కొత్త అసెంబ్లీ ఎందుకు: హైకోర్టు

కొత్త అసెంబ్లీ ఎందుకు: హైకోర్టు

రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు

ఇప్పుడున్న బిల్డింగ్ విశాలంగానే ఉంది కదా

ఎమ్మెల్యేల సంఖ్య కూడా తగ్గింది

అసలు ప్లాన్ లేకుండా భూమి పూజ ఎలా చేశారు?

గూగుల్ మ్యాప్తోపాటు అన్ని వివరాలివ్వాలని ఆదేశం 

పాత భవనాల కూల్చివేతపై స్టేకు నో

‘‘వందేండ్లు నిండిన బిల్డింగ్​లోనే హైకోర్టు కార్యకలాపాలు సాగుతున్నాయి. నిర్వహణ బాగున్నప్పుడు కొత్త హైకోర్టు నిర్మించాల్సిన అవసరం ఉంటుందా? సమైక్య రాష్ట్రంలో 294 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. ఇప్పుడా సంఖ్య 119కి తగ్గింది. సౌకర్యాలు చూసుకున్నా బాగానే ఉన్నాయి కదా! ఇప్పుడున్న భవనం విశాలంగా ఉంది. అలాంటప్పుడు కొత్త అసెంబ్లీ ఎందుకు? అసలు ప్లాన్​ సిద్ధం కాకముందే భూమిపూజ ఎలా చేశారు?” అంటూ రాష్ట్ర సర్కారుపై హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పుడున్న అసెంబ్లీ, కొత్తగా ఎక్కడ కట్టబోయేది, ఆ ప్రాంతం గూగుల్​ మ్యాప్ లు, డిజైన్లు, ప్లాన్లు.. సమగ్ర వివరాల్ని అందజేయాలని ఆదేశించింది. పాత భవనాల్ని కూల్చివేయకుండా ఆదేశాలివ్వాలంటూ దాఖలైన పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌‌ ఆర్‌‌ఎస్‌‌ చౌహాన్, న్యాయమూర్తి షమీమ్‌‌ అక్తర్‌‌లతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ శుక్రవారం విచారించింది. కూల్చివేతపై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు బెంచ్​ నిరాకరించింది. తదుపరి విచారణ జులై  8కి వాయిదా వేసింది.

కోర్టుని నమ్మండి

ఎర్రమంజిల్‌‌లోని చారిత్రక భవనాన్ని కూల్చి కొత్త అసెంబ్లీ భవనాల్ని నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్‌‌ చేస్తూ సామాజిక కార్యకర్త లుబ్నా సార్వత్, ఓయూ ఓల్డ్​ స్టూడెంట్​శంకర్‌‌ వేరువేరుగా పిల్స్​ దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌‌ అడ్వొకేట్లు సరసాని సత్యంరెడ్డి, రచనారెడ్డిలు వాదించారు. ఎర్రమంజిల్‌‌లోని హెరిటేజ్ భవనంతోపాటు పక్కనే ఉన్న జలసౌధ భవనాన్ని కూడా కూల్చే ప్రమాదం ఉందని, ఎర్రమంజిల్‌ భవనం 150 ఏళ్ల నాటిదని, దీనిని కూల్చితే తిరిగి కట్టడం కష్టమని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వంపై తమకు నమ్మకంలేదని, విచారణ వాయిదావేస్తే ఆలోపే భవనాల్ని కూల్చే ప్రమాదముంది కాబట్టి తక్షణమే మధ్యంతర ఆదేశాలివ్వాలని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు కోరారు. దీనిపై జడ్జిలు స్పందిస్తూ.. ‘‘మీకు ప్రభుత్వంపై నమ్మకం లేకపోతే కోర్టును నమ్మండి”అని వ్యాఖ్యానించారు. మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు నిరాకరించిన బెంచ్​.. సమగ్ర వివరాలు అందజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

అవి చారిత్రక కట్టడాలు కావు: ఏఏజీ

ప్రభుత్వం తరఫున అడిషనల్​ అడ్వొకేట్​ జనరల్(ఏఏజీ)​ జె.రామచంద్రరావు వాదిస్తూ, పాత భవనాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన నిర్ణయం తీసుకుందని, 2017లో రూపొందించిన హెరిటేజ్​ జాబితాలో ఎర్రమంజిల్​లోని భవనాలు లేవని హైకోర్టుకు తెలిపారు. ప్రభుత్వ పాలసీలపై కలుగజేసుకోరాదంటూ గతంలో సుప్రీంకోర్టు సూచించిందని,  భిన్నాభిప్రాయాలు వ్యక్తమైనంత మాత్రాన ప్రభుత్వ నిర్ణయం అమలుకాకుండా అడ్డుకోరాదని రామచంద్రరావు అన్నారు. అసెంబ్లీ, సెక్రటేరియెట్ఎక్కడ, ఎలాంటి సౌకర్యాలుండాలనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో భాగమని గుర్తుచేశారు. హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలన్నింటికీ కౌంటర్‌లో వివరిస్తామని రామచంద్రరావు చెప్పారు.

‘సెక్రటేరియట్​ బిల్డింగ్’పై  విచారణ వాయిదా

తెలంగాణ సెక్రటేరియెట్​ బిల్డింగ్​ను కూల్చొద్దంటూ దాఖలైన వేర్వేరు పిల్స్​పై విచారణ ఆగస్టు చివరి వారానికి వాయిదా పడింది. 2016లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత టి.జీవన్‌రెడ్డి, న్యాయవాది టి.రజనీకాంత్‌ రెడ్డి, గుడ్‌ గవర్నెన్స్​ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డిలు వేరువేరుగా పిల్స్‌ దాఖలు చేశారు. వీటన్నింటిపై తుది విచారణ ఆగస్టు చివరి వారంలో వింటామని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ఎస్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌లతో కూడిన డివిజన్‌ బెంచ్‌ శుక్రవారం ప్రకటించింది. రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జులై 8న విచారిస్తామని వెల్లడించింది.