- ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో నిండిన బెడ్లు
- రెమ్డెసివిర్ కొరతతో పేషెంట్ల ఇక్కట్లు
- డిమాండ్‌కు తగ్గట్టు సరిపోని వ్యాక్సిన్
- హోమ్ ఐసోలేషన్‌లో లక్షల మంది
- రోజూ 100 మంది దాకా చనిపోతున్నట్లు
- ఆఫ్ ది రికార్డులో ఆఫీసర్ల వెల్లడి
- డబుల్ మ్యుటెంట్ విస్తరిస్తోంది..
- సీరియస్ కేసులు పెరుగుతయ్: డీహెచ్
- సెల్ఫ్ లాక్డౌన్ దిశగా చాలా పల్లెలు
రాష్ట్రంలో కరోనా ఔటాఫ్ కంట్రోల్‌గా మారుతోంది. వైరస్ అతివేగంగా విస్తరిస్తోంది. రోజూ వేలల్లో కేసులు వస్తున్నాయి. చాలా సీరియస్ కండీషన్‌లో గాంధీ హాస్పిటల్‌కు ప్రతి పది నిమిషాలకో పేషెంట్ వస్తున్నారు. గురు, శుక్రవారాల్లో కలిపి 220 మంది సీరియస్ పేషెంట్లు గాంధీలో అడ్మిట్ అయ్యారు. వీరితో కలిపి అక్కడ కరోనా పేషెంట్ల సంఖ్య ఐదొందలు దాటింది. దీంతో ఆగమేఘాల మీద గాంధీ హాస్పిటల్‌ను మళ్లీ పూర్తి కొవిడ్ హాస్పిటల్‌గా మార్చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హడావుడిగా అక్కడి నాన్ కొవిడ్ పేషెంట్లను డిశ్చార్జ్ చేశారు. సీరియస్ కండీషన్‌లో ఉన్నవాళ్లను వేరే హాస్పిటళ్లకు తరలించారు. కరోనా సీరియస్ పేషెంట్లను గాంధీలో అడ్మిట్ చేసుకొని, వాళ్ల ఆరోగ్యం కొంత కుదుటపడగానే ఇతర కరోనా హాస్పిటళ్లకు పంపించనున్నట్టు ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
ఇదే విషయంపై డీఎంఈ రమేశ్‌రెడ్డిని వివరణ కోరగా.. రెండు, మూడు రోజుల నుంచి చాలా ఎక్కువ కేసులు వస్తున్నాయని, అందుకే నాన్ కొవిడ్ సేవలు బంద్ పెట్టామని చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా మన దగ్గర కూడా కరోనా పేషెంట్లు అంబులెన్సుల్లో వెయిట్ చేసే పరిస్థితి రావొద్దన్న ఉద్దేశంతోనే ఇలా చేశామన్నారు. కరోనా ట్రీట్‌మెంట్ అందిస్తున్న ప్రభుత్వ హాస్పిటళ్ల సంఖ్యను పెంశారు. గురువారం వరకూ 72 ప్రభుత్వ హాస్పిటళ్లలోనే కరోనా ట్రీట్‌మెంట్ అందుబాటులో ఉండగా, శుక్రవారం నుంచి మరో 29 హాస్పిటళ్లలో స్టార్ట్ చేశారు. గాంధీతో పాటు మిగతా హాస్పిటళ్లలోనూ నాన్ కొవిడ్ సేవలు బందయ్యాయి. ఎమర్జెన్సీ కేసులను మాత్రమే అడ్మిట్ చేసుకుంటున్నారు. ఎలక్టీవ్ సర్జరీలన్నింటినీ వాయిదా వేస్తున్నారు. వరంగల్‌లోని ఎంజీఎం హాస్పిటల్‌ను కూడా కొవిడ్ హాస్పిటల్‌గా మార్చేశారు. ఆదిలాబాద్ రిమ్స్‌లో ఏడొందల బెడ్లు ఉంటే, 510 కొవిడ్ కోసమే కేటాయించారు.
