తడిసిన వడ్లు కొనాలె

తడిసిన వడ్లు కొనాలె

మహబూబ్ నగర్: ‘ఫామ్ హౌస్​లో ఉండేందుకు నీకు ప్రజలు అధికారం ఇయ్యలె. కేంద్రంపై ఆరోపణలు ఆపి, ముందు రైతుల వడ్లను కొను. ఇప్పటికే చాలా మంది రైతులు నష్టానికి వడ్లను అమ్ముకున్నరు. అకాల వర్షాలకు వడ్లు తడిసిపోయినయ్. ఆ వడ్లను మొత్తం నువ్వే కొనాలె. నష్టపోయిన రైతులను నువ్వే ఆదుకోవాలె. తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తే నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు’ అని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ సీఎం కేసీఆర్​పై మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్ర- బుధవారం మధ్యాహ్నం మహబూబ్​నగర్ నియోజకవర్గలోని మన్యంకొండ స్టేజీ వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా సంజయ్​ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించమంటే కేసీఆర్ తగ్గించకుండా కేంద్రంపై ఆడిపోసుకుంటున్నారని ఆరోపించారు. ఆర్టీసీ కార్మికులకు హ్యాట్సాప్​ చెప్పాలని, రాష్ట్రంలో పరిస్థితులను ప్రజలకు తెలియజేసినందుకు అభినందనలు తెలియజేశారు. ‘‘ఎక్కడ డీజిల్ రేట్ తక్కువ ఉంటే అక్కడే తీసుకోమని టీఎస్​ఆర్టీసీకి కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. రాష్ట్రంలో కంటే కర్నాటకలో డీజిల్ ధర రూ.15 తక్కువగా ఉందని, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు తక్కువ ఉన్నాయని ఆర్టీసీ ఇచ్చిన లేఖతో స్పష్టమైంది. ఇప్పుడు తెలంగాణ సమాజం కేసీఆర్ చెబుతున్న అబద్ధాల గురించి తెలుసుకుంటున్నది, ప్రజలు మార్పు కోసం ఆలోచిస్తున్నరు”అని అన్నారు. కేసీఆర్ నిరంకుశ పాలనతో తెలంగాణ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తున్నాయని అన్నారు. బల్లాలు, బరిసెలు పట్టుకుని తంతం అన్న వాళ్లే ఇప్పుడు కేసీఆర్​కు కుడి, ఎడమల ఉన్నారని చెప్పారు. నిజమైన తెలంగాణ ఉద్యమకారులు తెరమరుగయ్యారని అన్నారు. తెలంగాణను వ్యతిరేకించిన ఎంఐఎం పార్టీని చంకలో వేసుకుని కేసీఆర్​ తిరుగుతున్నారని మండిపడ్డారు. బీజేపీ నీతి నిజాయితీతో కూడిన పాలన అందింస్తుందని, ప్రజలు ఆదరిస్తే మీ ఆకాంక్షలను నెరవేరుస్తామని తెలిపారు.