గ్రామ పంచాయతీల స్టాఫ్ ను కలిపేస్తున్నరు

గ్రామ పంచాయతీల స్టాఫ్ ను కలిపేస్తున్నరు
  • గ్రూప్​ 4పై సర్కారు​ మాయాజాలం
  • వీఆర్వోల సర్దుబాటుతో తగ్గిన పోస్టుల సంఖ్య ... పెంచేందుకు గిమ్మిక్కులు

హైదరాబాద్, వెలుగు:  గ్రూప్ 4 పోస్టుల సంఖ్యపై రాష్ట్ర సర్కారు మాయాజాలం చేస్తోంది. ఖాళీల భర్తీకి ఇంతవరకు ఆర్థిక శాఖ అనుమతి ఇవ్వలేదు. ఈ పోస్టుల్లో వీఆర్వోలను సర్దుబాటు చేయడంతో దాదాపు మూడువేలకు పైగా పోస్టులు తక్కువ అవుతున్నాయి. చెప్పిన ఖాళీల సంఖ్య తెచ్చేందుకు ఇప్పుడు వేరే పోస్టులను గ్రూప్ 4 లో చూపేందుకు ఆర్థిక శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే గ్రామ పంచాయతీల్లో స్టాఫ్ పోస్టులను కొత్తగా క్రియేట్ చేస్తోంది. వాటిని గ్రూప్ 4 లోనే చూపాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. దాదాపు 1,208 పోస్టులు, ఇతర డిపార్ట్మెంట్ల నుంచి ఇంకో 1800 పైగా పోస్టులు సంబంధం లేకుండానే గ్రూప్​4లో కలుపుతున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. అప్పటికే అసలు గ్రూప్ 4 ఖాళీలను ప్రభుత్వం తగ్గించి చూపించిందనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు అసెంబ్లీలో చెప్పిన ఖాళీల సంఖ్య తగ్గినట్లు వస్తే, నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండడంతో ఇలా చేస్తున్నట్లు  చర్చ జరుగుతోంది.

5,138 వీఆర్వోలను సర్దారు

వీఆర్వో వ్యవస్ధను రద్దుచేసిన తరువాత ప్రభుత్వం వారిని దాదాపు రెండేళ్ల పాటు ఖాళీగానే ఉంచింది. ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తామని చెబుతూ వచ్చింది. ఇటీవల ఇంటర్నల్ జీవోలు జారీచేసి.. లక్కీ డ్రా పద్ధతిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో వీఆర్వోలను సర్దుబాటు చేసింది. అయితే గ్రూప్ 4 ఖాళీలతో పాటు ఇతరత్రా పోస్టుల్లో వీఆర్వోలను కేటాయించింది. మొత్తం 5,138 వీఆర్వోలను సర్దుబాటు చేయగా.. వారిలో జూనియర్ అసిస్టెంట్లుగా 1,970 మందిని, సీనియర్ అసిస్టెంట్లుగా 1,061 మందిని, సూపరింటెండెంట్లుగా 120 మందిని, వార్డు ఆఫీసర్లుగా 378 మందిని, జూనియర్ స్టెనోగా 81 మందిని , రికార్డు అసిస్టెంట్లుగా 536 మందిని, టైపిస్టులుగా 921 మందిని, ఇతరత్రా పోస్టుల్లో మరో 70 మందిని సర్దుబాటు చేశారు. అయితే ఇందులో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్,  జూనియర్ స్టెనో, సీనియర్ స్టెనో  వంటి పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయబోయే ఖాళీల్లో గ్రూప్ 4 పోస్టుల కింద చూపించారు. వీటిని వీఆర్వోలతో నింపడంతో అసలు ఖాళీలు తగ్గాయి. 

గ్రామ పంచాయతీల స్టాఫ్ ను కలిపేస్తున్నరు

గ్రూప్ 4 పోస్టుల సంఖ్య చాలా వరకు తగ్గుతుండడంతో గ్రామ పంచాయతీల్లో (జీపీ) పనిచేసే స్టాఫ్ ను రిక్రూట్ చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా చేపట్టాల్సిన ఈ రిక్రూట్ మెంట్​ను అలా కాకుండా  ఆ పోస్టులను గ్రూప్4 లో కలిపేయాలని ప్రపోజల్స్ రెడీ చేసింది. ఇందుకు సంబంధించి కొత్తగా 1208 పోస్టులను క్రియేట్ చేశారు. ఇతర డిపార్ట్మెంట్లలోనూ గ్రూప్ 4 పోస్టులకు సంబంధం లేని పోస్టులను అందులోనే కలిపేలా ప్రపోజల్ సిద్ధం చేశారు. ప్రత్యేకంగా ఆయా డిపార్ట్మెంట్ల వారీగా భర్తీ చేయాల్సిన పోస్టులను వీఆర్వో పోస్టులతో తగ్గిన గ్రూప్ 4 పోస్టుల సంఖ్యను పెంచుకునేందుకు వాడుకుంటున్నట్లు ఉన్నతాధికారులు చెప్తున్నారు.