హైదరాబాద్ లోని ప్రభుత్వ భూముల అమ్మకానికి రాష్ట్ర సర్కార్ మళ్లీ సిద్ధమైంది. ఇటీవల కోకాపేట,ఖానామెట్ లో భూముల అమ్మకం ద్వారా రూ.2764 కోట్లను రాబట్టుకున్న సర్కార్ ఇప్పుడు మరిన్ని భూములను అర్రాస్ లో పెట్టేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం ఖానామెట్ లో 22.79ఎకరాల్లో ఉన్న 9 ప్లాట్లు,పుప్పాలగూడలో 94.56 ఎకరాల్లో ఉన్న 26 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. పుప్పాలగూడలోని ఒక్కో ప్లాటు 2 ఎకరాల నుంచి ఆరున్నర ఎకరా విస్తీర్ణంలో ఉండగా ,ఖానామెట్ లో ఎకరం నుంచి మూడు ఎకరాల వరకు ఉంటుంది. ఈ భూముల వేలంలో వ్యక్తులు లేదా సమూహాలు, సంస్థలు, బ్యాంకులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు పాల్గొనవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ఔటర్ రింగ్ రోడ్డు పక్కన షాపింగ్ కాంప్లెక్స్‌లు, హోటళ్లు, హాస్పిటళ్లకు అతి దగ్గరలో ప్లాట్లు ఉన్నట్లు పేర్కొంది. ఈ దఫా 117.35 ఎకరాల భూముల వేలం ద్వారా రూ. 4 వేల కోట్ల ఆదాయం రానుందని అంచనా వేస్తోంది.
అప్పుడు రూ.2,764 కోట్లు.. ఇప్పుడు రూ.4 వేల కోట్లు
కోకాపేటలో ఇప్పటికే హెచ్‌ఎండీఏ 49.92 ఎకరాల్లో అభివృద్ధి చేసిన నియోపోలిస్ లేఅవుట్‌లోని 7 ప్లాట్లతోపాటు గోల్డెన్ మైల్ లేఅవుట్‌లోని ఒక ప్లాట్ ను, ఖానామెట్‌లో టీఎస్‌ఐఐసీకి చెందిన 15.01 ఎకరాల విస్తీర్ణంలోని 5 ప్లాట్లను అమ్మేసింది. ఒక్క కోకాపేట భూముల ద్వారానే రూ. 2,035 కోట్ల ఆదాయం రాగా.. ఖానామెట్ భూముల అమ్మకంతో రూ.729 కోట్లు వచ్చాయి. మొత్తంగా 64.93 ఎకరాల అమ్మకంతో రూ. 2,764 కోట్లు ప్రభుత్వం రాబట్టుకుంది. కోకాపేటలో అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్ల ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు పలికింది. హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్ భూముల విషయానికి వస్తే గరిష్టంగా ఎకరా రూ. 55 కోట్ల ధర పలికింది. సగటున ఒక్కో ఎకరానికి 48.92 కోట్ల ఆదాయం వచ్చింది. ఇదే ఖానామెట్ లో ప్రస్తుతం అమ్మకానికి పెట్టిన మరో 22.79 ఎకరాల ద్వారా రూ. 1,100 కోట్లకుపైగా ఆదాయం వచ్చే అవకాశముంది. పుప్పాలగూడలో 94.56 ఎకరాల అమ్మకం ద్వారా తక్కువలో తక్కువ రూ. 3 వేల కోట్ల ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఈ రెండో దఫా వేలం ద్వారా ఖజానాకు రూ. 4 వేల కోట్ల దాకా ఆదాయం వస్తుందని వారు భావిస్తున్నారు.
రేపు నోటిఫికేషన్
భూముల అమ్మకానికి సంబంధించి ఈ నెల 30న టీఎస్ఐఐసీ అధికారులు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. సెప్టెంబర్ 9న ఉదయం 11 గంటలకు ప్రీబిడ్ సమావేశం ఉంటుందన్నారు. రిజిస్ట్రేషన్లకు సెప్టెంబర్ 25 సాయంత్రం 5 గంటలకు తుది గడువుగా నిర్ణయించారు. ఖానామెట్‌లోని భూముల ఈ– వేలం సెప్టెంబర్ 27న నిర్వహించనున్నారు. పుప్పాలగూడ ప్లాట్ల ఈ– వేలం సెప్టెంబర్ 28న ఉంటుంది. వివరాలకు tsiic.telangana.gov.in ను చూడాలని అధికారులు తెలిపారు.
