చిరు వ్యాపారులపై గ్రీన్ ఫండ్ బాదుడు

చిరు వ్యాపారులపై గ్రీన్ ఫండ్ బాదుడు

సంగారెడ్డి, వెలుగు:గ్రామీణ ప్రాంతాల్లో చిరు వ్యాపారాలు చేసుకునేవారిపై రాష్ట్ర సర్కారు గ్రీన్ ఫండ్ పేరుతో అదనపు బాదుడు షురూ చేసింది. ఏడాదికి ఒకసారి తీసుకునే ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ.500తో కలిపి పంచాయతీ శాఖ హరితనిధి పేరుతో అదనంగా రూ. వెయ్యి వసూలు చేస్తోంది. పొట్టకూటి కోసం తాపత్రయపడే చిరు వ్యాపారులపై ప్రభుత్వం అదనపు భారం మోపడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో ఈ తరహా స్పెషల్ గ్రీన్ ఫండ్ వసూళ్లను ఇటీవల పంచాయతీ శాఖ మొదలుపెట్టింది. గ్రామాల్లో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు ట్రేడ్ లైసెన్స్ ద్వారా ప్రభుత్వానికి ఇప్పటివరకు రూ.500 చెల్లిస్తూ వచ్చారు. దీన్ని ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలో ప్రభుత్వం ట్రేడ్ లైసెన్స్ కు అదనంగా గ్రీన్ ఫండ్ రూ. వెయ్యి కలిపి మొత్తం రూ.1500 వసూలు చేస్తోంది. అలా వసూలు చేసిన వెయ్యి రూపాయలు హరితహారానికి డైవర్ట్ చేసి హరితహారం పనులు చక్కపెడుతున్నారు. జిల్లాలో ఉన్న 647 పంచాయతీల్లో వారం రోజులుగా గ్రీన్​ఫండ్​ వసూలు చేస్తున్నారు. 

జిల్లాలో 28 వేల వ్యాపారాలు..

గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు అవసరమైన ఫండ్స్ కలెక్షన్స్ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని చిరువ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. పల్లెల్లో గ్రీనరీ బాధ్యత పంచాయతీ పాలకవర్గాలదే కావడంతో ఈ ఆర్థిక సంవత్సరం నుంచి స్పెషల్ గ్రీన్ ఫండ్​ వసూలు చేస్తున్నారు. అయితే కోట్ల రూపాయలు పెట్టి ఫ్యాక్టరీలు నడిపే బిజినెస్ మన్లకు, పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేసుకునేవారికి ఒకే పద్ధతిలో రూ.వెయ్యి వసూలు చేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కోట్ల రూపాయలు పెట్టి భూములు, ప్లాట్లు, ఇండ్లు కొనుక్కునే వారి నుంచి కేవలం రూ.50 గ్రీన్ ఫండ్ వసూలు చేస్తుండగా, చిరు వ్యాపారుల నుంచి మాత్రం రూ.1000 ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 28 వేల వ్యాపారాలు కొనసాగుతున్నాయి. ఇందులో 50 శాతం వ్యాపారాలకు సంబంధించి ఆన్ లైన్ లో నమోదు చేసుకోగా, మిగతా 50 శాతం వ్యాపారాల ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఆఫ్ లైన్​లో వసూలు చేస్తున్నారు. వీటిలో ఎక్కువగా చిరు వ్యాపారాలు చేసుకునేవారే ఉన్నారు. లైసెన్స్ ఫీజు కంటే గ్రీన్ ఫండ్ ఎక్కువగా ఉండడంతో చిన్న వ్యాపారుల నుంచి వ్యతిరేకత వస్తోంది. 

ఇప్పుడిప్పుడే షురూ చేశాం

గ్రామ పంచాయతీల్లో వ్యాపారాలు చేసుకునే వారి నుంచి ట్రేడ్ లైసెన్స్ తో పాటు గ్రీన్ ఫండ్​ఇప్పుడిప్పుడే వసూలు చేస్తున్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయి. అదనంగా వసూలు చేసిన రూ.వెయ్యి హరిత నిధిలో జమ చేస్తున్నాం. చిరు వ్యాపారులకు ఇది భారమే అయినప్పటికీ తప్పడం లేదు. ఈ విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. త్వరలో నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. – సురేశ్​మోహన్, జిల్లా పంచాయతీ అధికారి, సంగారెడ్డి

రూ.1000 ఎందుకు కట్టాలే?       

ట్రేడ్ లైసెన్స్ ఫీజు రూ.500 ఉంటే అదనంగా రూ.1000 ఎందుకు కట్టాలే. ఉన్నోళ్లకు తక్కువ.. లేనోళ్లపై ఎక్కువ బాదుడు పద్ధతి బాగాలేదు. ఈ అదనపు భారాన్ని చిరువ్యాపారులు మోయలేరు. ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. లేదా అదనపు వసూళ్ల నుంచి చిరు వ్యాపారులను మినహాయించాలి.
– మహమ్మద్, చిరువ్యాపారి, చెర్ల గోపులారం, కొండాపూర్