
- కరెంట్ కొనుగోలు బకాయిలపై దిగొచ్చిన రాష్ట్రం
- తీర్చేందుకు రూ.10 వేల కోట్ల అప్పుకు గ్యారంటీ
- నర్జీ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: డిస్కంల ద్వారా ఇప్పటి వరకు కొనుగోలు చేసిన కరెంట్ బకాయిలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. రెండు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంలు) బకాయిలు రూ.10 వేల కోట్లు తీర్చేందుకు అప్పుకు అనుమతించింది. ఈ మేరకు అప్పులు తీసుకునేందుకు కౌంటర్ గ్యారంటీ ఇస్తూ ఎనర్జీ డిపార్ట్మెంట్ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. కరెంట్ కొనుగోలు సొమ్ము చెల్లించకుండా సతాయించడం, బకాయిలు అంతకంతకు పేరుకుపోతుండటంతో తెలంగాణ డిస్కంలతో పాటు ఆ జాబితాలో ఉన్న ఇతర రాష్ట్రాల డిస్కంలు రోజూవారీ ఇంధన ఎక్స్ఛేంజీలో కరెంటు కొనకుండా కేంద్రం ఆపింది.
పేరుకుపోయిన బకాయిలను నెలవారీ వాయిదాల పద్ధతిలో తీర్చేందుకు కేంద్రం ఇటీవల రాష్ట్రాల డిస్కంలకు అనుమతించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. ఏండ్లుగా పెండింగ్లో ఉన్న కరెంట్ కొనుగోలు బాకీలు తీర్చేందుకు డిస్కంల తరఫున అప్పు తీసుకోవడానికి అనుమతించింది. డిస్కంలు కట్టాల్సిన బకాయిల సొమ్మును కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన ‘గ్రామీణ విద్యుద్ధీకరణ సంస్థ’(ఆర్ఈసీ) లేదా విద్యుత్ ఆర్థిక సంస్థ (పీఎఫ్సీ) అప్పు రూపంలో ఇచ్చి చెల్లిస్తాయి. దీంతో డిస్కంల పేరుతో ఉన్న బకాయిలు తీరిపోతాయి. కానీ డిస్కంల పేరుతో ఆర్ఈసీ లేదా పీఎఫ్సీ వద్ద అప్పు ఉంటుంది. ఈ అప్పు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం పూచీకత్తు ఇవ్వాలని కేంద్రం కండీషన్ పెట్టింది. దీంతో తాజా అప్పుకు గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఈ అప్పును డిస్కంలే తిరిగి నెలవారీ వాయిదాల రూపంలో ఆర్ఈసీకి చెల్లిస్తాయి. ఇలా చెల్లించడానికి తొలి రెండేండ్ల పాటు మారటోరియం విధించారు.
మెరిట్ ఆధారంగానే పదోన్నతులు
డైరెక్ట్ రిక్రూట్మెంట్ విధానంలో విద్యుత్ సంస్థల్లో ఉద్యోగాల్లో చేరినవారికి.. వారు ఎంపిక పరీక్షలో పొందిన ర్యాంకు ఆధారంగా పదోన్నతి ఇవ్వాలని ఆదేశిస్తూ రాష్ట్ర ఇంధనశాఖ శనివారం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఇంతకాలం ఈ పదోన్నతులపై ఉద్యోగుల మధ్య వివాదం నెలకొంది. రోస్టర్ పాయింట్ల ఆధారంగానే పదోన్నతి ఇవ్వాలని కొందరు ఉద్యోగులు పట్టుబడుతున్నారు. దీనిపై ట్రాన్స్ కో జూన్ 4న రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఉద్యోగం పొందినప్పటి ర్యాంకు ప్రాతిపదికగా తీసుకుని పదోన్నతులు ఇవ్వాలని రోస్టర్ పాయింట్లు కాదని ప్రభుత్వం వివరణ ఇచ్చింది.