అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. 132 ఎకరాల భూమి జప్తు

 అనిల్ అంబానీకి ఈడీ మరో షాక్.. 132 ఎకరాల భూమి జప్తు
  • దీని విలువ రూ.4,462.81  కోట్లు
  •     ఇప్పటికే రూ.7,545 కోట్ల ఆస్తుల అటాచ్ 

ముంబై:  బ్యాంక్ మోసం కేసు దర్యాప్తులో భాగంగా  అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్  ఆస్తులను మరోసారి  ఎన్‌‌‌‌ఫోర్స్‌‌‌‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)  అటాచ్ చేసింది. నవీ ముంబైలోని ధీరూభాయ్ అంబానీ నాలెడ్జ్ సిటీలో ఉన్న 132 ఎకరాల భూమిని జప్తు చేసింది. దీని విలువ రూ.4,462.81 కోట్లు.  

ఈ ఏడాది అక్టోబర్ 31న  అనిల్ అంబానీ గ్రూప్‌‌‌‌కు చెందిన సంస్థలతో లింక్ ఉన్న రూ.3,084 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. ఈ ఆస్తులు  ఢిల్లీ, నోయిడా, ఘాజియాబాద్, ముంబై, పుణె, థానే, హైదరాబాద్, చెన్నై, కాంచీపురం, తూర్పు గోదావరిలలో ఉన్నాయి. దీంతో రిలయన్స్ గ్రూప్‌‌‌‌కు చెందిన కేసుల్లో ఇప్పటివరకు జప్తు చేసిన ఆస్తుల మొత్తం విలువ రూ.7,545 కోట్లకు చేరింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌‌‌‌ఏ), 2002 ప్రకారం ఈ చర్య  తీసుకున్నామని ఈడీ పేర్కొంది. 

రూ.40 వేల కోట్లకు పైగా రుణాలు

ఆర్‌‌‌‌‌‌‌‌కామ్, రిలయన్స్‌‌‌‌ కమర్షియల్ ఫైనాన్స్‌‌‌‌,  రిలయన్స్‌‌‌‌ హోమ్‌‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ వంటి రిలయన్స్ గ్రూప్  సంస్థలు 2010–2012 మధ్య దేశీయ, విదేశీ బ్యాంకుల నుంచి రూ.40,185 కోట్ల రుణాలు తీసుకున్నట్లు ఈడీ తెలిపింది. ఇందులో ఐదు బ్యాంకులు ఈ ఖాతాలను మోసపూరితంగా ప్రకటించాయి. ఈడీ దర్యాప్తు ప్రకారం, ఒక సంస్థ తీసుకున్న రుణాన్ని మరో సంస్థ రుణం తీర్చడానికి వాడటం, సంబంధిత పార్టీలకు బదిలీ చేయడం, మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి పెట్టడం వంటి చర్యలు చోటుచేసుకున్నాయి. 

రూ.13వేల కోట్లు “ఎవర్‌‌‌‌ గ్రీనింగ్ (అప్పులతో అప్పులు తీర్చడం)” కోసం, రూ.12వేల కోట్లు సంబంధిత పార్టీలకు, రూ.1,800 కోట్లు ఫిక్స్‌‌‌‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్లలో నిలిపి, తిరిగి గ్రూప్ సంస్థలకు మళ్లించడానికి వాడారు. యెస్‌‌‌‌ బ్యాంక్–రిలయన్స్‌‌‌‌ లింక్‌‌‌‌పై కూడా దర్యాప్తు కొనసాగుతోంది. 2017–2019 మధ్య యెస్‌‌‌‌ బ్యాంక్, రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌‌‌‌లో  రూ.2,965 కోట్లు, రిలయన్స్ కమర్షియల్ ఫైనాన్స్‌‌‌‌లో రూ.2,045 కోట్లు పెట్టుబడి పెట్టింది. ఇవి 2019 చివరికి మొండిబాకీలుగా మారాయి.  

రుణాల మంజూరులో తీవ్రమైన నియంత్రణ లోపాలు ఉన్నాయని ఈడీ, సీబీఐలు గుర్తించాయి.  కొన్ని సందర్భాల్లో అప్పులు మంజూరు కాకముందే డబ్బు విడుదల చేయడం, డాక్యుమెంటేషన్ లోపాలు, భద్రతా హామీలు లేకపోవడం వంటి అంశాలు  ఉన్నాయని  పేర్కొన్నాయి. యెస్‌‌‌‌ బ్యాంక్ మాజీ సీఈఓ రాణా కపూర్, అనిల్ అంబానీ కలిసి రూ.2,700 కోట్లకు పైగా నష్టం కలిగించే కుట్రలో భాగమయ్యారని వివరించాయి.