చిన్నారిపై కుక్కల దాడి.. హెచ్ఆర్సీ సీరియస్

చిన్నారిపై కుక్కల దాడి.. హెచ్ఆర్సీ  సీరియస్
  • సుమోటోగా కేసు స్వీకరణ.. విచారణకు ఆదేశం

హైదరాబాద్ సిటీ/ బషీర్​బాగ్, వెలుగు: ఖైరతాబాద్​లో చిన్నారి శర్విపై వీధి కుక్క దాడి ఘటనను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా పరిగణించింది. వివిధ దినపత్రికల్లో ఈ ఘటనకు సంబంధించి వార్తలు రావడంతో సుమోటోగా కేసును స్వీకరించి విచారణకు ఆదేశించింది. ఈ దాడిని పిల్లల భద్రత, జీవించే హక్కు పరంగా అత్యంత తీవ్రమైన అంశంగా కమిషన్ పేర్కొంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వీధి కుక్కల దాడుల సంఖ్య, వాటి నియంత్రణకు ఇప్పటివరకు తీసుకున్న చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని కమిషన్ జ్యుడీషియల్ సభ్యులు శివాడి ప్రవీణ ఆదేశాలు జారీ చేశారు. ఈ నివేదికను వచ్చే నెల 24వ తేదీలోగా సమర్పించాలని జీహెచ్ఎంసీ కమిషనర్​కు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. 

చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా

దీంతో ఖైరతాబాద్‌లోని శ్రీనివాసనగర్ లో కుక్కల దాడిపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణర్ విచారించారు. కుక్క కాటుకి గురైన 5 ఏండ్ల శర్వి ఆరోగ్యంపై ఆరా తీశారు. చిన్నారి ప్రస్తుతం  బంజారాహిల్స్ రోడ్ నెంబర్2లోని రెయిన్ బో హాస్పిటల్లో ట్రీట్ పొందుతుంది. కుక్కకాటుకి గురైన చోట సర్జరీ చేసినట్లు వెటర్నరీ అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు చెప్పారు.  అలాగే ఖైరతాబాద్ జోన్ వెటర్నరీ డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, వెటర్నరీ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించారు.

దాడి చేసిన కుక్కతో పాటు మొత్తం 17  కుక్కలను  డాగ్ క్యాచింగ్ టీమ్స్ పట్టుకొని షెల్టర్ హోమ్స్ కి తరలించారు. ఈ మేరకు కమిషనర్ కి  రిపోర్ట్ అందజేశారు. పట్టుబడిన కుక్కలకి ఇప్పటికే కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసినట్లుగా గుర్తించామని తెలిపారు.