
- జీవో నంబర్ 11 విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం
- ప్రభుత్వంపై రూ.58 కోట్ల భారం
హైదరాబాద్/కరీంనగర్, వెలుగు: సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ వర్తింపజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. పెరిగిన జీతాలు వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న పేస్కేల్ జీవోను పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా శనివారం విడుదల చేశారు. ఇక మీదట సెర్ప్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇవ్వనున్నారు. సీఎం కేసీఆర్ 2018లో ముందస్తు ఎన్నికలప్పుడు సెర్ప్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు.
రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019 జనవరి 19న అసెంబ్లీలో గవర్నర్ ఇచ్చిన స్పీచ్‌లోనూ సెర్ప్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ గురించి ప్రస్తావించారు. ఆ తర్వాత రెగ్యులరైజేషన్ కుదరదని, వారికి ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామని నిరుడు మార్చి 15న బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ ప్రకటించారు. తాజాగా పేస్కేల్ వర్తింపజేస్తూ జీవో 11ను శనివారం విడుదల చేసింది. దీంతో సెర్ప్‌లో పనిచేస్తున్న 3,972 మంది ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. అలాగే, రాష్ట్ర ప్రభుత్వంపై ఏటా రూ.58 కోట్ల అదనపు భారం పడనుంది.
క్యాడర్ వారీగా శాలరీ ఇలా..
రాష్ట్రంలో టెన్త్ క్వాలిఫికేషన్‌తో ఆఫీస్ సబార్డినేట్ క్యాడర్లో పనిచేస్తున్న 716 మంది మండల సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్లకు, 21 మంది మండల ప్రజాప్రతినిధులు/డివిజనల్ రిప్రజెంటేటివ్ పర్సన్స్‌కు, మరో 110 మంది ఆఫీస్ సబార్డినేట్లకు సీనియారిటీని బట్టి రూ.19 వేల నుంచి రూ.58,850 పేస్కేల్ ఫిక్స్ చేశారు. ఇంటర్ క్వాలిఫికేషన్‌తో పనిచేస్తున్న 338 మంది మండల బుక్ కీపర్స్‌కు సీనియారిటీని బట్టి రూ.22,240 నుంచి రూ.67,300 చెల్లించనున్నారు. డిగ్రీ క్వాలిఫికేషన్‌తో పనిచేస్తున్న 1,719 మంది కమ్యూనిటీ కోఆర్డినేటర్ల(జూనియర్ అసిస్టెంట్)కు, 155 మంది అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్/ప్రాజెక్టు సెక్రటరీలకు సీనియారిటీని బట్టి రూ.24,280 నుంచి రూ.72,850 ఇవ్వనున్నారు.
పీజీ క్వాలిఫికేషన్‌తో పనిచేస్తున్న 697 మంది ఏపీఎం(సీనియర్ అసిస్టెంట్)లకు రూ.32,810 నుంచి రూ.96,890, అలాగే 160 మంది డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ల (సూపరిటెండెంట్ క్యాడర్)కు రూ.42,300 నుంచి రూ.1,15,270, ప్రాజెక్టు మేనేజర్లు(ఎంపీడీఓ క్యాడర్)గా పనిచేస్తున్న 37 మందికి రూ.51,320 నుంచి రూ.1,27,310 వరకు సాలరీ ఇవ్వనున్నారు. 21 మంది డ్రైవర్లకు రూ.22,900 నుంచి రూ.69,150 వరకు జీతం చెల్లించనున్నారు. సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ అమలుపై ఆ ఉద్యోగ సంఘాల స్టేట్ జేఏసీ నాయకుడు కుంట గంగాధర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.