హైదరాబాద్ నగర బ్యూటిఫికేషన్ పై రాష్ట్ర సర్కార్ వి ఉత్త మాటలె

హైదరాబాద్ నగర బ్యూటిఫికేషన్ పై రాష్ట్ర సర్కార్ వి ఉత్త మాటలె
  • 9  ఏళ్లుగా ఒక్క చోట మినహా ఎక్కడా పనులు చేయలే
  •  నదికి ఇరువైపులా ఎక్స్ ప్రెస్​ వేల నిర్మాణం జరగలే
  •  పర్యాటకం, బోటింగ్ సదుపాయం ప్రకటనలకే పరిమితం  
  •  సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలు అమలుకాలే

హైదరాబాద్, వెలుగు : “ మూసీ నదిపై ఆక్రమణలను తొలగిస్తాం. కాలుష్య కోరల్లో చిక్కుకున్న నదిని ప్రక్షాళన చేస్తాం. బ్యూటిఫికేషన్ చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం”..  అని రాష్ట్ర ప్రభుత్వం ఏండ్లుగా చెబుతుంది. మున్సి పల్ శాఖ మంత్రి కేటీఆర్ కూడా పలుమార్లు హామీలు ఇచ్చారు. ఎక్కడా నది బ్యూటిఫికేషన్ జరగలేదు. పనులు చేపట్టనేలేదు. వికారాబాద్ జిల్లా అనంతగిరి కొండల్లో పుట్టి కృష్ణాలో కలిసే మూసీ నది గ్రేటర్​పరిధిలో 33 కిలో మీటర్ల మేర పారుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే మూసీని పరిరక్షిస్తామని సీఎం కేసీఆర్​అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.  ఆ తర్వాత మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ బోర్డును ఏర్పాటు చేశారు.  ఆ తర్వాత బ్యూటిఫికేషన్​పేరిట యాక్షన్ ప్లాన్ రూపొందించి పనులు షురూ చేశారు. ప్లాన్ రెడీ చేసి ఐదేండ్లు గడిచినా ఒక్క నాగోలు వద్ద మాత్రమే పనులు జరిగాయి.  మిగతా ప్రాంతాల్లో ఎక్కడ కూడా చేయలేదు. నదుల పరిరక్షణలో భాగంగా  కేంద్ర ప్రభుత్వం నేషనల్ రివర్​వాటర్ కన్జర్వేషన్  స్కీమ్ కింద మూసీని ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది.  ఇందులో పరివాహక ప్రాంతాల అభివృద్ధి, కాలుష్య కారకాల నియంత్రణ, మురుగు నీరు కలవకుండా ఇంటర్వేన్షన్ అండ్ డైవర్షన్ నిర్మాణాలు, ల్యాండ్ స్కేప్, పార్కులను అభివృద్ధి చేసేలా నిధులు కేటాయించింది. అప్పటి ప్రతిపాదనలకు అనుగుణంగా రూ.400 కోట్లను విడుదల చేసింది. అధికారులు ఆ నిధులతో కనీసం మూసీ పరివాహక ప్రాంతాల్లో మురుగు కంపు లేకుండా చేయలేకపోయారు. ఇప్పటికీ అనేక చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదు.  మూసీ ప్రక్షాళనకు రూ.4  వేల కోట్లతో ప్రతిపాదనలు ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు.  దీంతో నది ప్రక్షాళన ఎక్కడికక్కడ ఆగిపోయింది. అలాగే నదికి ఇరు వైపులా ఎక్స్ ప్రెస్​వే వేస్తామని, బోటింగ్ ఫెసిలిటీ కల్పిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు హామీలు ఇచ్చినా పనులు మాత్రం చేయడం లేదు.

