వరదలకు 41 మంది చనిపోయారు.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం

వరదలకు 41 మంది చనిపోయారు.. హైకోర్టుకు తెలిపిన రాష్ట్ర ప్రభుత్వం
  • 5,900 ఎకరాల్లో పంట నష్టం జరిగింది
  • పంట నష్టంపై సర్వే పూర్తి కాలేదు
  • రిపోర్టు వచ్చాక బాధిత రైతులను ఆదుకుంటాం
  • అఫిడవిట్‌‌ దాఖలు చేసిన విపత్తుల 
  • నివారణ శాఖ ముఖ్య కార్యదర్శి

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు, వరదల్లో 41 మంది మృత్యువాతపడ్డారని హైకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. పంట నష్టంపై ఇంకా సర్వే జరుగుతోందని తెలియజేసింది. ‘‘240 ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఐదు వేల ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 5,900 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంపై సర్వే పూర్తి కాలేదు. సర్వే రిపోర్టు వచ్చాక బాధిత రైతులను ఆదుకుంటాం” అని పేర్కొంది. ఈ మేరకు హైకోర్టులో అఫిడవిట్‌‌ను విపత్తుల నివారణ శాఖ ముఖ్య కార్యదర్శి బొజ్జా రాహుల్‌‌ దాఖలు చేశారు. జాతీయ విపత్తుల సహాయక నిబంధనలకు అనుగుణంగా వరద బాధితులను ఆదుకోవడం లేదని పేర్కొంటూ చెరుకు సుధాకర్‌‌ దాఖలు చేసిన పిల్‌‌ను చీఫ్‌‌ జస్టిస్‌‌ అలోక్‌‌ అరాధే, జస్టిస్‌‌ వినోద్‌‌కుమార్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ సోమవారం విచారించింది.

 ప్రభుత్వ స్పెషల్‌‌ ప్లీడర్‌‌ హరేందర్‌‌ పరిషద్‌‌ వాదనలు వినిపిస్తూ, వరద బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. సహాయక చర్యలను ప్రభుత్వం తీసుకుందని చెప్పారు. పంట సర్వే పూర్తి అయ్యాక నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. దీనిపై పిటిషనర్‌‌ లాయర్‌‌ చిక్కుడు ప్రభాకర్‌‌ తీవ్ర అభ్యంతరం చెప్పారు. గ్రౌండ్‌‌ రిపోర్టుకు విరుద్ధంగా గవర్నమెంట్‌‌ అఫిడవిట్‌‌ ఉందన్నారు. దీనిపై జస్టిస్‌‌ వినోద్‌‌ కుమార్‌‌ కల్పించుకుని.. ‘‘ప్రభుత్వ నివేదిక, మీరు చెబుతున్న విషయాలపై బేరీజు వేసి చెప్పండి” అని  సూచించారు. అనంతరం విచారణను మంగళవారానికి వాయిదా వేశారు.