- జీతాలు, ఆఫీసు ఖర్చుల కోసమే ఈ ఫండ్స్
- ప్రతి నెలా ఏజీకి లెక్కలు చెప్పాలని ఆదేశం
- రెండు జీవోలు జారీ చేసిన మున్సిపల్ శాఖ
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ మెట్రో నిర్వహణ, ఫేజ్–2 విస్తరణ సన్నాహాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.275 కోట్ల నిధులు విడుదల చేసింది. ఇందులో ప్రస్తుత మెట్రో రైల్ ప్రాజెక్టుకు రూ.125 కోట్లు, ఫేజ్–2 కోసం రూ.150 కోట్లు కేటాయించింది. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల నుంచి ఈ నిధులను మంజూరు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ (ఎంఏయూడీ) శాఖ సెక్రటరీ (ఎఫ్ఏసీ) సర్ఫరాజ్ అహ్మద్ జీవో ఆర్టీ నంబర్లు 990, 991 ద్వారా వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో ఆర్టీ నంబర్ 990 ప్రకారం హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) ప్రాజెక్టుకు రుణం కింద రూ.125 కోట్లు మంజూరు చేశారు. 2026–27 బడ్జెట్లో ఈ పద్దు కింద రూ.500 కోట్లు కేటాయించగా, తాజా విడుదలతో ఇంకా రూ.375 కోట్లు అందుబాటులో ఉన్నాయి. మరోవైపు జీవో ఆర్టీ నంబర్ 991 ద్వారా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో లిమిటెడ్ (హెచ్ఏఎంఎల్) పరిధిలోని ఫేజ్–2 ప్రాజెక్టుకు రూ.150 కోట్లు విడుదల చేశారు. ఈ ప్రాజెక్టుకు బడ్జెట్లో రూ.600 కోట్లు కేటాయించగా, తాజా మంజూరుతో ఇంకా రూ.450 కోట్లు విడుదల చేయాల్సి ఉంది.
నిర్వహణ, సన్నాహక ఖర్చులకు..
ప్రస్తుత మెట్రో రైలు ప్రాజెక్టు రోజువారీ సంస్థాగత కార్యకలాపాలు, కార్యాలయాల నిర్వహణ ఖర్చుల కోసం హెచ్ఎంఆర్ఎల్ ఈ నిధులను వినియోగించనుంది. ఫేజ్–2 విస్తరణకు సంబంధించి సన్నాహక పనులు, క్షేత్రస్థాయి పరిశీలనలు, డీపీఆర్ పర్యవేక్షణ, వివిధ విభాగాలతో సమన్వయం, ఇంజనీర్లు, సాంకేతిక సిబ్బంది, కన్సల్టెంట్ల ఫీజులు, వేతనాలు, ఇతర పరిపాలనా అవసరాలకు హెచ్ఏఎంఎల్ నిధులను ఖర్చు చేయనుంది. కాగా, ఈ నిధుల వ్యయ వివరాలు, యుటిలైజేషన్ సర్టిఫికెట్లను ప్రతి నెలా హైదరాబాద్లోని అకౌంటెంట్ జనరల్ (ఏజీ)తో పాటు ప్రభుత్వానికి సమర్పించాలని సంస్థల మేనేజింగ్ డైరెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.
