సమ్మక్క సాగర్​లో  80 మీటర్ల వరకే నీటినిల్వ

సమ్మక్క సాగర్​లో  80 మీటర్ల వరకే నీటినిల్వ

హైదరాబాద్, వెలుగు : సమ్మక్క సాగర్​ రిజర్వాయర్​లో నీటి నిల్వను 80 మీటర్ల వరకే పరిమితం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రిజర్వాయర్​లో పూర్తిస్థాయి నీళ్లు నిల్వ చేస్తే తమ రాష్ట్రంలో ముంపు తలెత్తుతుందని ఛత్తీస్​గఢ్​కొంతకాలంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. తమ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆ ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వొద్దని కొర్రీలు పెడుతోంది. ములుగు జిల్లా తుపాకులగూడెం వద్ద గోదావరి నదిపై 1.13 కి.మీ.ల పొడవు, 83 మీటర్ల ఎత్తులో సమ్మక్క సాగర్​బ్యారేజీ నిర్మించారు. 8.50 లక్షల క్యూసెక్కుల వరద కిందికి వదిలేట్టుగా 48 రేడియల్​గేట్లు బిగించారు. రిజర్వాయర్​లో 83 మీటర్ల ఎత్తులో 6.94 టీఎంసీలు, 71 మీటర్ల ఎత్తులో 2.90 టీఎంసీలు నిల్వ ఉంటాయి. 83 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తే తమ రాష్ట్రంలో ముంపు ఎక్కువగా ఉంటుందని, దానిపై శాస్త్రీయ అధ్యయనం చేయాలని, మునిగిపోయే భూములకు పరిహారం, ఆర్​అండ్​ఆర్​ప్యాకేజీ ఇవ్వాలని ఛత్తీస్​గఢ్​ప్రభుత్వం సీడబ్ల్యూసీకి ఫిర్యాదు చేసింది. ఆ​ కంప్లయింట్​​పై చర్యలు తీసుకోవాలని సీడబ్ల్యూసీ రాష్ట్రానికి పలుమార్లు లేఖలు రాసింది. పొరుగు రాష్ట్రం కొర్రీల నేపథ్యంలో రిజర్వాయర్​లో నీటి నిల్వను తగ్గించుకోవాలని సర్కారు నిర్ణయించింది. రివర్​బెడ్​లోనే నీటిని నిల్వ చేసేలా నిర్ణయం తీసుకుంది. 83 మీటర్ల ఎత్తులో బ్యారేజీ నిర్మించినా, 80 మీటర్ల వరకే నీళ్లు నిల్వ చేస్తామని, ఛత్తీస్​గఢ్​లో ముంపు లేకుండా చర్యలు తీసుకుంటామని సీడబ్ల్యూసీకి లేఖ రాయడానికి సిద్ధమైంది. ఈ బ్యారేజీలో నిల్వ చేసే నీటిని దేవాదుల లిఫ్ట్​స్కీం ద్వారా ఎత్తిపోస్తారు. ఏడాది పొడవునా 80 మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేస్తామని ఇంజినీర్లు చెప్తున్నారు. నీటిని నిల్వ చేసే ఎత్తు తగ్గించడంతో రిజర్వాయర్​లో 4.50 టీఎంసీలు మాత్రమే నిల్వ చేయగలమని పేర్కొంటున్నారు.