ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త ..కోర్టు కేసులు, వివాదాలకు తావుండొద్దు: రేవంత్రెడ్డి

ఉద్యోగాల భర్తీలో జాగ్రత్త ..కోర్టు కేసులు, వివాదాలకు తావుండొద్దు: రేవంత్రెడ్డి
  • టీఎస్ పీఎస్సీ, అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం 
  • జాబ్ క్యాలెండర్ కు త్వరగా రూపకల్పన 
  • ఖాళీలపై గోప్యత అవసరం లేదని స్పష్టం

హైదరాబాద్, వెలుగు: ఉద్యోగాల భర్తీలో జాగ్రత్తగా ఉండాలని టీఎస్ పీఎస్సీకి, అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని.. కోర్టు కేసులు, వివాదాలకు తావు లేకుండా ముందుకు వెళ్లాలని ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి సూచించినట్లు తెలిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గ్రూప్1 నోటిఫికేషన్ ను రిలీజ్ చేసింది. దీంతో ఉద్యోగాల భర్తీపై గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు రిపీట్ కావొద్దని చెప్పినట్లు సమాచారం.

పరీక్ష తేదీల ప్రకటన విషయంలోనూ వాయిదా అనే మాట రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినందున.. ఆ దిశగా ప్రక్రియను వేగవంతం చేయాలనీ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఏజ్ లిమిట్ పెంచినందున మూడేండ్ల పాటు ఆగిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్లు ఈ ఏడాది మొదలు కానున్నాయి.

దీంతో డైరెక్ట్ రిక్రూట్​మెంట్​లో ఖాళీలపై ఆరు నెలల ముందు నుంచే సమాచారం పెట్టుకుని జాబ్ క్యాలెండర్​కు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలపై ఎలాంటి దాపరికం లేకుండా..  పబ్లిక్ కు సమాచారం ఇస్తూ  ముందుకు వెళ్లాలని సీఎం అధికారులకు స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, యూపీఎస్సీ పనితీరును అధ్యయనం చేసినందున, అందుకు అనుగుణంగానే యాక్షన్ ప్లాన్ ఉండాలని కూడా సీఎం సూచించినట్లు సమాచారం. 

ప్రభుత్వానికి చెడ్డపేరు రావద్దు 

గత సర్కార్ హయాంలో పేపర్ లీకేజీ రాష్ట్రాన్ని కుదిపేసింది. ఖాళీల ప్రకటన, ఉద్యోగాల భర్తీ అంతా గందరగోళంగా సాగింది. వివిధ అంశాలపై కోర్టుల్లో పదుల సంఖ్యలో కేసులు పడ్డాయి. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి ప్రభుత్వంపై నిరుద్యోగుల వ్యతిరేకత స్పష్టంగా కనిపించింది. దీంతో ప్రస్తుత రాష్ట్ర సర్కార్ అలర్ట్ అయింది.

నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యంగా ఉండొద్దని, వారికి సంబంధించిన ఇష్యూష్​పై ఆచితూచి వ్యవహరించాలని మంత్రులతో పాటు ఉన్నతాధికారులకూ సీఎం రేవంత్ సూచించినట్లు తెలిసింది. ఉద్యోగాల భర్తీ విషయంలో ఎంత నిక్కచ్చితో పకడ్బందీగా ముందుకు వెళితే.. అంత మంచిదని అధికారులకు ఆయన చెప్పినట్లు సమాచారం. పరీక్షలకు సంబంధించి ప్రతి ఒక్కరిపైనా నిఘా ఉంటుందని, కమిషన్​ను గాడిలో పెట్టేందుకే రిటైర్డ్ డీజీపీని చైర్మన్ గా నియమించినట్లు పేర్కొన్నారు. 

2 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్లాన్​ 

ఎన్నికల్లో ప్రకటించిన విధంగా 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తున్నది. ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్స్​కు అనుగుణంగా వాటికి కొత్త పోస్టులు చేర్చి.. మళ్లీ నోటిఫికేషన్ ఇవ్వాలని యోచిస్తోంది. పోలీసు, టీచర్, గురుకుల పోస్టుల భర్తీతో పాటు ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్ 2, 3,4 ఉద్యోగాల భర్తీకి జాబ్ క్యాలెండర్ రూపొందిస్తున్నది. రెవెన్యూ డిపార్ట్​మెంట్​లో వీఆర్ఏ, వీఆర్ఓ పోస్టులను తీసేయడంతో వాటి స్థానంలో కొత్త పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు పంపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు అందాయి.

దీంతో రెవెన్యూ విషయంలో గ్రామానికి ఒక అధికారి ఉండేలా మరిన్ని పోస్టులను కొత్త ప్రభుత్వం క్రియేట్​ చేయాలని భావిస్తోంది. ఏటా రిటైర్మెంట్ అవుతున్న కొద్దీ.. వెంటనే అవసరాల మేరకు ప్రమోషన్లు ఇస్తూ, డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకునేలా ముందుకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తోంది.