
- సెర్ప్ పరిధిలోని సంఘాలకు రూ. 345 కోట్లు, మెప్మా సంఘాలకు 154 కోట్లు విడుదల
- లోన్లు తీసుకున్న 65 లక్షల మందికిపైగా మహిళలకు లబ్ధి
- మహిళా శక్తి సంబరాల్లోనే జమకానున్న వడ్డీ డబ్బులు
కరీంనగర్, వెలుగు : రాష్ట్రంలోని స్వయం సహాయక మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. వారు 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో తీసుకున్న రుణాలకు సంబంధించిన వడ్డీ పైసలు రూ.500 కోట్లు మంజూరు చేసింది. ఇందులో సెర్ప్ పరిధిలోని మహిళా సంఘాలకు రూ.345.62 కోట్లు, మెప్మా పరిధిలోని సంఘాలకు రూ.154 కోట్లు విడుదల కానున్నాయి. ఇందిరా మహిళా శక్తి సంబురాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ రిలీజ్ ఆర్డర్‌ను విడుదల చేసింది. మరో వారం, పది రోజుల్లో మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీ పైసలు జమ కానున్నాయి.
65 లక్షల మంది మహిళలకు లబ్ధి
రాష్ట్రంలో సెర్ప్ పరిధిలో 4.37 లక్షల మహిళా సంఘాలు ఉండగా.. 47.40 లక్షల మంది మహిళలు, మెప్మా పరిధిలో 1.79 లక్షల సంఘాలు ఉండగా వాటిలో 17.80 లక్షల మంది మహిళలతో కలిపి మొత్తం 65 లక్షలకుపైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నారు. అయితే మహిళలు ముందుగా బ్యాంకులకు వడ్డీ చెల్లిస్తే.. ఆ వడ్డీ డబ్బులను ప్రభుత్వం తిరిగి మహిళల అకౌంట్లలో జమ చేస్తుంది.
అయితే తెలంగాణ వచ్చాక 2018 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం నాలుగేండ్ల మిత్తీ పైసలను ఒకేసారి జమ చేసింది. ఆ తర్వాత పట్టించుకోకపోవడంతో సుమారు రూ.3 వేల కోట్ల బకాయి పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆర్నెళ్లలోపే మిత్తీ పైసలు తిరిగి ఇస్తోంది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.20 వేల కోట్ల రుణ లక్ష్యం పెట్టుకోగా... మహిళా సంఘాల సభ్యులు రూ.23 వేల కోట్లకుపైగా లోన్లు తీసుకొని క్రమం తప్పకుండా కిస్తీలు కడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం మంజూరు చేసిన వడ్డీ డబ్బులతో మహిళలకు లబ్ధి చేకూరనుంది.
నియోజకవర్గాల వారీగా వడ్డీ విడుదల
వడ్డీ డబ్బులను ప్రభుత్వం నియోజకవర్గాల వారీగా విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గానికి రూ.8.72 కోట్లు, కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గానికి రూ.8.24 కోట్లు, చొప్పదండికి రూ.7.99 కోట్లు, నిజామాబాద్ రూరల్‌కు రూ.7.92 కోట్లు, ఇల్లందుకు రూ.7.68 కోట్లు, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు రూ.7.32 కోట్లు, మునుగోడుకు 7.08 కోట్లు విడుదలయ్యాయి. మిగతా నియోజకవర్గాలకు సైతం ఆయా నియోజకవర్గాల్లో తీసుకున్న లోన్లు, వడ్డీని బట్టి నిధులు రిలీజ్ అయ్యాయి.
మహిళా శక్తి సంబురాల్లో వడ్డీ చెల్లింపు
రాష్ట్రంలో సోమవారం నుంచి మహిళా శక్తి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 16 వరకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సంబురాలు కొనసాగనున్నాయి. సంబురాల్లో భాగంగా వడ్డీ రాయితీ పైసలు జమ చేయనున్నారు. ఇప్పటికే మహిళా సంఘాలకు ఇందిర మహిళా శక్తి క్యాంటిన్లు, పెట్రోల్‌బంక్‌లు, ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించిన విషయం తెలిసిందే. అలాగే అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమం కింద విద్యార్థులకు రెండు జతల యూనిఫామ్స్ ఉచితంగా అందించడం, వాటిని మహిళా సంఘ సభ్యులచే కుట్టించి ఉపాధి కల్పించారు. వీటి ద్వారా మహిళా శక్తి విజయాలను కళాజాతల ద్వారా ప్రచారం చేయబోతున్నారు.
సెర్ప్ పరిధిలో ఉమ్మడి జిల్లా వారీగా విడుదలైన వడ్డీ పైసలు జిల్లా డబ్బులు (కోట్లలో..)
కరీంనగర్ రూ.58.86
మెదక్ రూ.56.12
ఖమ్మం రూ.45.84
నిజామాబాద్ రూ.45.47
నల్గొండ రూ.42.12
మహబూబ్‌నగర్ రూ.38.64
రంగారెడ్డి రూ.29.07
వరంగల్ రూ.18.98
ఆదిలాబాద్ రూ.10.29