీయూ లేదా వర్ని రీసెర్చ్‌ సెంటర్‌ భూమిలో కాలేజీకి స్థలం కేటాయించే అవకాశం ఉంది.  స్థానిక విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక బయటకు వెళ్లకుండానే నాణ్యమైన వ్యవసాయ విద్య అందుబాటులోకి వస్తుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

వర్సిటీనా.. రీసెర్చ్​ స్టేషన్​లోనా..?  

గవర్నమెంట్‌ అగ్రికల్చర్‌ డిగ్రీ కాలేజీ స్థాపన ఎక్కడ అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. కాలేజీని టీయూ (తెలంగాణ యూనివర్సిటీ)లోనా, లేక రుద్రూర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌లోనా అన్న విషయం చర్చనీయాంశంగా మారింది. టీయూ స్థాపనతో నిజామాబాద్‌ జిల్లాలో ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. 

కేవలం ఆరు కోర్సులతో మొదలైన యూనివర్సిటీలో ప్రస్తుతం 32 కోర్సులు నడుస్తున్నాయి. బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీతో పాటు 12 సెల్ఫ్‌ ఫైనాన్స్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల జూలైలో గవర్నమెంట్‌ ఇంజినీరింగ్‌ కాలేజీకి గ్రీన్‌ సిగ్నల్‌ లభించగా, ఏఐ, డేటా సైన్స్‌ కోర్సుల్లో 71 మంది విద్యార్థులు చేరారు. ఇప్పుడు ప్రభుత్వం అగ్రికల్చర్‌ కాలేజీ స్థాపనపై దృష్టి సారించింది. 577 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న టీయూలో వంద ఎకరాలు కేటాయించి కాలేజీ ఏర్పాటు చేయాలని స్థానిక నేతలు, విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో ప్రభుత్వం అగ్రికల్చర్‌ వర్సిటీ టీంను రెండు సార్లు పరిశీలనకు పంపింది. హార్టికల్చర్‌ డైరెక్టర్‌ యాస్మిన్‌ బాషా నేతృత్వంలోని టీం రుద్రూర్‌ అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ను పరిశీలించింది. అక్కడ 320 ఎకరాల విస్తీర్ణంలో సైంటిస్టులు వరి, చెరకు వంటి పంటల కొత్త వంగడాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇదే రీసెర్చ్‌ సెంటర్‌ ఆధారంగా 2016లో పాలిటెక్నిక్‌ అగ్రికల్చర్‌, ఫుడ్‌ టెక్నాలజీ కాలేజీలు ప్రారంభమయ్యాయి. ఇప్పటివరకు ఐదు బ్యాచ్‌లు పూర్తి చేసి సుమారు 500 మంది విద్యార్థులు పట్టాలు అందుకున్నారు. 

రుద్రూర్‌లో స్టాఫ్‌ క్వార్టర్లు, ఆడిటోరియం వంటి సదుపాయాలు సిద్ధంగా ఉండటంతో అక్కడే డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేస్తే మేలని టీం సర్కార్‌కు నివేదించింది. పాలిటెక్నిక్‌, రీసెర్చ్‌ సెంటర్‌లు ఉండటం విద్యార్థులకు లాభదాయకమని అభిప్రాయపడింది. అయితే మరోవైపు నేషనల్‌ హైవేకు సమీపంలో ఉన్న టీయూలో కాలేజీ ఏర్పాటు చేయాలని మరో వర్గం పట్టుబడుతోంది. నిర్ణయం తేలిన వెంటనే జీవో విడుదల కానుంది. 

గత 11న టీపీసీసీ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మహేశ్​కుమార్‌ గౌడ్‌ జిల్లాకు అగ్రికల్చర్‌ కాలేజీ మంజూరైందని ప్రకటించినప్పటికీ, ఎక్కడ ఏర్పాటు చేస్తారన్నది మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చర్‌ చదవడానికి జిల్లా విద్యార్థులు మహారాష్ట్ర, హైదరాబాద్‌, జగిత్యాల జిల్లాలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో, ఇక స్థానికంగా వ్యవసాయ విద్యా అవకాశాలు విస్తరించనున్నాయి.