ప్రైవేటు కాలేజీలకు తాళాలు..నేటి (నవంబర్ 4) నుంచి జరిగే పరీక్షలన్నీ బహిష్కరణ

ప్రైవేటు కాలేజీలకు తాళాలు..నేటి (నవంబర్ 4) నుంచి జరిగే పరీక్షలన్నీ బహిష్కరణ
  • ఫీజు రీయింబర్స్​మెంట్ బకాయిల కోసం మేనేజ్​మెంట్ల ఆందోళన 

హైదరాబాద్, వెలుగు: ఫీజు రీయింబర్స్ మెంబ్  బకాయిల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు ఆందోళన బాట పట్టాయి. సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెకు దిగాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, బీఈడీ తదితర 14 రకాల కోర్సులకు సంబంధించిన కాలేజీలు మూతపడ్డాయి. ఆయా కాలేజీలకు తాళాలు వేసి నిరసన తెలిపాయి. 

 రాష్ట్రంలో 2,300 దాకా కాలేజీలుంటే తొలిరోజు రెండు వేల దాకా కాలేజీలు సమ్మెలో పాల్గొన్నాయని మేనేజ్ మెంట్ల సంఘం ప్రకటించింది. మంగళవారం నుంచి జరిగే పలు పరీక్షలనూ బహిష్కరిస్తున్నామని సంఘం తెలిపింది. సోమవారం హైదరాబాద్​లో ఫెడరేషన్  ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్  ఇన్ స్టిట్యూషన్స్ (ఫతీ) ఈసీ సమావేశమైంది. భేటీ అనంతరం ఫతీ చైర్మన్  రమేష్ బాబు మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌‌‌‌మెంట్  బకాయిల చెల్లింపు విషయంలో ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్లను పరిష్కరించే వరకు  కాలేజీల బంద్ కొనసాగుతుందన్నారు. ‘‘సుమారు రూ.10 వేల కోట్ల బకాయిలున్నాయి. 5 వేల కోట్లు చెల్లించే వరకు సమ్మె కంటిన్యూ చేస్తాం. బకాయిలు అడిగితే ప్రభుత్వం బెదిరిస్తున్నది.  నాలుగేండ్లుగా కాలేజీలకు డబ్బులు ఇవ్వకుండా.. విజిలెన్స్  దాడులు చేస్తామని బెదిరించడం కరెక్టేనా?’’ అని రమేష్​ బాబు వ్యాఖ్యానించారు. ఫతీ వైస్ చైర్మన్  అల్జాపూర్  శ్రీనివాస్  మాట్లాడుతూ... ఫీజు రీయింబర్స్ మెంట్  స్కీమ్ ను ప్రభుత్వం నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. భేటీలో ఫతీ సెక్రటరీ జనరల్  సునీల్ కుమార్, ట్రెజరర్  కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.

 

మినిస్టర్స్ క్వార్టర్స్ ను ముట్టడించిన ఎస్ఎఫ్ఐ

తక్షణమే పెండింగ్ లో ఉన్న బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో హైదరాబాద్  మంత్రుల నివాస సముదాయాలను ముట్టడించారు. ఆందోళనకారులను ప్రధాన గేటు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఎస్.రజనీకాంత్, టి.నాగరాజు మాట్లాడుతూ బకాయిలను విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు.  ప్రస్తుతం మొత్తం రూ.10,500 కోట్లు బకాయిలు ఉన్నాయని తెలిపారు.