ప‌ద్మ అవార్డు విజేత‌ల‌కు రేపు స‌న్మానం

ప‌ద్మ అవార్డు విజేత‌ల‌కు రేపు స‌న్మానం

హైదరాబాద్, వెలుగు:  ప్రతిష్టాత్మక పద్మ విభూష‌ణ్, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన విజేత‌ల‌ను రాష్ట్ర ప్రభుత్వం ఘ‌నంగా స‌త్కరించనుంది.  ఈ నెల 4న శిల్పక‌ళా వేదిక‌లో నిర్వహించే స‌న్మాన కార్యక్రమానికి రావాలంటూ  మాజీ ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు, ప్రముఖ సినీ న‌టుడు చిరంజీవిని సీఎం రేవంత్ రెడ్డి త‌ర‌ఫున  మంత్రి జూప‌ల్లి  కృష్ణారావు ఆహ్వానించారు.  పద్మ విభూషణ్‌ అవార్డుకు ఎంపికైన సంద‌ర్భంగా వెంకయ్య నాయుడిని జూబ్లీహిల్స్ లోని ఆయ‌న నివాసంలో,  అన్నపూర్ణ స్టూడియోస్ లో చిరంజీవిని మంత్రి జూప‌ల్లి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

శాలువాల‌తో సత్కరించి, పుష్ప గుచ్ఛాలు అంద‌జేసి అభినంద‌న‌లు తెలియ‌జేశారు.  ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారాల‌కు  వెంకయ్యనాయుడు,  చిరంజీవి, ప‌ద్మ శ్రీ పుర‌స్కారాల‌కు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్‌ సోమ్‌లాల్‌, శిల్పకారుడు స్తతి ఆనందాచారిని  రాష్ట్ర ప్రభుత్వం ఘ‌నంగా స‌త్కరించ‌నుంది. ప‌ద్మశ్రీ పుర‌స్కార విజేత‌ల‌కు రాష్ట్ర ప్రభుత్వం త‌ర‌పున ఆహ్వానం అందించాల‌ని సాంస్కృతిక శాఖ అధికారుల‌ను మంత్రి జూప‌ల్లి ఆదేశించారు.