కార్మిక సంఘాలను చర్చలకు పిలవండి:హైకోర్టు

కార్మిక సంఘాలను చర్చలకు పిలవండి:హైకోర్టు
  • కార్పొరేషన్ కు, సర్కారుకు బాధ్యత ఉంది
  • రాష్ట్ర ప్రభుత్వమే చర్చల్ని పర్యవేక్షించాలి
  • సీఎం ఆఫీసుకు అందిన హైకోర్టు ఆర్డర్ కాపీ
  • 18న విచారణ ఆధారంగా ఆదేశాలిచ్చిన సీజే బెంచ్

హైదరాబాద్, వెలుగు:

రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ మేనేజ్ మెంట్ కార్మిక సంఘాలతో చర్చలు జరపాలని రాష్ట్ర హైకోర్టు స్పష్టమైన ఆదేశాలిచ్చింది. కార్మికుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని చెప్పింది. రెండు వర్గాలు కొట్లాడుకుంటే మధ్యలో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె, దసరా సెలవుల పొడిగింపుపై దాఖలైన నాలుగు పిటిషన్లను ఈనెల 18న హైకోర్టు సీజే ఆర్‌‌. ఎస్‌‌ చౌహన్‌‌, జస్టిస్‌‌ అభిషేక్‌‌రెడ్డి బెంచ్‌‌ విచారించింది. అన్ని వర్గాల వాదనలు విన్న తర్వాత కార్మికులతో చర్చలు జరపాలని ఆదేశించింది. ఈ ఆర్డర్ కాపీ మంగళవారం సీఎం ఆఫీసుకు అందింది. కోర్టు ఆర్డర్ లో ఆర్టీసీ మేనేజ్ మెంట్ ను, కార్మికులను చర్చలకు పిలిచి, పర్యవేక్షించాలని సర్కారును ఆదేశించింది.

‘‘ప్రభుత్వానికి కార్మికుల అవసరాలను తీర్చాల్సిన బాధ్యత మాత్రమే కాదు ప్రజల అవసరాలను, సౌకర్యాలను తీర్చాల్సిన నైతిక, రాజ్యాంగ బాధ్యత ఉంది. అందువల్ల ప్రభుత్వం రెండు వర్గాలను సంప్రదింపులకు రప్పించాలి. కోర్టు న్యాయాధికారానికి పరిమితి ఉంది. కార్మికుల డిమాండ్లను ఆమోదించాలని మేం ఆదేశించలేకపోయినా, సామాన్యుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని రెండు వర్గాలకూ వారి రాజ్యాంగ బాధ్యతలను గుర్తుచేసే అధికారం మాకుంది. రెండు వర్గాలు సంప్రదింపులతో వివాదాన్ని త్వరగా పరిష్కరించుకోవాలి. మీరు మీరు కొట్లాడుకుంటూ ఉంటే అటు ప్రజలు, మహిళలు, పిల్లల ఇక్కట్లు కొనసాగుతున్నాయి. అందువల్ల కార్పొరేషన్, రాష్ట్ర ప్రభుత్వం కార్మిక సంఘాలను చర్చలకు పిలవాలని ఆదేశిస్తున్నాం. కార్మికుల డిమాండ్లలో పరిష్కంచేవి, పరిష్కరించలేనివి అన్నింటిపైనా వేగంగా చర్చించాలి. ట్రాన్స్ పోర్ట్ యాక్ట్ ప్రకారం కార్పొరేషన్ ను ఆదేశించే అధికారం ప్రభుత్వానికి ఉంది కాబట్టి రెండు వర్గాల మధ్య చర్చలను పర్యవేక్షించాలని ఆదేశిస్తున్నాం. అక్టోబర్ 28 నాటికి చర్చలు సక్సెస్ అయ్యాయని చెబుతారనీ, దీంతో సామాన్యుల ఇబ్బందులు తీరుస్తారని ఆశిస్తున్నాం’’ అని కోర్టు ఆర్డర్ లో ఉంది.

చర్చలకు పిలవొద్దని చట్టంలో లేదు

ఏఏజీ చెప్పిన వాదనలో కొన్ని అంశాలను తప్పుగా ప్రస్తావించారని కోర్టు చెప్పింది. ‘‘ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ లోని సెక్షన్ 2(పి) ప్రకారం కన్సీలియేషన్ ప్రక్రియలోగానీ, దాంతో సంబంధం లేకుండాగానీ రెండు వర్గాలు ‘సెటిల్ మెంట్’ చేసుకునే అవకాశం ఉంది. కన్సీలియేషన్ ద్వారా మాత్రమే సెటిల్ మెంట్ జరగాలనేం లేదు. సంప్రదింపులు ఫెయిలయ్యాయి కాబట్టి కార్పొరేషన్ మళ్లీ చర్చలకు పిలిచే అవకాశం లేదన్న ఏఏజీ వాదన సరికాదు. చట్టంలోని సెక్షన్ 18 కూడా కన్సీలియేషన్ ప్రక్రియతో సంబంధం లేకుండా యాజమాన్యం, కార్మికుల మధ్య సెటిల్ మెంట్ చేసుకోవచ్చని చెబుతోంది.

