
ఖైరతాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్ల కోర్సు ఫీజులను పూర్తిగా ప్రభుత్వమే భరించాలని రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. లేకుంటే స్కాలర్షిప్ లను రూ.5 వేల నుంచి రూ.25 వేలకు పెంచాలన్నారు. ఈ మేరకు సోమవారం ఖైరతాబాద్‌లోని బీసీ సంక్షేమ శాఖ ఆఫీస్‌ముందు ఆందోళనకు దిగారు. స్టూడెంట్లతో కలిసి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ.. బీసీ కార్పొరేషన్ వద్ద 5 లక్షల అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయని, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క లోన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. కార్పొరేషన్ కు చైర్మన్ కూడా లేడని, వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.
ఎస్సీ గురుకులాల మాదిరిగా బీసీ గురుకులాలకు ఓ ఐఏఎస్ అధికారిని నియమించాలన్నారు. మంత్రి గంగుల కమలాకర్ ఏనాడూ బీసీ హాస్టళ్లను పరిశీలించిన దాఖలాలు లేవని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో బీసీ సంక్షేమ శాఖ దిక్కులేనిదైందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు నీలం వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.