బెడ్లు దొరుకుడు కష్టమే
రాష్ట్రంలో కరోనా ట్రీట్‌మెంట్ కోసం దవాఖాన్లలో చేరిన పేషెంట్ల సంఖ్య పది వేలు దాటింది. శుక్రవారం నాటి ప్రభుత్వ బులెటిన్ ప్రకారం ప్రస్తుతం 2,777 ప్రభుత్వ దవాఖాన్లలో, 7,502 మంది ప్రైవేట్ హాస్పిటళ్లలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. ఇంకో నాలుగైదు రోజుల్లో ఈ సంఖ్య 20 వేలు దాటే చాన్స్ ఉందని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. ఇప్పటికే బెడ్ల కోసం పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లలో బెడ్లన్నీ నిండిపోయి, వెయిటింగ్ లిస్టు నడుస్తోంది. రూ.లక్షల్లో అడ్వాన్స్ కడుతున్నా ఆయా హాస్పిటళ్లలో బెడ్లు దొరకని పరిస్థితి నెలకొంది. స్పెషాలిటీ సేవలు అందుబాటులో ఉన్న గాంధీ, కింగ్ కోఠి, టిమ్స్, నిజామాబాద్ జీజీహెచ్ వంటి ప్రభుత్వ దవాఖాన్లలోనూ పేషెంట్లు నిండిపోయారు. పేషెంట్ల బర్డెన్ను తగ్గించుకునేందుకు కొద్దిగా కోలుకోగానే వాళ్లను ఇంటికి పంపించేస్తున్నారు. మైల్డ్, మోడరేట్ సింప్టమ్స్ ఉన్నోళ్లను కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని తిప్పి పంపిస్తున్నారు. వరంగల్‌కు చెందిన ఓ జడ్జి కుటుంబ సభ్యుడ్ని గాంధీ హాస్పిటల్ నుంచి ఇలాగే పంపండంతో, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ దవాఖాన్లలో కలిపి చూస్తే బెడ్ల సంఖ్య భారీగా కనిపిస్తున్నప్పటికీ, అందులో ఆక్సిజన్, ఐసీయూ బెడ్లు 15,498 మాత్రమే ఉన్నాయి. ఇందులో 8 వేల బెడ్లు ఇప్పటికే పేషెంట్లతో నిండిపోయాయి.
ఉక్కిరిబిక్కిరవుతున్న హెల్త్ స్టాఫ్
కరోనా టెస్టులు, వ్యాక్సినేషన్, ఇన్‌పేషెంట్లు, ఔట్ పేషెంట్లతో హెల్త్ కేర్ వర్కర్లు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ పదుల సంఖ్యలో స్టాఫ్ వైరస్ బారిన పడుతున్నారు. పేషెంట్ల దగ్గరకు వెళ్లేందుకు వాళ్లు జంకుతున్నారు. డాక్టర్లు తమను చూడ్డానికే రావడం లేదని పేషెంట్ల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రైవేట్ హాస్పిటళ్లలోనూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ, అక్కడ పేషెంట్లకు ట్యాబ్‌లు ఇచ్చి డాక్టర్లతో వీడియో కాల్స్ మాట్లాడిస్తున్నారు. ప్రభుత్వ దవాఖాన్లలోనూ ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చే ఆలోచన చేస్తున్నట్టు మెడికల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఒకరు చెప్పారు.
రెమ్డెసివిర్ కొరతకు సర్కారే కారణం!
కరోనా టెస్టింగ్ సెంటర్లకు జనం కుప్పలు, తెప్పలుగా వస్తున్నారు. రోజూ లక్ష మందికి టెస్టు చేస్తున్నప్పటికీ, ఇంకా వస్తూనే ఉన్నారు. కొన్ని జిల్లాల్లో శుక్రవారం నాటికే ర్యాపిడ్ యాంటిజెన్ కిట్లు అయిపోయినట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా టెస్టింగ్ కిట్లకు ఫుల్ డిమాండ్ ఉండడంతో, ఫార్మా కంపెనీలు నాలుగైదు రోజులకు ఒకసారి టీఎస్‌ఎంఎస్‌ఐడీసీకి సప్లయ్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. కరోనా పేషెంట్లకు వాడే మందులకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. రెమ్డెసివిర్ ఇంజక్షన్లు దొరక్క ప్రైవేట్ హాస్పిటళ్లలోని పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. హైదరాబాద్‌లోనే నాలుగైదు కంపెనీలు ఈ ఇంజక్షన్లు తయారు చేస్తున్నప్పటికీ, మన దగ్గర కొరత ఉంది. కరోనా కేసులు, పేషెంట్ల సంఖ్య, మరణాలను బట్టి ఆయా రాష్ట్రాలకు ఇంజక్షన్లు సప్లయ్ చేయాలని ఫార్మా కంపెనీలకు కేంద్రం సూచించినట్టు హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు. మన దగ్గర కేసులు, మరణాలు ఎక్కువగానే ఉన్నప్పటికీ, సర్కార్ తక్కువ చేసి చూపిస్తోంది. దీంతో మనకు రెమ్డెసివిర్ ఇంజక్షన్లు తక్కువగా ఇస్తున్నట్టు హెల్త్ ఆఫీసర్లు అంటున్నారు. రెమ్డెసివిర్ ఇంజక్షన్ల కొరతతో కొందరు నకిలీ ఇంజక్షన్లను మార్కెట్లోకి విడుదల చేసి అమ్ముతున్నారు. మరోవైపు, వ్యాక్సిన్ డోసులు కూడా డిమాండ్‌కు తగ్గట్లుగా లేవు. ఇంకో రెండు రోజులకు మాత్రమే ఇప్పుడున్న డోసులు సరిపోతాయని హెల్త్ ఆఫీసర్లు చెప్పారు. ఈలోపల మరిన్ని డోసులు రాకపోతే వ్యాక్సినేషన్ ఆగిపోయే చాన్స్ ఉంది.
