అప్పుల మీద అప్పులు చేస్తున్న రాష్ట్ర సర్కార్​.. వాటికి ఏటా వేల కోట్ల మిత్తి

అప్పుల మీద అప్పులు చేస్తున్న రాష్ట్ర సర్కార్​.. వాటికి ఏటా వేల కోట్ల మిత్తి
  • 2014-15లో వడ్డీలు రూ. 5,195 కోట్లు.. ఈ ఏడాది 19 వేల కోట్లు
  • దాదాపు నాలుగింతలు పెరిగిన ఇంట్రెస్ట్.. 4.50 లక్షల కోట్లకు చేరిన అప్పులు


హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం అప్పుల మీద అప్పులు చేస్తుండటంతో వాటికి వడ్డీలు తడిసి మోపెడవుతున్నాయి. ఏటా ఇంట్రెస్ట్​లు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఎనిమిదిన్నరేండ్లలో కేవలం వడ్డీలకే లక్ష కోట్ల రూపాయలు సర్కారు చెల్లించింది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే దాదాపు రూ.15 వేల కోట్లు రాష్ట్ర  ఖజానా నుంచి కట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఎడాపెడా చేస్తున్న అప్పులతోనే ఈ పరిస్థితి తయారైందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

ఇంతింతై..!

రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలో 2014–15లో ప్రభుత్వం రూ.5 వేల కోట్ల వడ్డీ కట్టింది. ఇప్పుడు అది నాలుగింతలకు చేరువైంది. ఈ ఆర్థిక సంవత్సరానికి (2022–23) వడ్డీల భారం రూ. 19 వేల కోట్లకు చేరింది. 2016–17లో రూ.8 వేల కోట్ల వడ్డీలు కడితే.. అదే 2021–22 లో రూ.18,688 కోట్లు చెల్లించింది. రానున్న కాలంలో ఈ మొత్తం మరింత పెరగనుంది.

ఒక్కొక్కరి తలపై అప్పు రూ.లక్ష దాటింది  

సర్కార్ తీసుకునే అప్పులతో రాష్ట్ర ప్రజలపై తలసరి అప్పు ఏటేటా పెరిగిపోతున్నది. ఇప్పటి దాకా ఆన్​ బడ్జెట్​, ఆఫ్​ బడ్జెట్​ అప్పులను కలిపితే  రూ. నాలుగున్నర లక్షల కోట్లకు చేరింది.  2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా 3,50,03,674తో భాగిస్తే రాష్ట్రంలో ఒక్కొక్కరి తలపై అప్పు రూ.1.28 లక్షలకు చేరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐ, ఇతర రుణ సంస్థల నుంచి ఎఫ్​ఆర్​బీఎం పరిమితిలో తీసుకున్న అప్పులు 2022 మార్చి నాటికి రూ. 3,12,191 కోట్లుగా ఉన్నది. ఇవి కాకుండా గ్యారంటీల పేరుతో కొత్త కొత్త కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తీసుకున్న మొత్తం రూ.1.37 లక్షల కోట్లు. ఈ రెండు కలిపితే రూ.4.50 లక్షల కోట్లు కాగా.. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సరికి ఇది ఇంకింత పెరగనుంది.  రాష్ట్రం వచ్చేనాటికి అప్పు రూ. 70 వేల కోట్లు మాత్రమే.

ప్రతి ఏడాది రాష్ట్ర సర్కార్​ కట్టిన 
వడ్డీ చెల్లింపులు ఇలా ( రూ.కోట్లలో)

2014-15    5,195 
2015-16    6,755
2016-17    7,995 
2017-18    10,262
2018-19    11, 892
2019-20    13,642
2020-21    16,010
2021-22    18,688
2022-23    15,050
(ఇప్పటివరకు)మొత్తం 1,05,489