కంటోన్మెంట్‌లో పురాతన భవనాల కూల్చివేత.. తొలగిస్తేనే స్కై వే !

కంటోన్మెంట్‌లో పురాతన భవనాల కూల్చివేత.. తొలగిస్తేనే స్కై వే !

కంటోన్మెంట్, వెలుగు:  కంటోన్మెంట్‌లో చారిత్రక భవనాలు కనుమరుగుయ్యే పరిస్థితి నెలకొంది. వీటిని బ్రిటీషు కాలంలో మిలటరీ ఆఫీసర్లకు నిర్మించారు. సికింద్రాబాద్​నుంచి శామీర్​పేట్​వరకు డబుల్ ఎలివేటెడ్ స్కైవేలను నిర్మించేందుకు రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో సుమారు 104  ఏండ్ల కాలం నాటి భవనాలను కూల్చివేతకు అధికారులు ప్రతిపాదించారు.  అయితే.. కంటోన్మెంట్ లోని భవనాలను కూల్చివేయాలా..? లేక మరేదైనా మార్పులు చేయాలా.? అనేదానిపై తుది నివేదిక తయారీపై సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.  కాగా.. పురాతన భవనాల కూల్చివేతతోనే స్కైవేల నిర్మాణం ఈజీ అవుతుందని, ఇప్పటికే అధికారులు ఒక ఏకాభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

117  పురాతన భవనాలు 

బ్రిటీష్​ కాలంలో కంటోన్మెంట్​పరిధిలో  వందలాది భవనాలు నిర్మించారు. వీటిలో ప్రస్తుతం 117  పురాతన భవనాలు ఉన్నాయి.  ఇందులో కొన్ని మిలటరీ రూల్స్ కు విరుద్ధంగా కమర్షియల్​భవనాలుగా మార్చి వ్యాపారులకు అద్దెకు ఇచ్చారు.  వాటిల్లో వ్యాపారులు, ఇతర వ్యక్తులు అక్రమ అదనపు నిర్మాణాలు కూడా చేపట్టారు. ఇప్పుడు వాటిని ఖాళీ చేయాలని కంటోన్మెంట్ బోర్డు అధికారులు నోటీసులు జారీ చేసినా పెద్దగా స్పందించడం లేదు. మరోవైపు ఎలివేటెడ్ స్కైవేల నిర్మాణానికి ఇప్పటికే ఉన్న రోడ్లను విస్తరించాల్సి ఉంది. 

అందుకు స్కైవేలు నిర్మించే రూట్ లోని సుమారు104 భవనాలను పూర్తిగా, పాక్షికంగా కూల్చివేస్తేనే  నిర్మాణం ఈజీగా సాగుతుందని అధికారులు నిర్ణయించారు. ఇందుకు భూ సర్వే కూడా చేశారు. కంటోన్మెంట్​లోని ప్రైమ్ ​లోకేషన్​లో పురాతన భవనాలు ఉన్నప్పటికీ,  అవి కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ స్వాధీనంలో ఉండగా.. వాటిని స్థానికంగా లోకల్ ​మిలటరీ అథారిటీ  డిఫెన్స్ ​ఎస్టేట్స్​అధికారి పర్యవేక్షణ చేస్తుంటారు. మిలటరీ రూల్స్ మేరకు వాటిని అమ్మడం, కూల్చడం సాధ్యం కాదు. ఏవైనా మార్పులు, చేర్పులపైనే  కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ఓకే చెబితేనే పని పూర్తవుతుంది. 

భూ బదలాయింపు అగ్రిమెంట్ చేసుకోగా.. 

స్కైవేల నిర్మాణానికి కావలసిన భూమిని బదలాయింపు ద్వారా ఇచ్చేందుకు రాష్ర్ట ప్రభుత్వంతో అగ్రిమెంట్ కుదిరింది. రక్షణ శాఖ భూమి బదిలీకి కంటోన్మెంట్ ​బోర్డుకు అనుమతులు ఇచ్చింది. దీంతో బోర్డు అధికారులు  భూ బదిలీ జరిగే ప్రాంతంలోని 104 పురాతన భవనాలను గుర్తించేందుకు సిద్ధం అయ్యారు. భవనాలను కమర్షియల్​గా, ఇతర కార్యక్రమాలకు వాడుతున్నందున యజమానులకు బోర్డు అధికారులు నోటీసులు జారీ చేశారు.

నివాసితుల్లో ఆందోళన  

 భవనాలను ఖాళీ చేయాలని డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్ నోటీసులు జారీ చేయగా నివాసితులు, ఆక్యుపెన్సీ హక్కు దారుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఆయా భవనాలను నివాసాలకు మాత్రమే డిఫెన్స్​మినిస్ట్రీ అద్దెకు ఇచ్చింది. అయితే.. చాలా మంది వాటిని కమర్షియల్​గా వాడుతున్నారు. ఇక స్కైవేల నిర్మాణాలపై అధికారులు దృష్టి సారించడంతో  కమర్షియల్​గా వినియోగించేవారు ఆందోళనలో పడ్డారు. అర్ధంతరంగా బోర్డు స్వాధీనం చేసుకుంటే తమ వ్యాపారాలకు నష్టం జరుగుతుందని ఆందోళన చెందుతున్నట్టు పలువురు తెలిపారు. 

భవనాల తనిఖీలకు ప్రత్యేక కమిటీ 

కంటోన్మెంట్​లో దాదాపు 117 భవనాలు ప్రైవేటు వ్యక్తుల స్వాధీనంలో ఉండగా.. వాటిలో చాలా వరకు కమర్షియల్​గా వాడుతున్నట్టు బోర్డు అధికారుల దృష్టికి వచ్చింది. బోర్డు పరిధిలో ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోని భవనాలను నివాసానికి వాడుతున్నారా..? లేక వ్యాపారానికి వినియోగిస్తున్నారా..? అనే అంశాలను పరిశీలించి తనిఖీలను చేపట్టనున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు. ఇందుకు డిఫెన్స్ ఎస్టేట్స్ ఆఫీస్, లోకల్ మిలిటరీ అథారిటీ (ఎల్ఎంఎ), సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ అధికారులతో కో ఆర్డినేషన్ టీమ్ పురాతన భవనాలను పరిశీలించాలని నిర్ణయించినట్లు చెప్పారు. టీమ్ వెంటనే భవనాల తనిఖీలు చేసి నివేదికను రూపొందించాలని అధికారులు నిర్ణయించారు.