రాష్ట్రంలో డబుల్ మ్యుటెంట్
మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తరిస్తున్న కరోనా డబుల్ మ్యూటెంట్ మన రాష్ట్రంలోకి ప్రవేశించిందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. ఈ వేరియంట్ చాలా వేగంగా విస్తరిస్తోందన్నారు. దీని వల్ల సీరియస్ కేసులు కూడా పెరిగే చాన్స్ ఉందని ఆయన హెచ్చరించారు. యూకే వేరియంట్ కేసులు కూడా ఎక్కువగానే వస్తున్నాయన్నారు. మహారాష్ట్ర, కర్నాటక బార్డర్ జిల్లాల్లో కరోనా కేసులు, మరణాలు పెరుగుతున్నాయని, ఆయా రాష్ట్రాల నుంచి కరోనా మ్యూటెంట్ బార్డర్ జిల్లాల్లోకి వస్తోందని హెల్త్ ఆఫీసర్లు చెప్తున్నారు.
అలర్టవుతున్న జనం
కరోనా వేగంగా వ్యాపిస్తుండటంతో జనం అలర్టవుతున్నారు. పలు ప్రాంతాల్లో ముఖ్యంగా పల్లెల్లో జనం గుమిగూడటం చాలా వరకు తగ్గింది. పలు జిల్లాల్లోని గ్రామాల్లో ప్రజలు సెల్ఫ్ లాక్డౌన్ పాటిస్తున్నారు. హైదరాబాద్‌లో రాత్రి 10 గంటల తర్వాత జన సంచారం పెద్దగా కనిపించడం లేదు. మాస్కు పెట్టుకోకుంటే రూ.వెయ్యి ఫైన్ వేస్తామని ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో బయటకు వచ్చేటప్పుడు చాలా మంది మాస్కులతోనే వస్తున్నారు. సినిమా థియేటర్లకు ఆడియెన్స్ తగ్గారు. ఫుల్ సీటింగ్ కెపాసిటీతో టాకీసులు నడుస్తున్నప్పటికీ జనం మాత్రం వెళ్లేందుకు భయపడుతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లకు వెళ్లి తినేవాళ్లూ తగ్గారు. ఆన్లైన్ ఫుడ్ డెలవరీలకు గిరాకీ పెరిగింది.
నిజామాబాద్ జిల్లాలో కంటైన్మెంట్ జోన్లు
కరోనా విజృంభిస్తుండడంతో నిజామాబాద్ జిల్లాలో పలు ఏరియాలను కంటైన్మెంట్ జోన్లుగా ఆఫీసర్లు ప్రకటించారు. 20 కంటే ఎక్కువ పాజిటివ్ కేసులు వచ్చిన ఏరియాలకు వెళ్లే రోడ్లను మూసేశారు. ఆర్మూర్ టౌన్ లో రాజారాంనగర్ కాలనీ, టీచర్స్ కాలనీ, హౌసింగ్ బోర్డు కాలనీ, రాంనగర్ కాలనీని కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించి, బారీకేడ్లను ఏర్పాటుచేశారు. ఆయా కాలనీవాసులు బయటకు రావొద్దని మున్సిపల్ శానిటరీ ఇన్ స్పెక్టర్ మహేశ్ సూచించారు. మాక్లూర్ మండల కేంద్రంలో 2 వార్డులు, వెల్మల్, వెన్నెల (కె), సావేల్, మోర్తాడ్ మండలం సుంకేట గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నెల 12న బోధన్ డివిజన్లోని ఐదు ఊళ్లను కూడా ఆఫీసర్లు కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని చాలా ఊళ్ల ప్రజలు సెల్ఫ్ లాక్‌డౌన్‌ను అమలు చేసుకుంటున్నారు.
