సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండండి
  • భద్రాద్రి, ములుగులో మలేరియా కేసులు పెరుగుతున్నాయి
  • రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు

హైదరాబాద్: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు విజృంభించే ఛాన్స్ ఉందని, ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సూచించారు. సోమవారం బీఆర్కేఆర్ భవన్ లో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఐదేళ్లకోసారి డెంగ్యూ వ్యాధి విజృంభించే అవకాశం ఉందన్నారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలు, వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల డెంగ్యూతో పాటు మలేరియా, టైఫాయిడ్ కేసులు పెరుగుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా భద్రాద్రి, ములుగు జిల్లాల్లో మలేరియా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయన్న మంత్రి... వాటి కట్టడికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.

డెంగ్యూ విషయంలో జాగ్రత్తగా ఉండాలన్న ఆయన... ప్రతి జిల్లాలో ప్లేట్ లెట్ ల కోసం హాస్పిటల్ ను కేటాయించామని పేర్కొన్నారు. అలాగే గ్రామాల్లో మలేరియా, డెంగ్యూ కిట్లు అందుబాటులో ఉంచామని, స్కూళ్లు, కాలేజీలు, ఇతర ప్రైవేట్ సంస్థల్లో ప్రతి శుక్రవారం ‘ఫ్రై డే డ్రై డే ’ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. అదేవిధంగా ఇక నుంచి క్రమం తప్పకుండా ప్రభుత్వ హాస్టళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తారని చెప్పారు. అలాగే ప్రతి ఆదివారం మున్సిపల్, పంచాయతీ అధికారులు ఇంటింటికి వెళ్లి ఇన్స్పెక్షన్ చేయాలని ఆదేశించినట్లు తెలిపారు. 

కరోనా కేసులు పెరుగుతున్నయ్...

దేశ వ్యాప్తంగా రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నయన్ని మంత్రి... రాష్ట్రంలో కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. కరోనా విషయంలో అలసత్వం వద్దని, ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని కోరారు. మాస్కులు, సానిటైజర్లు కచ్చితంగా వాడాలని సూచించారు. ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ వేయించుకోవాలని చెప్పారు. 

కామారెడ్డి వ్యక్తికి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించాం...

కామారెడ్డికి చెందిన వ్యక్తి కి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నట్లు గుర్తించామని చెప్పిన మంత్రి... టెస్టింగ్ కోసం శాంపిల్ ను పూణెకు పంపినట్లు తెలిపారు. ఇతర దేశాల్లో మంకీ పాక్స్ విజృంభిస్తోందన్న మంత్రి... విదేశాల నుంచి వచ్చిన వారు భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఎవరికైనా మంకీ పాక్స్ లక్షణాలు ఉంటే దగ్గర్లోని ఆరోగ్య కేంద్రాలను సంప్రదించాలని కోరారు. మంకీ పాక్స్ కు సంబంధించి శాంపిల్ పరిశీలన కోసం గాంధీ హాస్పిటల్, ఫీవర్ హాస్పిటల్ కు వెళ్లాలని మంత్రి కోరారు.