ఆరోగ్యశ్రీ ఛార్జీలు 25 శాతం పెంపు.. కొత్తగా 163 ప్రొసీజర్లు

ఆరోగ్యశ్రీ ఛార్జీలు 25 శాతం పెంపు..  కొత్తగా 163 ప్రొసీజర్లు

హైదరాబాద్, వెలుగు: ఆరోగ్యశ్రీ ప్యాకేజీల ధరలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆరోగ్యశ్రీ స్కీమ్​లో  1,672 ప్రొసీజర్లు ఉండగా.. అందులో 1,375 ప్రోసీజర్ల ధరలను 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ సోమవారం రాష్ట్ర హెల్త్​ సెక్రటరీ క్రిస్టినా ఉత్తర్వులు విడుదల చేశారు. దాదాపు 11ఏండ్ల తర్వాత  ప్యాకేజీల ధరలు పెరిగాయి. 

చివరిసారిగా 2013లో సవరించారు. ధరలను పెంచాలని 2017 నుంచి డాక్టర్లు డిమాండ్ చేస్తుండగా.. గత ప్రభుత్వం 2022లో ఒక కమిటీని వేసింది. ఆ కమిటీ సూచనల మేరకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్యాకేజీల ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అలాగే, కొత్తగా 163 ప్రొసీజర్లను ఆరోగ్యశ్రీలో చేర్చింది. దీంతో మొత్తం స్కీమ్​లో ప్రొసీజర్ల సంఖ్య 1,835కు చేరింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ లిమిట్‌‌‌‌ను ఏడాదికి  కుటుంబానికి  రూ. 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచింది.

2013 నుంచి 2024 వరకు ధరల సవరణపై గత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ స్కీమ్ కింద చికిత్స అందించేందుకు హాస్పిటళ్లు ఇష్టపడలేదు. దీంతో పేషెంట్లు ఇబ్బంది పడ్డారు. ఈ నేపథ్యంలోనే ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్యాకేజీల ధరల పెంపుతో ప్రభుత్వంపై ఏటా అదనంగా రూ. 600 కోట్లు భారం పడుతుందని ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఈ పెంపుతో పేద రోగులకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. 

కొత్తగా 163 ప్రొసీజర్లు

ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రస్తుతం ఉన్న వ్యాధులకు అదనంగా మరో 163 కొత్త ప్రొసీజర్లను చేర్చారు. ఇందులో గుండె సంబంధిత చికిత్సలో 12 ప్రొసీజర్లను అదనంగా తీసుకొచ్చారు. వాటిల్లో మెడికల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ అక్యూట్‌‌‌‌ హార్ట్‌‌‌‌ ఫెయిల్యూర్‌‌‌‌ (సీహెచ్‌‌‌‌ఎఫ్‌‌‌‌)/ స్టక్‌‌‌‌ మెడికల్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ ఒకటి ఉంది. దానికి రూ. 44 వేల ప్యాకేజీని ఖరారు చేశారు. డెర్మటాలజీలో రెండు, ఎండోక్రైనాలజీలో ఏడు ప్రొసీజర్లను చేర్చారు. అందులో డయాబెటిక్‌‌‌‌ కీటో ఎసిడోసిస్‌‌‌‌ ఉంది. దానికి రూ. 44 వేలు ప్యాకేజీ ఖరారు చేశారు. జనరల్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌లో మూడు, జనరల్‌‌‌‌ సర్జరీలో 15, జీరియాట్రిక్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌లో ఒకటి ఉంది. అందులో యూరినరీ ట్రక్‌‌‌‌ ఇన్ఫెక్ఫన్‌‌‌‌ను చేర్చారు. ఇంటర్వెన్షనల్‌‌‌‌ రేడియాలజీలో 17 ప్రొసీజర్లను చేర్చారు. మెడికల్‌‌‌‌ గ్యాస్ట్రోఎంటరాలజీలో 9, నెఫ్రాలజీలో 16, న్యూరాలజీలో 8, న్యూరో సర్జరీలో 18, న్యూక్లియర్‌‌‌‌ మెడిసిన్‌‌‌‌లో మూడు ఉన్నాయి.

అందులో థైరాయిడ్‌‌‌‌ క్యాన్సర్‌‌‌‌కు ఏడు రకాల చికిత్సలు చేర్చారు. ప్లాస్టిక్‌‌‌‌ సర్జరీలో 9, పల్మనాలజీలో 3, రేడియేషన్‌‌‌‌ ఆంకాలజీలో 3, రుమటాలజీలో 7, సర్జికల్‌‌‌‌ ఆంకాలజీలో 9, యూరాలజీలో 11, వాస్క్యులర్‌‌‌‌ సర్జరీలో 6, అలాగే ల్యాప్రోస్కోపిక్, రోబోటిక్‌‌‌‌ సర్జరీ, టైప్‌‌‌‌–1 డయాబెటిక్‌‌‌‌కు ఇన్సులిన్‌‌‌‌ పంప్స్, అఫెరిసిస్‌‌‌‌ వంటివి ప్రొసీజర్లను కలిపారు. ఇన్సులిన్‌‌‌‌ పంప్స్‌‌‌‌ ప్యాకేజీ ఏడాదికి ఒక రోగికి రూ. 2 లక్షల వరకు ఉంది. ఒకేసారి మొదట రెండు లక్షల రూపాయల విలువైన పంప్స్‌‌‌‌ను ఇస్తారు. ఆ తర్వాత ప్రతి ఏడాది రూ. 66 వేల విలువైన ఇన్సులిన్‌‌‌‌ పంపులను ఇవ్వనున్నారు. డయాబెటిక్​ రోగులకు ఇది ఎంతగానో మేలు చేస్తుందని డాక్టర్లు చెప్తున్నారు.