
- నేడు పాలసీ డాక్యుమెంట్‌ను రిలీజ్ చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి
- ల్యాండ్, ఫైనాన్స్, ఆర్అండ్ డీ, మార్కెటింగ్, మ్యాన్పవర్సమస్యలపై దృష్టి
- వర్కింగ్ క్యాపిటల్ కోసం ఆర్థికసాయం లేదా రుణసాయం చేసే అవకాశం
- రూరల్ ఏరియాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లను ఏర్పాటు చేసేలా పాలసీ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మైక్రో, స్మాల్, మీడియం ఇండస్ట్రీలు గండాలు దాటేందుకు రాష్ట్ర ప్రభుత్వం పాలసీతో ముందుకు రాబోతున్నది. లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఆయా పరిశ్రమలు కరోనా తర్వాత చాలా వరకు డీలా పడ్డాయి. వేలాది కంపెనీలు మూతపడగా.. వేలాది మంది ఉపాధిని కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. అయితే, గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలను పట్టించుకోలేదన్న ఆరోపణలున్నాయి. వేలాది కంపెనీలు మూతపడినా వాటిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నించలేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈలు ఎదుర్కొంటున్న సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
జీఎస్డీపీలో ఎక్కువ వాటా కలిగిన ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక పాలసీని తీసుకొస్తామని కొద్ది నెలల క్రితమే సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ, ఇండస్ట్రీస్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఐదారు అంశాల్లో ఎంఎస్ఎంఈలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని గుర్తించినట్టు తెలిసింది. వాటికి పరిష్కారాలు చూపించడంతో పాటు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహించేలా మరిన్ని విధానాలను తీసుకొస్తూ పాలసీ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు తెలిసింది. దానిని బుధవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు విడుదల చేయనున్నారు.
ఇవీ ప్రధాన సమస్యలు..
ఎంఎస్ఎంఈలు ప్రధానంగా ఫైనాన్స్, ల్యాండ్, ఆర్ అండ్ డీ, మార్కెటింగ్, మ్యాన్పవర్సమస్యలతో సతమతమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా సమస్యలను తీర్చేలా పాలసీ డాక్యుమెంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టు తెలిసింది. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు వర్కింగ్‌క్యాపిటల్ పెద్ద సమస్యగా తయారైందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సాయం లేదా రుణాలు అందించి అవి నిలదొక్కుకునేలా చేసేందుకు పాలసీని రూపొందించారని సమాచారం. ఇక, పరిశ్రమలకు అతిపెద్ద సమస్యగా ల్యాండ్ కేటాయింపులని చెప్తున్నారు.
సిటీ పరిధిలో ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు అడ్డంకులు లేకున్నా.. రూరల్ ఏరియాలోనే ఇబ్బందులు తలెత్తుతున్నాయని తెలుస్తోంది. సిటీలో ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడ ఇబ్బంది లేదు. అయితే, గ్రామీణ ప్రాంతాల్లో అలాంటి పార్కులేవీ లేకపోవడంతో భూమి కోసం వెతుక్కోవాల్సి వస్తున్నదని, ఒకవేళ ల్యాండ్ దొరికినా స్థానిక సమస్యలూ అడ్డంకిగా మారుతున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో సిటీ తరహాలోనే రూరల్ ఏరియాల్లోనూ పరిశ్రమల ఏర్పాటుకు ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు చేసేలా పాలసీ డాక్యుమెంట్లో స్కోప్ ఉందని తెలిసింది.
ఉద్యోగులు దొరకడం లేదు..
పరిశ్రమలు ఏర్పాటు చేశాక అందులో పనిచేసేందుకు స్కిల్డ్ లేబర్ చాలా అవసరం. కానీ, ప్రస్తుతం స్కిల్డ్ లేబర్ సమస్య ఎంఎస్ఎంఈలను వేధిస్తున్నట్టు చెప్తున్నారు. మీడియం ఇండస్ట్రీలకు అంతో ఇంతో స్కిల్డ్ లేబర్ దొర్కుతున్నా.. మైక్రో, స్మాల్ ఇండస్ట్రీల్లో మాత్రం ఇబ్బందికర పరిస్థితులే ఉన్నాయంటున్నారు. చాలా మంది స్కిల్డ్ లేబర్‌ను పెద్ద సంస్థలు ఎగరేసుకుపోతుండడంతో.. ఈ సమస్య చిన్న ఇండస్ట్రీలను వెంటాడుతున్నదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే స్కిల్యూనివర్సిటీ ద్వారా యువతకు ట్రైనింగ్ ఇచ్చి ఎంఎస్ఎంఈలకు ఉద్యోగుల కొరత తీర్చాలని సర్కారు నిర్ణయించిందని చెప్తున్నారు. స్కిల్ యూనివర్సిటీలో నైపుణ్యం సాధించిన యువతను ఎంఎస్ఎంఈల్లో అడ్జస్ట్ చేయొచ్చన్న యోచనతో.. పాలసీ డాక్యుమెంట్‌ను సిద్ధం చేసిందని సమాచారం.
దాంతో పాటు చాలా వరకు సంస్థల్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్ అండ్ డీ) ఫెసిలిటీ లేదు. ఫలితంగా మిగతా సంస్థలతో పోలిస్తే కాస్త అవి వెనకబడుతున్నాయన్న వాదన ఉంది. దానికీ పరిష్కారం చూపిస్తారని అధికార వర్గాల ద్వారా తెలుస్తున్నది. పరిశ్రమల నుంచి వచ్చే ఉత్పత్తులకు మార్కెటింగ్ అతిపెద్ద సమస్యగా మారిందని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం మార్కెటింగ్ విషయంలో ఎంఎస్ఎంఈలకు సాయం చేసేలా ప్రత్యేక పాలసీ తీసుకొచ్చినా దాని వల్ల వారికి ఏం ఒరగడం లేదన్న ఆరోపణలు, విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలోనే హ్యాండీ క్రాఫ్ట్స్, చేనేత ఉత్పత్తులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించినట్టే.. ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకూ చేయించేలా పాలసీని రూపొందించినట్టు చెప్తున్నారు.
రాష్ట్రంలో 26 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈలు..
రాష్ట్రంలో 26 లక్షలకుపైగా ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. అయితే, కరోనా తర్వాత వేలాది సంస్థలు మూతపడ్డాయి. వర్కింగ్ క్యాపిటల్ లేక, పనిచేసే వారు దొరక్క.. సంస్థలను చాలా మంది మూసేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న సంస్థల్లో 56 శాతం సంస్థలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. మరో 44 శాతం పట్టణాల్లో ఉన్నాయి. అయితే, రూరల్ ఏరియాల్లో మౌలిక వసతులను కల్పించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు ఈ పదేండ్లలో కేవలం 19,954 యూనిట్లు మాత్రమే ఏర్పాటయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా టీజీఐఐసీ (తెలంగాణ ఇండస్ట్రీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్) 30 వరకు ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయగా.. 2,700 ఎకరాల వరకు ల్యాండ్‌ను ఎంఎస్ఎంఈలకు ఇచ్చింది. ఆరు కొత్త పార్కులు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా.. మరో 12 పార్కులను అప్‌గ్రేడ్ చేస్తున్నారు.