దీనికి రెండు వర్గాలు కట్టుబడి ఉండాలని కూడా ఈ సెక్షన్ స్పష్టంగా చెబుతోంది. అందువల్ల కార్పొరేషన్ గానీ, ప్రభుత్వంగానీ కార్మిక సంఘాలను చర్చలకు పిలవకూడదని యాక్ట్ లో ఏ నిబంధనా లేదు. సెక్షన్ 33ని కూడా ఏఏజీ తప్పుగా ప్రస్తావించారు. కన్సీలియేషన్ ప్రక్రియ పెండింగ్ లో ఉన్నా, వివాదం ఆర్బిట్రేటర్, లేబర్ కోర్టు, నేషనల్ ట్రైబ్యునల్ లాంటి వాటిలో పెండింగ్ లో ఉన్నాకూడా ఈ సెక్షన్ వర్తిస్తుంది. ప్రస్తుతం సంప్రదింపుల ప్రక్రియ పెండింగ్ లో లేదని ఒప్పుకున్నారు. పైగా ప్రభుత్వం కూడా కార్మికుల డిమాండ్ల అంశాన్ని లేబర్ కోర్టుకు రిఫర్ చేయలేదు. అలాగే కార్మికులకు వ్యతిరేకంగా సర్వీస్ విధానాల్లో మార్పులు చేయవద్దని మాత్రమే ఈ సెక్షన్ చెబుతోంది. కార్మికుల డిమాండ్లను పరిష్కరించడం వారి ప్రయోజనాలకు వ్యతిరేకం కాదు కాబట్టి ఏఏసీ వాదన సరికాదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది.

కార్మిక సంఘాల తరపున వాదించిన సీనియర్ అడ్వొకేట్ డి.ప్రకాశ్ రెడ్డి… ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న డిమాండ్ ను ఒప్పుకుంటేనే చర్చలకు వస్తామని ఎలాంటి షరతు పెట్టలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. మేనేజ్ మెంట్, ప్రభుత్వం చర్చలకు పిలిస్తే వెళ్లడానికి కార్మిక సంఘాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. కార్మికుల డిమాండ్లలో చాలావరకు ఆర్థిక భారం లేనివేననీ, అవన్నీ వారి జీవితాలను, పని పరిస్థితులను, బస్సుల పనితీరును మెరుగుపరిచేవేనని హైకోర్టు చెప్పింది. రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కార్పొరేషన్ యాక్ట్ (1950) సెక్షన్ 19 ప్రకారం కూడా కార్మికులకు సదుపాయాలు కల్పించడానికి, నైపుణ్యం పెంచుకునేలా ఏర్పాట్లు చేయడానికి కార్పొరేషన్ కు తగిన అధికారం ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.

నాలుగు పిటిషన్లు

సమ్మెను, సమస్యలు పరిష్కరించని ప్రభుత్వం తీరును చట్టవిరుద్ధంగా ప్రకటించాలని సుబేందర్ సింగ్ వేసిన పిల్ తో పాటు విద్యాసంస్థలకు దసరా సెలవుల పొడిగింపులపై దాఖలైన మూడు రిట్ పిటిషన్లను మొదట ఈనెల 15న హైకోర్టు బెంచ్ విచారించింది. రెండు వర్గాలు మరోసారి సానుకూలంగా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలని సూచించింది. మూడురోజుల టైం ఇచ్చి 18న మళ్లీ విచారణ జరిపింది. మూడురోజుల్లో ఎలాంటి ఫలితం రాలేదని ప్రభుత్వం తరపున అడిషనల్ అడ్వొకేట్ జనరల్ హైకోర్టుకు చెప్పారు. యాజమాన్యానికి, కార్మికులకు మధ్య వివాదం తలెత్తితే దాన్ని ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ (1947) ప్రకారం పరిష్కరించుకోవాలని ఏఏజీ వాదించారు.

యాక్ట్ లోని సెక్షన్ 12 ప్రకారం కన్సీలియేషన్ ఆఫీసర్ ద్వారా వివాదాన్ని పరిష్కరించుకోవాలి. ఈ ప్రక్రియ కూడా ఫెయిలైతే కన్సీలియేషన్ ఆఫీసర్ రిపోర్ట్ ఆధారంగా ఈ అంశం ప్రభుత్వ పరిధిలోకి వస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంలో వివాదాన్ని లేబర్ కోర్టు లేదా ట్రైబ్యునల్ లేదా నేషనల్ ట్రైబ్యునల్ కు పంపాలా, వద్దా అన్నది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని వాదించారు. ఈ పరిస్థితిలో కార్మిక సంఘాలను మళ్లీ చర్చలకు పిలిచే అవకాశం ఆర్టీసీ యాజమాన్యానికి లేదని ఏఏజీ చెప్పారు. సెక్షన్ 33 ప్రకారం సంప్రదింపుల ప్రక్రియ పెండింగ్ లో ఉన్నప్పుడు సర్వీస్ విధానాలను మార్చేలా నిర్ణయం తీసుకునే అధికారం కార్పొరేషన్ కు లేదని వాదించారు. అందువల్ల కార్మిక సంఘాల డిమాండ్లపై కార్పొరేషన్ ఏమీ చేసే పరిస్థితి లేదని ఏఏజీ చెప్పారు. అలాగే ఆర్టీసీని ప్రభుత్వంలోకి తీసుకోవాలన్న డిమాండ్ ను ఒప్పుకుంటేనే చర్చలకు సిద్ధమంటూ కార్మిక సంఘాలు పట్టుబడుతున్నాయని ఏఏజీ అన్నారు.

state government Should discuss with RTC management and Employee unions: High Court