- లేకపోతే బల్దియా ఆఫీస్‌ను ముట్టడిస్తాం
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి
అమీన్పూర్, వెలుగు: కిష్టారెడ్డిపేట కేంద్రంగా కొత్త డివిజన్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి డిమాండ్ చేశారు. అమీన్పూర్మున్సిపాలిటీలో జీహెచ్ఎంసీ డివిజన్ల ఏర్పాటు పద్ధతి ప్రకారం జరగలేదని, 4 డివిజన్లకు రెండే ఏర్పాటు చేశారని మండిపడ్డారు. కిష్టారెడ్డిపేట డివిజన్ కోసం 8 గ్రామాల ప్రజలు అఖిలపక్షం ఆధ్వర్యంలో కిష్టారెడ్డిపేటలో చేస్తున్న రిలే నిరాహార దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్ష మేరకు అమీన్పూర్మున్సిపాలిటీలో మరో 2 డివిజన్లు ఏర్పాటు చేయాలన్నారు.
పటాన్చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్పూర్, బొల్లారం మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసి, 6 డివిజన్లు మాత్రమే ఏర్పాటు చేశారని తెలిపారు. క్షేత్రస్థాయిలో సర్వే చేయకుండా గూగుల్మ్యాప్ఆధారంగా డివిజన్లు ఏర్పాటు చేయడం సరికాదని పేర్కొన్నారు. కొత్తగా 2 డివిజన్లు ఏర్పాటు చేయకపోతే సంక్రాంతి తర్వాత హైదరాబాద్ బల్దియా ఆఫీస్‌ను 10 వేల మందితో ముట్టడిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీపీ దేవానంద్, మాజీ వైస్ ఎంపీపీ సత్యనారాయణ, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.
భానూరు ఎల్లమ్మ జాతరకు హాజరు
పటాన్చెరు మండలం భానూరులో ఆదివారం నిర్వహించిన రేణుక ఎల్లమ్మ జాతరకు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి హాజరై, అమ్మవారికి పూజలు చేశారు. ఇస్నాపూర్మున్సిపాలిటీ రుద్రారంలో మల్లన్న జాతరకు హాజరయ్యారు. చిట్కుల్లో జీసస్ హౌస్చర్చి పునర్నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. నాయకులు శ్రీశైలంయాదవ్, ఉపేందర్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, శాంతయ్య, దశరథరెడ్డి, వెంకటరెడ్డి తదితరులున్నారు.
మల్లన్న, సోమేశ్వరునికి పూజలు
రామచంద్రాపురం: తెల్లాపూర్ లో ఆదివారం నిర్వహించిన మల్లన్న జాతర, రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మందుమూల శ్రీశ్రీ సోమేశ్వర కల్యాణ మహోత్సవానికి ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి హాజరయ్యారు. స్వామివార్లకు పూజలు చేశారు. పటాన్చెరు నియోజకవర్గ ప్రజలు కుల, మత, వర్గాల ప్రస్తావన లేకుండా పండుగలను కలిసిమెలిసి జరుపుకోవాలని సూచించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్లలిత, కార్పొరేటర్ పుష్ప, మాజీ కౌన్సిలర్లు, నగేశ్ యాదవ్, పరమేశ్, గోవింద్, అంజయ్య, ఐలేశ్యాదవ్తదితరులు పాల్గొన్నారు.
