కోయంబత్తూర్: కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. అత్యాచార నిందితులపై పోలీసులు కాల్పులు జరిపారు. వెల్లకినారులోని ఓ ఆలయం దగ్గర దాక్కున్న ముగ్గురు నిందితులపై పోలీసులు కాల్పులు జరిపి నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించగా వాళ్ల కాళ్లపై కాల్పులు జరిపి పోలీసులు అరెస్ట్ చేశారు. శివగంగకు చెందిన తవసి, కరుప్పస్వామి, కాళేశ్వరన్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముగ్గురిపై ఇప్పటికే హత్య, దోపిడీ, దాడితో సహా ఇప్పటికే 5 కేసులు నమోదయినట్లు పోలీసులు తెలిపారు.
కోయంబత్తూరులో ఓ కాలేజీ విద్యార్థినిని ముగ్గురు వ్యక్తులు కిడ్నాప్ చేసి, సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన తమిళనాడులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రాత్రి యువతి తన బాయ్‌ఫ్రెండ్‌తో కలిసి కారులో బయటకు వచ్చింది. కోయంబత్తూరు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఏరియాలో కారును ఆపి ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు. అదే టైంలో అక్కడికి ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి.. కారును చుట్టుముట్టారు.
బాయ్ ఫ్రెండ్‌ను ఇష్టమొచ్చినట్టుగా కొట్టి, యువతిని బలవంతంగా కారులోంచి లాగి మరో ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ముగ్గురూ అత్యాచారానికి పాల్పడ్డారు. తరువాత బాధితురాలిని రోడ్డుపై వదిలేసి నిందితులు పారిపోయారు. తీవ్ర భయాందోళనకు గురైన బాధితురాలు.. సమీప పోలీస్ స్టేషన్‌కు చేరుకుని ఫిర్యాదు చేసింది. బాధితురాలిని పోలీసులు ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
