వడ్ల పైసలు టైముకిస్తలేరు!

వడ్ల పైసలు టైముకిస్తలేరు!
  • 15 రోజులైనా రైతుల చేతికందని పైకం
  • ‘48 గంటల్లో చెల్లింపు’ వట్టిమాటే
  • కొనుగోలు కేంద్రాల్లోనూ ఇబ్బందులే
  • తేమ పేరుతో బస్తాకు రెండు కిలోలు ‘కోత’
  • మిల్లులకు తరలిం చాక కూడా మరింత కటింగ్

హైదరాబాద్‌, వెలుగు: ఐకేపీ కేంద్రాలు, మార్కెట్లలో ధాన్యం అమ్మిన రైతులకు కేవలం 48 గంటల్లో డబ్బులు చెల్లిస్తున్నామని అధికారులు చెబుతున్న మాటలకు, క్షేత్రస్థాయిలో జరుగుతున్న దానికి ఏ మాత్రం పొంతన ఉండడం లేదు. ధాన్యం అమ్మి 15 రోజులు గడుస్తున్నా పైసలు అకౌంట్లలో పడడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తేమ పేరుతో ఇష్టారాజ్యంగా కోతలు విధిస్తున్నారని, 42 కిలోలు తూకం వేసి 40 కిలోలకే లెక్కకడుతున్నారని చెబుతున్నారు. ఎండలు దంచికొడుతున్నా, ధాన్యం ఎండి ఉన్నా కూడా తేమ పేరుతో ఇబ్బంది పెడుతున్నారని చెబుతున్నారు. కొన్ని సందర్భాల్లో కాంటా పెట్టిన వడ్లను లారీల్లో మిల్లులకు తరలించిన తర్వాత కూడా తేమ ఎక్కువుందని, ధాన్యం బాగోలేదని, వెనక్కుపంపుతున్నారని బెదిరిస్తూ డబ్బులు డిమాండ్‌‌‌‌ చేస్తున్నారని వాపోతున్నారు. ఇటీవల మంథని మార్కెట్ యార్డులో ఓ రైతును ఇలాగే బెదిరించి చెల్లింపుల్లో వెయ్యి రూపాయల వరకు కోత విధించారు. ఇక ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎలాంటి వసతులుండడం లేదు. టార్ఫాలిన్లు అందుబాటులో లేక చిరుజల్లు పడినా వడ్లు తడవాల్సిందే. నిలువనీడ లేకపోవడంతో రైతులు ఎండలోనే వడ్లకు కాపలా ఉంటున్నారు. దీంతో ఎండదెబ్బ తగిలి అస్వస్థతకు గురవుతున్నారు.

ఇబ్బంది పెడుతున్న ఆన్‌‌‌‌లైన్‌‌‌‌

ఐకేపీ సెంటర్లలో రైతుల వివరాలు నమోదు చేస్తున్నప్పుడు కొన్ని నిబంధనలు ఇబ్బంది పెడుతున్నాయి. భూములు తండ్రి పేరున ఉండడం, అకౌంట్‌‌‌‌ కొడుకు పేరున ఉండడం వంటిది సమస్యగా మారాయి. భూమి ఎవరి పేరుపై ఉంటే అకౌంట్‌‌‌‌ కూడా వారి పేరునే ఉండాలన్న నిబంధనతో ఆలస్యమవుతోంది. కొన్ని ఏరియాల్లో ఇంటర్నెట్‌‌‌‌ సరిగా పనిచేయక వివరాల నమోదు లేటవుతోంది. ఇవన్నీ డబ్బులు ఆలస్యంగా అందడానికి కారణాలని అధికారులు చెబుతున్నారు

టార్గెట్‌‌‌‌ అయిపోయింది.. క్లోజ్‌‌‌‌ చేయండి

కొన్ని జిల్లాల్లో ఐకేపీ సెంటర్లను మూసివేస్తూ ధాన్యంతో వచ్చిన రైతులను వెనక్కు పంపిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ మిల్లులు తక్కువగా ఉండడంతో వాటికి ఎన్ని టన్నులు ట్యాగ్‌‌‌‌ ఇస్తే అన్నే పంపించాలి. ఉదాహరణకు మహబూబాబాద్‌‌‌‌ జిల్లాలో బాయిల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ మిల్లులు ఏడు మాత్రమే ఉన్నాయి. వాటికి పంపాల్సిన కోటా పూర్తవడంతో జిల్లాలో కొనుగోలు కేంద్రాలను మూసెయ్యాలని అధికారులు మౌఖిక ఆదేశాలిస్తున్నారు. ఇలా పలు జిల్లాల్లో చాలా సెంటర్లు నాలుగైదు రోజుల్లో మూతపడనున్నాయి.

21.44 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నులు కొన్నాం

ఈ యాసంగిలో 40 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నుల ధాన్యాన్ని కొనాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటికి 3,447 కొనుగోలు కేంద్రాల ద్వారా 3.52 లక్షల మంది రైతుల నుంచి 22.31 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌‌‌‌ అకున్‌‌‌‌ సబర్వాల్‌‌‌‌ తెలిపారు. ఇందులో 21.44 లక్షల మెట్రిక్‌‌‌‌ టన్నులను రైస్‌‌‌‌ మిల్లులకు తరలించినట్టు చెప్పారు.