
హైదరాబాద్, వెలుగు: సమాచార హక్కు చట్టం కింద వేల సంఖ్యలో దరఖాస్తులు, వందల కొద్దీ అప్పీళ్లు దాఖలు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై రాష్ట్ర సమాచార కమిషన్ గురువారం పూర్తిస్థాయి విచారణ చేపట్టింది. ఈ విచారణలో ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డితో పాటు కమిషనర్లు బోరెడ్డి అయోధ్య రెడ్డి, పీవీ శ్రీనివాసరావు, ఎం.పర్వీన్, డి.భూపాల్, వైష్ణవి మేర్ల పాల్గొన్నారు.
ఈ ముగ్గురు వ్యక్తులు దాఖలు చేసిన దరఖాస్తులు, అప్పీళ్ల వల్ల ప్రభుత్వ యంత్రాంగంపై పడుతున్న భారం, వారు కోరుతున్న సమాచార స్వభావం వంటి కీలక అంశాలపై కమిషన్ దృష్టి పెట్టింది. సాధారణంగా రాష్ట్రంలో ప్రతిఏటా 1.2 లక్షల దరఖాస్తులు దాఖలవుతుండగా, 90% మందికి పీఐఓల ద్వారానే సమాచారం లభిస్తోంది.
కేవలం 8% మంది మాత్రమే రెండో అప్పీలుకు కమిషన్ వద్దకు వస్తున్నారు. అయితే ఈ ముగ్గురు వ్యక్తులు మాత్రమే 2,500 కేసుల్లో పీఐఓలతో కలిసి కమిషన్ ముందుకు వచ్చారు. వారిలో శ్రీనివాస్ రెడ్డి ఆర్థిక శాఖ నుంచి నిధులు, బడ్జెట్ వంటి వివరాలపై వేల దరఖాస్తులు చేశారు. వడ్డే శ్యామ్ ఎక్కువగా పురపాలక, డీటీసీపీ శాఖల్లో అనుమతులు, ఓసీల గురించి సమాచారం కోరారు. ఎండీ అష్రాఫ్ దాదాపు 20 జిల్లాల్లో పాఠశాల విద్య, హోమ్, రెవెన్యూ శాఖలపై దృష్టి పెట్టారు.
ఒకే వ్యక్తి వందల సంఖ్యలో అప్పీళ్లు ఎందుకు దాఖలు చేస్తున్నారు? పదేపదే ఎందుకు దరఖాస్తులు చేస్తున్నారు? వారి ఉద్దేశాలు ఏంటి? ఇలాంటి దరఖాస్తులు ప్రభుత్వ పరిపాలనా సామర్థ్యంపై ఎలా ప్రభావం చూపుతున్నాయి? వంటి అంశాలపై కమిషన్ చర్చించింది. అలాగే పీఐఓలు సమాచారం ఇవ్వలేకపోవడానికి కారణాలు, ఇప్పటికే వెబ్‌సైట్లలో ఉన్న సమాచారాన్ని ఎందుకు మళ్లీ అడుగుతున్నారనే అంశాలపై కూడా కమిషన్ లోతుగా విచారించింది.