నిజామాబాద్, వెలుగు : వడ్లు, మక్కల కొనుగోలు కేంద్రాల కోసం ఏర్పాట్లు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శించారు. బీజేపీ జిల్లా ఆఫీస్‌లో శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ట్రాన్స్‌పోర్ట్, హమాలీలను ఏర్పాటు చేయకపోవడం, గన్నీబ్యాగ్‌లను సకాలంలో అందజేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అకాల వర్షంతో మరింత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
బీఆర్‌ఎస్ హయాంలో కూడా ఇదే పరిస్థితి ఏర్పడిందని... దానిని కాంగ్రెస్ కొనసాగిస్తోందని విమర్శించారు. పేదలకు బియ్యం పంపిణీ చేసేందుకు అవసరమైన మేరకు మాత్రమే వడ్లను కేంద్రం కొనుగోలు చేస్తుంది తప్ప.. వ్యాపారం చేయబోదన్నారు. వడ్లను బియ్యంగా మార్చి ఇథనాల్, రైస్ బ్రాండ్ ఆయిల్ ఉత్పత్తి చేయొచ్చని, విదేశాలకు సైతం ఎగుమతి చేసేందుకు అవకాశం ఉందని.. ఇలాంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేయాలని సూచించారు.
పంట మార్పిడి ప్రణాళిక రాష్ట్ర ప్రభుత్వానికి పట్టడం లేదని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఫీజులు చెల్లించలేని సీఎం రేవంత్‌రెడ్డి.. బీసీలపై ఎక్కడ లేని ప్రేమ ఒలకబోస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన మోసాలు, పాపాలు నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిలిచిపోతాయన్నారు. కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్లు నొక్కేశారని, స్కీమ్‌ల పేరుతో బర్లు, గొర్లను కూడా వదలలేదని ఆరోపించారు.
కాళేశ్వరంపై ఘోష్ కమిటీ రిపోర్ట్ సహా ఫోన్ ట్యాపింగ్, ఈ–కార్ రేసింగ్, డ్రగ్స్ కేసులన్నీ ఎటుపోయాయని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో డ్రగ్స్‌ను ప్రోత్సహించిన బీఆర్‌ఎస్.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతుందన్నారు. ఆయన వెంట ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు దినేశ్, రాష్ట్ర కార్యదర్శి స్రవంతిరెడ్డి ఉన్నారు.