నదిలోకి యథేచ్ఛగా మురుగు

మూసీ బ్యూటిఫికేషన్ పనులతో పాటు నదిపై వంతెనల నిర్మాణాలు, బోటింగ్ సదుపాయం కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.  నేటికి మూసీ వెంట ఎంతదూరం వెళ్లినా అదే కంపు కొడుతుంది. నదిలోకి వచ్చే వాటర్ చానళ్లను ఆక్రమించడంతోపాటు, యథేచ్ఛగా పారిశ్రామిక, మానవ వ్యర్థాలను కలిపేస్తున్నారు. సిటీలో ప్రతి రోజు ఉత్పత్తయ్యే 1,300 ఎంఎల్టీల మురుగు నీటిలో 600 ఎంఎల్డీల నీటిని మాత్రమే శుద్ధి చేసి నదిలోకి వదులుతున్నామని అధికారికంగా చెబుతున్నప్పటికీ అంతకు మించిన మురుగునీరు, పారిశ్రామిక వ్యర్థాలు  కలుస్తున్నాయంటూ పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.  మూసీలో కలుస్తున్న మురుగునీటితో నది పరివాహక ప్రాంతంలోని భూగర్భ జలాలు విషతుల్యమైతున్నాయని కూడా హెచ్చరిస్తున్నారు. నది వెంబడి సీవరేజీ ప్లాంట్లను ఏర్పాటు చేసి మురుగునీటిని శుద్ధి చేయాలంటూ రూపొందించిన ప్రణాళికలు ఇప్పటికీ కార్యరూపంలోకి రాకపోవడంతో మేధావులు, పర్యావరణ వేత్తల ఆవేదన ప్రభుత్వానికి పట్టడం లేదు.  

బ్రిడ్జిల నిర్మాణం అంతే..

ముసారంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జిల నిర్మాణం ఆలస్యమైతుంది.  ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల గేట్లు ఎత్తిన సమయంలో మాత్రమే వీటి ప్రస్తావన వస్తుంది.  ఆ తర్వాత నిర్మాణాలను పట్టించుకోవడం లేదు. 2020, 2021లో భారీ వరదల కారణంగా ఆయా బ్రిడ్జిల పై నుంచి వరద ప్రవహించడంతో  క్లోజ్​ చేశారు. అప్పట్లో వీటి స్థానంలో కొత్తగా నిర్మించాలని ప్రతిపాదించారు.  మూసీ, ఈసీ నదులపై  ప్రజలకు ఇబ్బందులు అయ్యే చోట రూ.545 కోట్లతో 15 బ్రిడ్జిలను వెంటనే నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులు కూడా జారీ చేసింది.  ఇందులో  ముసారంబాగ్ సహా మరో ఆరు చోట్ల పనులకు సంబంధించి గత నెలలో మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు.  కానీ పనులు మాత్రం జరగడం లేదు. ఇంకా  భూసేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. రెవెన్యూ అధికారులు మొదట్లో  హడావిడి చేసినప్పటికీ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో పక్కన పెట్టేశారు. మూసీపై బ్రిడ్జిలు నిర్మించే చోట మాత్రమే భూసేకరణను చేయకుండా నదికి ఇరువైపుల ఆక్రమణలు తొలగిస్తామని అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడంతోనే సమస్య తలెత్తింది. ముసారంబాగ్, చాదర్ ఘాట్, ఇబ్రహీంబాగ్, అత్తాపూర్  నాలుగుచోట్ల రూ.168 కోట్లతో జీహెచ్ఎంసీ, మిగతా 11 చోట్ల రూ.377 కోట్ల ఫండ్స్​ని హెచ్ఎండీఎ  ఖర్చు చేయాల్సి ఉంది.  అయితే ఏళ్లుగా   ఈ ప్రపోజల్స్​ఉన్నప్పటికీ పనులు మాత్రం ముందుకు సాగడంలేదు.

ఎన్నోసార్లు హామీలు

గుజరాత్ లోని సబర్మతి నది తరహాలో మూసీ ని డెవలప్ చేస్తామని గతంలో మంత్రి కేటీఆర్ పలుమార్లు ప్రకటించారు. 2016 లో బల్దియా ఎన్నికల సమయంలో మూసీ అభివృద్ధి హామీ ఇచ్చారు.  గెలిచిన తర్వాత 2017 జులైలో అప్పటి మేయర్, అధికారులతో కలిసి సబర్మతి నదిని చూసి వచ్చారు.  అదే ఏడాది ఆగస్టులోనే  మూసీ రివర్ ఫ్రంట్​ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని  స్పష్టం చేశారు.  కానీ.. మళ్లీ ఎన్నికలు వచ్చినా పనులే చేయ లేదు. 2020లో జరిగిన బల్దియా ఎన్నిక ల్లోనూ మూసీ బ్యూటిఫికేషన్, పరిరక్షణపై ఎన్నో హామీలు ఇచ్చారు.  ఈ ఏడాది మరోసారి మూసీపై ఎక్స్​ప్రెస్​వేలు రాబోతున్నట్లు  చెప్పా రు.  ఇరువైపులా ఎక్స్ ప్రెస్​ వే  వేయాలని ప్లాన్ ఉన్నా నిధులు లేక ముందుకు సాగలేదు.